మరణం అనుభవం ఎలా ఉంటుంది? ఏమో ఎవరికి తెలుసు.. మరణించిన వారెవరూ తరిగివచ్చి మనకు చెప్పలేదు. జీవితంలో ప్రతి సంఘటనను అనుభవం ద్వారా తెలుసుకోవాలని మనం ఉవ్విళ్లూరుతూ ఉంటాం.. ఐతే మరణ రుచిని మాత్రం అనుభవం ద్వారా తెలుసుకోవడం సాధ్యపడదు. ఎందుకంటే తిరిగి రావడాళ్లు.. వెళ్లడాళ్లు ఉండవు. ఒక్కసారి మరణిస్తే చచ్చినట్లు చావాల్సిందే. మరణం తర్వాత స్వర్గం-నరకం ఉంటాయని మనదేశంతోపాటు ప్రపంచ దేశాలెన్నో విశ్వసిస్తాయి. మృత్యువు ఆవహిస్తే ఆత్మ దేహాన్ని వదిలి వేరే శరీరంలోకి ప్రవేశిస్తుందనే నమ్మకం కూడా కొందరిలో లేకపోలేదు. అందుకే చాలామందిలో మరణ భయం వెంటాడుతుంటుంది. ఎవ్వరూ కోరికోరి చావాలని అనుకోరుకూడా. నేడు ఎన్నో రెట్లు అభివృద్ధి చెందిన సైన్స్ విశ్వాంతరాల్లోని రహస్యాలను చేధిస్తోంది. కానీ మరణం తర్వాత ఏమవుతుందనే మర్మాన్ని మాత్రం మానవ మాత్రుడెవ్వడూ కనుగొనలేకపోయాడు. ఐతే మరణం సమీపిస్తున్నప్పుడు చివరి క్షణాల్లో వారి చివరి భావాలు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోవచ్చంటున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు.
ఆస్ట్రేలియాలో వర్చువల్ రియాలిటీ సిమ్యులేషన్ అని పిలువబడే కొత్త సాంకేతికత ద్వారా ఇలాంటి అనుభవాలను అందిస్తున్నారు. చనిపోయినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో తెలుసుకునేందుకు పాసింగ్ ఎలక్ట్రికల్ స్టార్మ్స్ (Passing Electrical Storms) అనే వర్చువల్ రియాలిటీ సిస్టమ్‌ను రూపొందించారు. దీనిని షాన్ గ్లాడ్‌వెల్ (Shaun Gladwell) అనే వ్యక్తి తయారు చేశాడు. ఎలక్ట్రికల్ స్టార్మ్స్ అనే వర్చువల్ రియాలిటీ సిస్టమ్‌ను రూపొందించారు. దీనిని నేషనల్ గ్యాలరీ ఆఫ్ విక్టోరియాలో జరిగిన మెల్‌బోర్న్ నౌ ఈవెంట్‌లో ప్రదర్శించారు. ఇది కార్డియాక్ అరెస్ట్ నుంచి బ్రెయిన్ డెత్, డీ-ఎస్కలేషన్ వరకు మరణ అనుభవాన్ని అందిస్తుంది. అంటే దీని ద్వారా మరణం అంచుల వరకు వెళ్లి రావచ్చన్నమాట.
ఈ వర్చువల్ రియాలిటీలో పాల్గొనేవారి హృదయ స్పందనను హార్ట్ మానిటర్‌కు కనెక్ట్ చేస్తారు. ఈ అనుభవాన్ని పొందుతున్నప్పుడు హార్ట్‌బీట్ రేటు పడిపోతే ‘పాసింగ్ ఎలక్ట్రికల్ స్టార్మ్స్’ను తొలగిస్తారు. వినడానికి, చదవడానికి ఎగ్జైటింగ్‌గా ఉన్నా దీనిని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి మాత్రం అంతసులువుగా ఎవ్వరూ ముందుకు రావడం లేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.