Cyber Crimes: రెప్పపాటులో మాయమవుతున్న సొమ్ము.. సైబర్ నేరాల నియంత్రణకు చెక్ పెట్టేదీ వాళ్లేనా..!
భారతదేశంలో ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సౌదీ ఆరేబియా తరహాలో నేరాల అదుపునకు చర్యలు చేపట్టాలంటున్నారు సైబర్ నిపుణులు.
టెక్నాలజీ పెరిగే కొద్దీ, సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రిమినల్స్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు, నిరక్షరాస్యులు అన్న తేడా లేకుండా అన్ని వర్గాలు, వయసుల వారూ ఉంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు ఊహించని రీతిలో పెరిగిపోతుండటం ఆందోళ కలిగిస్తోంది.
అయితే ఈ తరహా నేరాల నిరోధంలో బ్యాంకులు మరింత క్రియాశీలంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు. బ్యాంకులు అప్రమత్తంగా ఉంటే వీటిని చాలా వరకు నిరోధించవచ్చని ఇటీవల ఏపీలోని తిరువూరు, తెలంగాణలోని మహబూబ్ నగర్ లలో జరిగిన ఉందంతాలు రుజువు చేశాయి. ఇటువంటి సైబర్ క్రైమ్‌లను దాదాపు 90 శాతం వరకూ బ్యాంకులలోనే నివారించే అవకాశాలు ఉన్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సౌలభ్యాన్ని సైబర్ కేటుగాళ్లు ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే ఖాతాదారులను రక్షించే నైతిక బాధ్యత బ్యాంకులు తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు సైబర్ ఎక్స్‌ఫర్ట్స్. ఏపీలోని తిరువూరు, తెలంగాణలోని మహబూబ్ నగర్ లలో బ్యాంకు ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించడంతో 60లక్షల రూపాయల సైబర్ క్రైమ్ మనీ బదిలీ కాకుండా ఆపగలిగారు. బ్యాంకులు అప్రమత్తంగా ఉండటంతో సైబర్ మోసాల నుంచి ఖాతాదారులను రక్షించుకోగలిగారు. ఇటీవల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం తన మన్ కీ బాత్ కార్యక్రమంలో సైబర్ మోసాల గురించి ప్రస్తావించడమే ఇది ఎంత తీవ్ర ముప్పుగా మారిందో అర్ధం చేసుకోవచ్చు..!
ఇక సైబర్ నేరాలను అరికట్టడంలో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశం 2015లో 1.60 లక్షల సైబర్ నేరాలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. సైబర్ నేరాల నియంత్రణలో బహుముఖ వ్యూహం అనుసరించి 100 శాతం విజయం సాధించింది. 2017లో నేషనల్ సైబర్ సెక్యూరిటీ అధారిటీ ని స్థాపించి సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. బడ్జెట్‌లో నిధులు పెంచడం, విద్యా విధానంలో కోర్సు ప్రవేశపెట్టడం, పాశ్చాత్య దేశాల సాంకేతికత సహకార ఒప్పందాలు చేసుకోవడం ద్వారా సైబర్ నేరాల నియంత్రణలో సౌదీ అరేబియా ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిచింది.
భారత్ లో ఇటీవల సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సౌదీ ఆరేబియాను ప్రామాణికంగా తీసుకుని చర్యలు చేపట్టాలని నిపుణులు కోరుతున్నారు. అందుకు విశ్వవిద్యాలయాలలో కోర్సులు ప్రవేశపెట్టి, ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ సెల్ ఏర్పాటు చేయాలంటున్నారు. అలాగే ఈ సైబర్ సెల్‌లను బ్యాంకులతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో బ్యాంకులూ అప్రమత్తంగా ఉండి నేరాలను అరికట్టేందుకు సహకారం అందించాలి. వీటికి తోడు సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. ఇలాంటి చర్యలకు ప్రభుత్వ తోడ్పాటు ఉంటే తప్పక సత్ఫలితాలు వస్తాయని సైబర్ క్రైమ్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..