Sugar Alternative: చక్కెర బదులు ఈ స్వీట్ వాడండి.. షుగర్ పేషంట్లకు వైద్య నిపుణుల సలహా!
మధుమేహం, అధిక బరువు సమస్యలతో సతమతమవుతున్న వారికి గుడ్‌న్యూస్! ప్రముఖ కార్డియాలజిస్ట్, ఫంక్షనల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ అలోక్ చోప్రా షుగర్‌కు ప్రత్యామ్నాయంగా ఒక అరుదైన తీపి పదార్థాన్ని సూచించారు. ఇది రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను పెంచదు సరికదా, శరీరంలోని కొవ్వును తగ్గిస్తుందని ఆయన తెలిపారు. ఆ అద్భుతమైన తీపి పదార్థమే ఏంటో దాని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

డాక్టర్ చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ అలులోస్ గురించి వివరంగా వివరించారు. ఇది సాధారణ చక్కెరలా రుచిని అందిస్తూనే, ఇన్సులిన్ స్పైక్‌లను నివారిస్తుంది. మధుమేహం లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సాధారణ చక్కెరతో పోలిస్తే అలులోస్ 70 శాతం తీపిగా ఉంటుంది. ఇందులో 70 శాతం రక్తంలో కలిసి, మూత్రం ద్వారా బయటకు వెళుతుంది.
అలులోస్ వల్ల కలిగే ప్రయోజనాలు
తక్కువ కేలరీలు: అలులోస్ ప్రతి గ్రాముకు 0.2-0.4 కేలరీలు మాత్రమే కలిగి ఉంటుంది. ఇది చక్కెరలో పదో వంతు కేలరీలను ఇస్తుంది.
రక్తంలో చక్కెర అదుపు : దీనికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. భోజనం తర్వాత గ్లూకోజ్ పెరగడాన్ని తగ్గిస్తుంది.
కొవ్వును కరిగిస్తుంది: ఇది కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. శరీర కొవ్వును తగ్గిస్తుంది. కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.
వాపును తగ్గిస్తుంది: కాలేయం, మూత్రపిండాలు, కొవ్వు కణజాలానికి ఇది సురక్షితం. వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
శక్తిని, పనితీరును పెంచుతుంది: మైటోకాండ్రియల్ పనితీరును పెంచుతుంది. ఓర్పును మెరుగుపరుస్తుంది. డయాబెటిక్ నెఫ్రోపతీ నుంచి రక్షణ కల్పిస్తుంది. కణాలకు ఇది తెలివైన ఇంధనం.
అలులోస్ ఎక్కడ దొరుకుతుంది?
అలులోస్ రెండు ప్రధాన వనరులలో లభిస్తుంది:
సహజ ఆహార వనరులు: గోధుమలు, అత్తి పండ్లు, ఎండుద్రాక్ష, బెల్లం, మేపుల్ సిరప్, పనస పండు, కివి వంటి వాటిలో అలులోస్ తక్కువ పరిమాణంలో ఉంటుంది. క్యారమెల్, పండ్ల రసాలు, కాఫీలో కూడా ఇది దొరుకుతుంది.
వాణిజ్య ఉత్పత్తి: సహజంగా లభించే అలులోస్ పరిమాణం తక్కువ కాబట్టి, దీన్ని ఎక్కువగా మొక్కజొన్న లేదా షుగర్ బీట్స్ నుంచి ఫ్రక్టోజ్‌ను ఎంజైమ్‌ల ద్వారా మార్చి తయారు చేస్తారు. దీనివల్ల ఇది విస్తృతంగా, తక్కువ ధరలో లభిస్తుంది.
ఇతర చక్కెర ప్రత్యామ్నాయాలతో పోలిక
స్టీవియా, ట్రూవియా: వీటిని తరచుగా కృత్రిమ స్వీటెనర్లతో కలుపుతారు. ఎక్కువ కాలం వాడితే ఆకలిని పెంచుతాయి. బరువు పెరగవచ్చు. గట్ మైక్రోబయోమ్ అసమతుల్యత, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీయవచ్చు.
మాంక్ ఫ్రూట్ ఎక్స్‌ట్రాక్ట్, కొబ్బరి చక్కెర, డేట్ షుగర్, ఎరిథ్రిటాల్, జిలిటాల్ఇవి మరింత సహజమైన ప్రత్యామ్నాయాలు. కానీ, వీటిలో గ్లైసెమిక్ ప్రభావాలు వేరుగా ఉంటాయి. కొన్నిసార్లు రుచిలో తేడాలు లేదా కొందరిలో జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.
అలులోస్ ఎందుకు ప్రత్యేకమైనది?
కార్డియాలజిస్ట్ అభిప్రాయం ప్రకారం, అలులోస్ సహజంగా తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. చక్కెరలాంటి రుచిని ఇస్తుంది, పెద్దగా ప్రత్యేకమైన రుచి ఉండదు. ఇది ఇన్సులిన్‌ను పెంచదు. తక్కువ మోతాదులో తీసుకుంటే జీర్ణవ్యవస్థకు ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. చక్కెర వల్ల వచ్చే ప్రతికూలతలు లేకుండా, చక్కెరతో సమానమైన అనుభవాన్ని ఇది అందిస్తుంది. 12 నెలల పాటు రోజుకు 5-15 గ్రాములు వాడినప్పటికీ ఎటువంటి విష ప్రభావాలు లేవని అధ్యయనాలు చూపుతున్నాయి.