Breast Feeding: తల్లిపాల ప్రాముఖ్యత కంటే సమాజం చూసే చూపే శాపమా? సర్వేలో షాకింగ్ విషయాలు
సృష్టిలో అన్నిటికంటే మధురమైనది, పవిత్రమైనది తల్లి ప్రేమ. ఆ ప్రేమకు ప్రతిరూపమే బిడ్డకు ఇచ్చే అమృతధార వంటి తల్లిపాలు. పుట్టిన వెంటనే, దాదాపు 6 నెలల వరకు బిడ్డకు తల్లిపాలు పట్టించడం వల్ల అటు శిశువుకు, ఇటు తల్లికి ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది.

ప్రభుత్వం, వైద్య నిపుణులు ఎంతగా అవగాహన కల్పించినా, నేటి ఆధునిక కాలంలో పట్టణ ప్రాంతాల్లో పాలిచ్చే తల్లులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ‘ప్రివెంటివ్ మెడిసిన్ రీసెర్చ్ అండ్ రివ్యూస్’ తాజా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా నగరాల్లోని తల్లులు బహిరంగ ప్రదేశాల్లో బిడ్డలకు పాలివ్వడానికి భయపడుతున్నారని, దీనికి కారణం సమాజం చూసే విధానమేనని ఈ అధ్యయనం తేల్చింది.
మారాల్సిన దృక్పథం
పల్లెటూళ్ళలో బిడ్డ ఆకలి వేస్తే తల్లి ఎక్కడైనా పాలివ్వడం సహజంగా కనిపిస్తుంది. కానీ నగరాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. పాలిచ్చే అవయవాన్ని కేవలం లైంగిక దృష్టితో చూడటం, చుట్టూ ఉన్నవారు ఇచ్చే అసౌకర్యమైన చూపులు తల్లులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. కేవలం పురుషులే కాకుండా, తోటి స్త్రీల నుండి కూడా ఒక్కోసారి అభ్యంతరకరమైన చూపులు ఎదురవుతున్నాయి. దీంతో తల్లులు ఏదో తప్పు చేస్తున్నామనే భావనకు లోనవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో బిడ్డకు ఏదైనా ఆహారం తినిపిస్తే సహజంగా చూసే సమాజం, పాలిస్తుంటే మాత్రం ఎందుకు వింతగా చూస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
వస్త్రధారణ – ఇతర సవాళ్లు..
మన దేశంలో బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వడానికి దుస్తులు కూడా ఒక కారణమవుతున్నాయి. చీర కొంగు లేదా దుపట్టా వంటివి ఉన్నప్పుడు తల్లులు కొంత చాటు చేసుకుని పాలివ్వగలుగుతున్నారు. అయితే మారుతున్న కాలంతో పాటు పాశ్చాత్య వస్త్రధారణలో ఉన్న మహిళలకు ఇది మరింత కష్టంగా మారుతోంది. దీనికి తోడు పెరిగిన సీసీ కెమెరాల నిఘా కూడా వారి గోప్యతకు భంగం కలుగుతుందనే ఆందోళనను పెంచుతోంది. ఈ కారణాల వల్ల చాలామంది తల్లులు తమ కదలికలను పరిమితం చేసుకుంటున్నారు లేదా బయటకు వెళ్లే ముందు అవసరం లేకపోయినా బిడ్డకు బలవంతంగా పాలు తాగించి వస్తున్నారు. ఇది బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు.
మౌలిక సదుపాయాల కొరత..
నగరాల్లో మహిళల కోసం వాష్‌రూంలు అందుబాటులోకి వచ్చాయి కానీ, బ్రెస్ట్‌ఫీడింగ్ రూమ్‌లు (తల్లిపాల గదులు) మాత్రం ఆ స్థాయిలో ఏర్పాటు కాలేదు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్‌లో అక్కడక్కడా గదులు ఉన్నప్పటికీ, వాటి నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. సరైన ప్రచారం లేకపోవడంతో చాలామంది తల్లులకు వాటి గురించి తెలియదు. ఈ ఇబ్బందులన్నింటినీ భరించలేక చాలామంది పట్టణ తల్లులు బిడ్డ పుట్టిన వెంటనే డబ్బా పాలు పట్టించడానికి మొగ్గు చూపుతున్నారు, ఇది బిడ్డలో రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణమవుతోంది.
నిజానికి మనకు కావాల్సింది కేవలం ప్రత్యేక గదులు మాత్రమే కాదు, పాలివ్వడాన్ని ఒక సహజ ప్రక్రియగా చూసే గొప్ప మనసు. బిడ్డ ఆకలిని తీర్చడం అనేది ఒక పవిత్రమైన బాధ్యత అని గుర్తించినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
- కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో తల్లులకు గౌరవప్రదమైన వాతావరణం కల్పించాలి.
- సీసీ కెమెరాల పరిధిలో లేని ప్రత్యేక కేబిన్లు లేదా గదులను పెంచాలి.
- తల్లిపాల ప్రాముఖ్యతపై కేవలం మహిళలకే కాకుండా పురుషులకు కూడా అవగాహన కల్పించాలి.
సమాజం తన ఆలోచనా ధోరణిని మార్చుకున్నప్పుడే, తల్లులు తమ పసిబిడ్డలకు నిస్సంకోచంగా పాలివ్వగలరు. అప్పుడే రాబోయే తరం బలంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది.
