AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Effect: కరోనా గట్టి దెబ్బే కొట్టింది… గడియారం చూసి సమయం కూడా చెప్పలేకపోతున్నారట.. సంచలన విషయాలు చెప్పిన సర్వే..

Corona Effect: కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని అన్ని వ్యవస్థలు దాదాపుగా స్థంభించిపోయాయి. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు అయితే పూర్తిగా..

Corona Effect: కరోనా గట్టి దెబ్బే కొట్టింది... గడియారం చూసి సమయం కూడా చెప్పలేకపోతున్నారట.. సంచలన విషయాలు చెప్పిన సర్వే..
Shiva Prajapati
|

Updated on: Feb 12, 2021 | 4:57 PM

Share

Corona Effect: కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని అన్ని వ్యవస్థలు దాదాపుగా స్థంభించిపోయాయి. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు అయితే పూర్తిగా మూతబడిపోయాయి. ఇప్పుడిప్పుడే మాయదారి కరోనా ప్రభావం తగ్గడంతో పాటుగా.. కోవిడ్ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలను కూడా తెరుస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీలను రీ ఓపెన్ చేసి తరగతులు ప్రారంభించాయి కూడా. అయితే దాదాపు తొమ్మిది నెలల విరామం తరువాత స్కూళ్లు పునఃప్రారంభమైన నేపథ్యంలో ప్రముఖ అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ విద్యార్థులపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఊహించని రీతిలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. విద్యార్థులు తొమ్మిది నెలలపాటు చదువుకు దూరం అవడంతో.. విద్యాపరమైన కీలక విషయాలతో పాటు నిత్య జీవితానికి అవసరమైన చిన్న చిన్న విషయాలను సైతం మరిచిపోయారని తేల్చారు. ఈ సర్వేలో తేలిన ఆసక్తికరమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.

నెలల తరబడి విద్యార్థులు పుస్తకం ముట్టకపోవడంతోపాటు, అభ్యాసనకు దూరం అవడంతో విద్యార్థుల పరిస్థితి ఇప్పుడెలా ఉందనే దానిపై అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో చాలా అంశాల్లో విద్యార్థులు తమ సామర్థ్యాన్ని కోల్పోయారని తేల్చింది. 2 నుంచి 6వ తరగతి వరకు పిల్లలు భాషాపరమైన అభ్యసనంలో సామార్థ్యాన్ని దాదాపుగా కోల్పోయారని గుర్తించింది. అదేవిధంగా 82 శాతం మంది గణితంలో ఒక నిర్ధిష్ట సామార్థ్యాన్ని కోల్పోయారని సర్వే పేర్కొంది. 3వ తరగతి విద్యార్థులను పరిశీలించగా.. 48శాతం మంది పిల్లలు.. కూడికలు, తీసివేతలను కూడా మరిచిపోయారట. ఇక 50శాతం మంది విద్యార్థులు పాఠ్యాంశం విన్న తరువాత మౌఖిక ప్రశ్నలకు సమాధానం చెప్పే సామర్థ్యాన్ని కోల్పోయారట. ఇక మరీదారుణంగా సంఖ్యలను గుర్తించడం, ప్రాథమిక అంకగణితాలను కూడా చేయలేని స్థితిలో ఉన్నారట.

2వ తరగతిలో 20 శాతం మంది విద్యార్థులు సింగిల్ డిజిట్ సంఖ్యను కూడా గుర్తించలేకపోతున్నారట. అదే సమయంలో 3వ తరగతి విద్యార్థుల్లో 37 శాతం మంది రెండు అంకెల సంఖ్యల గురించి ప్రశ్నిస్తే చిత్రవిచిత్రమైన సమాధానాలు చెబుతున్నారట. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే.. 4వ తరగతికి చెందిన విద్యార్థుల్లో 11 శాతం మంది ‘గడియారం’లో చూసి సమయాన్ని చెప్పలేకపోయారట. ఇదే తరగతికి చెందిన 70శాతం మంది విద్యార్థులు అంకెల స్థల విలువలను చెప్పలేకపోయారట. ఇక 5వ తరగతికి చెందిన 55 శాతం మంది విద్యార్థులు మరీదారుణంగా రెండు అంకెల సంఖ్యలను గుణించలేకపోతున్నారట. 6వ తరగతిలో 60శాతం మంది విద్యార్థులు కుడి, ఎడమల గురించి కూడా చెప్పలేకపోతున్నారట. అలాగే.. 2 నుంచి 6వ తరగతి వరకు విద్యార్థుల్లో చాలా మంది పలు అంశాల్లో అవగాహన కోల్పోయారని సర్వే సంస్థ తెలిపింది. ఒక బొమ్మ చూపించి దానికి సంబంధించి అభిప్రాయం రాయాలని పరీక్ష నిర్వహిస్తే 46శాతం మంది విద్యార్థులు ఆ అంశంలో ఫెయిల్ అయ్యారట. 23శాతం మంది విద్యార్థులు కనీసం వార్తా పేపర్ కూడా చదవలేని స్థితికి చేరారట. అలా పాఠ్యపుస్తకాలను కూడా చదవలేకపోతున్నారట.

ఈ సర్వేని చూస్తే.. కరోనా మహమ్మారి ప్రజల జీవితాలనే కాదు.. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసినట్లు కనిపిస్తోంది.

Also read:

CBI Enquiry: తెలంగాణలో వెలుగు చూసిన భారీ మోసం.. ఫోర్జరీ పత్రాలు, సంతకంతో రూ. 480 కోట్లు కొట్టేశారు..!

‘సర్కారు వారి’ సాంగ్స్‌పై స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్‌.. ‘అదిరిపోయే మ్యూజిక్ ఆన్ ది వే’ అంటూ పోస్ట్..