
మనిషిని ఒత్తిడి నుంచి తగ్గించడానికి నిద్ర చాలా అవసరం. రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర వల్ల రోజంగా యాక్టీవ్ గా ఉంటారు. అందుకే రోజు కనీసం 7 నుంచి 8 గంటలైన నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో పొజీషన్ లో పడుకుంటే నిద్ర వస్తుంది. చాలా మంది బోర్లా, వెల్లకిలా, పక్కకి తిరిగి పడుకుంటారు. కానీ ఎడమవైపు తిరిగి పడుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. మరి అవేంటో తెలుసుకుందాం.
*ఎడమవైపు తిరిగి పడుకుంటే జీర్ణ వ్యవస్థ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కాగా మిగిలిన వ్యర్థాలు, టాక్సిన్లు మొదట పెద్ద పేగు ప్రారంభ భాగమైన సెకమ్ లోకి చేరుతాయి. అది మన శరీరంలో కుడివైపు ఉంటుంది. మనం ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు.. గురుత్వాకర్షణ కారణంగా కుడి నుంచి ఎడమకు ఈ వ్యర్థాలన్నీ సులభంగా కిందికి వెళ్లిపోతాయి. ఉదయాన్నే ఈ వ్యర్థాలన్నీ మలం ద్వారా బయటకు వెళ్తాయి. ఇలా పెద్ద ప్రేగు క్లీన్ గా ఉంటుంది.
*ఎడమ వైపు నిద్రపోతే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో గుండె ఎడమ వైపుకి ఉటుంది. అందుకే మనం ఎడమ వైపు తిరిగి పడుకుంటే రక్తం సులభంగా గుండెకు సరఫరా అవుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి కాస్త తగ్గుతుంది.
*ఒక్కోసారి మనకు బాగా నచ్చింది ఏదైనా అతిగా తినేస్తాం. ఇలాంటప్పుడు కాస్త ఆయాసంగా ఉంటుంది. అలాంటప్పుడు ఎడమ వైపుకి తిరిగి పడుకుంటే.. కొంత ఉపశమనం లభిస్తుంది.
*ఎడమ వైపు తిరిగి పడుకోవడటం వల్ల లింఫ్ చురుకుగా పని చేస్తుంది. దీంతో రక్తం సరఫరా మెరుగుపడుతుంది.
*గర్భిణీల విషయంలో వైద్యులు ఎడమవైపు తిరిగి పడుకోవడం చాలా మంచిదని చెబుతూంటారు. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల వీపు, నడుము, వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో హాయిగా నిద్ర పడుతుంది. అలాగే కడుపులో ఎదిగే బిడ్డకు పోషకాలు కూడా సులభంగా అందుతాయి.