డిగ్రీలున్నా గిగ్ వర్కలుగా మారుతున్న యూత్.. లక్షలాది అవకాశాలున్నా ఈ తప్పటడుగులెందుకు?
ప్రతి సంవత్సరం కొన్ని లక్షలు మంది డ్రిగీ పట్టాలతో బయటికొస్తున్నారు. ఇందులో కొందరు మాత్రమే మంచి ఉద్యోగాలు సాదించి ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. కానీ ఇలా డిగ్రీ పట్టా చేతితో పట్టుకొని.. సరైన ఉద్యోగ అవకాశాలు దొరక్కా.. ఎంతో మంది పార్ట్‌టైం జాబ్‌గా ఫుడ్ డెలివరీ జాబ్స్‌కు పరిమితమవుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.. మరీ ఇది వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. అసలు యువత ఇలాంటి దారి ఎంచుకోవడానికి కారణాలు ఏమిటి.. తప్పు ఎక్కడ జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం.

కళాశాల నుంచి డిగ్రీ పట్టాతో ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది యువత బయటకు వస్తున్నారు. ఇలా బయటకొచ్చిన ఓ గ్రాడ్యుయేట్ ఓ సాధారణ రెజ్యూమెతో ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ.. సరైన జాబ్ దొకకా తర్వాతి అడుగు ఎటు వేయాలో తెలియని అయోమయంలో పడిపోతుననారు. చివరికి అద్దె బైక్‌పై ఫుడ్ డెలివరీ చేస్తూ, రోజూవారీ ఖర్చులు వెళ్లదీసుకుంటూ, ఎప్పటికైనా తాను చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుందనే ఆశతో ఎదురుచూస్తూ జీవితాన్ని గడిపేస్తున్నారు. మన దేశంలో ఏటా లక్షలాది మంది యువతీ, యువకులు ఎదుర్కొంటున్న ఈ చదువు పూర్తి కావడానికి – సరైన ఉపాధి దొరకడానికి మధ్య ఉండే ఖాళీ వ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
విదేశీ మోడల్ vs భారత వాస్తవాలు
అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పరివర్తన కాలాన్ని అనుకోకుండా వదిలేయకుండా, ఒక పద్ధతి ప్రకారం డిజైన్ చేశారు. ముఖ్యంగా జర్మనీలో అమలవుతున్న డ్యూయల్ అప్రెంటిస్‌షిప్ విధానం ప్రపంచానికే రోల్ మోడల్‌గా నిలుస్తోంది. అక్కడ విద్యార్థులు సగం సమయం తరగతి గదిలో, మిగిలిన సగం వాస్తవ పని ప్రదేశంలో గడుపుతూ వేతనం పొందుతారు. సుమారు 8.3 కోట్ల జనాభా ఉన్న జర్మనీలో దాదాపు 13 లక్షల మంది అప్రెంటిస్‌లుగా ఉన్నారు. అంటే వారి మొత్తం జనాభాలో వీరు 1.5 శాతానికి పైగా ఉంటారు.
భారత్‌లోనూ దీనికి సమానంగా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) ఉంది. కానీ ఇక్కడి గణాంకాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో, 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద నమోదైన అప్రెంటిస్‌ల సంఖ్య కేవలం 9.85 లక్షలు మాత్రమే. అంటే జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే జర్మనీ కంటే ఇది దాదాపు 20 రెట్లు తక్కువ.
అవకాశాలు లేక కాదు.. దరఖాస్తులే కరువు!
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అవకాశాలు లేకపోవడం సమస్య కాదు. అధికారిక నివేదికల ప్రకారం, దేశవ్యాప్తంగా అప్రెంటిస్‌షిప్ పథకం కింద ఏకంగా 70 లక్షలకు పైగా ఖాళీలు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. సమస్య ఖాళీల కొరత కాదు, యువత వీటి కోసం దరఖాస్తు చేయకపోవడమే. 2022లో 42.8 లక్షలుగా ఉన్న దరఖాస్తులు, 2025 నాటికి ఏకంగా 4 లక్షలకు పడిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఖాళీలు ఎందుకు నిండట్లేదు?
చదువు నుంచి కెరీర్‌కు వారధిగా నిలవాల్సిన లక్షలాది పోస్టులను నిరుద్యోగ యువత ఎందుకు ఎంచుకోవడం లేదు? అనే విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తే.. దీని వెనుక బలమైన ఆర్థిక కారణాలు కనిపిస్తున్నాయి. అప్రెంటిస్షిప్లలో సాధారణంగా నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు మాత్రమే స్టైపెండ్ ఇస్తారు. దీనికోసం వేరే నగరాలకు వెళ్లి అక్కడే ఉండాలి.. పైగా ట్రైనింగ్ తర్వాత ఉద్యోగం వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. దీంతో చాలా మంది దీనివైపు మొగ్గుచూపట్లేదని నివేదికలు చెబుతున్నారు.
అదే సమయంలో దీనికి భిన్నంగా ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవింగ్, రిటైల్ స్టోర్లలో పని వంటి గిగ్ ఉద్యోగాలు వెంటనే డబ్బును అందిస్తున్నాయి. సొంత ఊరిలోనే ఉంటూ పనిచేసుకునే వెసులుబాటు ఉండటం, దీర్ఘకాలిక ఒప్పందాలు లేకపోవడంతో కుటుంబ అవసరాలు తీర్చుకోవాల్సిన యువత అప్రెంటిస్‌షిప్ కంటే గిగ్ పనులకే మొగ్గు చూపుతున్నారు.
భవిష్యత్తుకు నష్టమేనా?
గిగ్ వర్క్ తాత్కాలిక ఆదాయానికి, ఉపాధికి మంచి మాధ్యమమే అయినప్పటికీ.. ఇది భవిష్యత్తులో అధిక వేతనాలు, స్థిరమైన కెరీర్‌ను ఇచ్చే సర్టిఫైడ్ నైపుణ్యాలను అందించలేదు. అదే క్రమబద్ధమైన అప్రెంటిస్‌షిప్ అయితే తరగతి గది పాఠాలను పరిశ్రమ అవసరాలకు అనుసంధానించే నైపుణ్యాన్ని ఇస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శిక్షణ ద్వారా కెరీర్‌ను నిర్మించుకోవడం కంటే, చేతికి వెంటనే డబ్బు తెచ్చిపెట్టే తాత్కాలిక పనుల వైపే భారతీయ యువత అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యువత తీసుకుంటున్న ఈ నిర్ణయం వారి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సరైనదే కావొచ్చు. కానీ లక్షలాది ఖాళీలు అందుబాటులో ఉన్నా, ఒక క్రమబద్ధమైన శిక్షణా విధానాన్ని యువత ఎందుకు కాదనుకోవాల్సి వస్తుందన్నదే అసలు ప్రశ్న. వ్యవస్థాగత విధానాలు, స్టైపెండ్ స్థాయిలు, భవిష్యత్ ఉద్యోగ భద్రత వంటి అంశాలలో మార్పులు రానంత వరకు ఈ అంతరం ఇలాగే కొనసాగే ప్రమాదం ఉంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
