AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలూనీళ్లలా పెట్రోల్‌లో కలిసిపోతున్న ఇథనాల్‌.. ఇంతకీ ఈ ఇథనాల్ ఎలా తయారవుతుంది..?

ఇథనాల్‌ కలిసిన E20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇది వాహనాలకు లాభమా నష్టమా? మైలేజ్‌, ఇంజిన్ పనితీరు, ధరలపై వినియోగదారులలో అనుమానాలు మిగిలే ఉన్నాయి. దీనిపై గవర్నమెంట్ ఎలాంటి క్లారిటీ ఇచ్చింది...? పూర్తి వివరాలు ఈ కథనం లోపల తెలుసుకుందాం ..

పాలూనీళ్లలా పెట్రోల్‌లో కలిసిపోతున్న ఇథనాల్‌.. ఇంతకీ ఈ ఇథనాల్ ఎలా తయారవుతుంది..?
Petrol
Ram Naramaneni
|

Updated on: Aug 08, 2025 | 6:33 PM

Share

పెట్రోల్‌లో ఏదన్నా కలిసిందని డౌటొస్తేనే వామ్మో బండికి ఏమవుతుందోనని టెన్షన్‌ పడతాం. కానీ మన ట్యాంకులో పడకముందే.. పెట్రోల్‌లో 20శాతం మరో ఇంధనం కలుస్తోంది. అదేంటో తెలుసా. అదెందుకో తెలుసా. దాంతో లాభమా నష్టమా? దేశవ్యాప్తంగా పెట్రోమిక్సింగ్‌పై డిబేట్ జరుగుతోంది.

పాలూనీళ్లలా పెట్రోల్‌లో ఇథనాల్‌.. ఎస్‌ మీరు వింటోంది నిజమే. 20శాతం ఇథనాల్, 80శాతం పెట్రోల్ కలిపిన మిశ్రమమే E20 పెట్రోల్‌గా చలామణి అవుతోంది. కొత్తగా ప్రవేశపెట్టిందేం కాదు.. 2003లోనే దేశంలో ఇథనాల్‌ బ్లెండింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈబీపీ కింద 2013-14లోనే పెట్రోల్‌లో 38 కోట్ల లీటర్ల ఇథనాల్‌ని కలిపారు‌. 2020-21 నాటికి అది దాదాపు పదింతలు పెరిగి 302 కోట్ల లీటర్లకు చేరుకుంది. వాస్తవానికి 2030 నాటికి దేశంలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలపాలనేది లక్ష్యం. అయితే 2025-26 నాటికే అంటే ఐదేళ్లముందే ఈ లక్ష్యాన్ని సాధించాలనుకుంటోంది కేంద్రం.

అసలేమిటీ ఇథనాల్.. అదెలా తయారవుతుందనేది ఓసారి చూస్తే.. భారత్‌లో ప్రధానంగా చెరకు పంట నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి అవుతుంది. చక్కెర ప్రాసెసింగ్ నుంచి ఇథనాల్‌ తయారీ జరుగుతుంది. వరి పొట్టు, మొక్కజొన్న లాంటి ఇతర పంటల నుంచి కూడా ఇథనాల్‌ తయారవుతుంది. పంటల నుంచి నేరుగా ఉత్పత్తయ్యే ఫస్ట్‌ గ్రేడ్‌ ఇథనాల్‌ని 1G గా పిలుస్తారు. మొలాసిస్ కాకుండా ఇతర పంట వ్యర్థాల నుంచి రెండో గ్రేడ్ ఇథనాల్ 2G. సగటున ఒక టన్ను చెరకు నుంచి 70 లీటర్ల ఇథనాల్ ఉత్పత్తవుతుంది. ఆసక్తికరమైన విషయమేంటంటే లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి 40 లీటర్లకు పైనే నీరు అవసరమవుతుంది.

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ అన్నివిధాలా మంచిదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఇథనాల్ బ్లెండింగ్‌తో చమురు కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. పర్యావరణ పరిరక్షణకు ఇథనాల్‌ దోహదపడుతుందనేది నిపుణుల కమిటీ నివేదించింది.  ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వాడకంతో వాహనాల నుంచి కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. సంవత్సరానికి 3 లక్షల టన్నుల CO2 ఉద్గారాలను నియంత్రించవచ్చని అంచనా. ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌తో వాహనాల ఇంజిన్ల జీవితకాలం పెరుగుతుందంటోంది కమిటీ రిపోర్ట్‌. చెరకు, మొక్కజొన్న తదితర పంట ఉత్పత్తుల రైతులకు ఇథనాల్‌ తయారీతో ఆదాయం. అన్నిటికంటే ముఖ్యంగా చమురు కోసం ఖర్చు చేసే విదేశ మారకద్రవ్యం ఆదా అవుతుంది. పంట వ్యర్థాల నుంచి ఇథనాల్‌ తయారీ పర్యావరణానికి పరోక్షంగా మేలుచేస్తుంది.  ఎందుకంటే ఇథనాల్‌కి మళ్లించడం వల్ల పంట వ్యర్థాల దహనం తగ్గి గాలి కాలుష్య నియంత్రణ అవుతుంది.

కమిటీ నివేదిక ఇచ్చింది. కేంద్రం కూడా మంచిదేనంటోంది. అయినా రోజూ పెట్రోల్‌ కొట్టించుకునే వినియోగదారుల్లో అనుమానాలు.. అపోహలు చాలా ఉన్నాయి.  E20 పెట్రోల్ వినియోగంతో మైలేజ్ తగ్గుతుందని వినియోగదారులు చెబుతుంటారు.  ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వాహనాల ఇంజిన్ పనితీరుపై ప్రభావం చూపుతుందంటున్నారు. ఎప్పట్నించో వాడుతున్న పాత వాహనాలు E10 ఇంధనాన్ని దృష్టిలో పెట్టుకుని తయారైనవి. ఇప్పుడా వాహనాల్లో E20 ఇంధనం వాడితే ఇంజిన్, ఇతర పార్ట్స్‌ పాడయ్యే ప్రమాదం ఉందన్నది వారి ఆలోచన. పైగా పాత వాహనాలకు E20 ఫ్యూయల్‌ వాడితే వారంటీ కూడా వర్తించదనే భయం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో E20 అందుబాటులో ఉన్నా.. ఇథనాల్‌ ఎంతుందో కస్టమర్లకు ఎలాంటి డిస్‌ప్లే ఉండటం లేదు. కస్టమర్లనుంచి వస్తున్న మరో ప్రధాన ప్రశ్న.. E20 పెట్రోల్‌కి కూడా వందకుపైన పెట్టాలా?. 20శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ని లీడర్‌ 57 నుంచి 65 రూపాయలకు విక్రయించాలనే డిమాండ్‌ కామన్‌మ్యాన్‌ నుంచి వస్తోంది.

ఇథనాల్‌ కలిసిన ఇంధనంపై అపోహలు, అనుమానాలు వద్దంటోంది కేంద్రం.  ఇథనాల్ కలిసిన పెట్రోల్‌‌తో ఇంజిన్‌ సమస్యలు తలెత్తవంటోంది. E20 ఇంధనంతో ఇంజిన్ దెబ్బతిన్న దాఖలాలు లేనేలేవంటోంది కేంద్రం. ఇథనాల్‌పై భయాలన్నీ నిరాధారం, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవన్నది కేంద్రం వెర్షన్‌. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ దీనిపై ఇప్పటికే వివరణ ఇచ్చింది. కాకపోతే పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ తక్కువ. దీని ఎఫెక్ట్‌తో మైలేజీ కొంత తగ్గుతుంది. కానీ అది అత్యంత స్వల్పమేనంటోంది కేంద్రం. ఇథనాల్‌తో పంట ఉత్పత్తుల మార్కెటింగ్‌తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతుంది.  ప్రస్తుతం దేశీయ ఇంధన అవసరాల్లో మనదేశం 85శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇథనాల్‌ బ్లెడింగ్‌తో ఏడాదికి 30వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్‌ పాయింట్‌.