Corona Virus: థైరాయిడ్ గ్రంథిపై కరోనా తీవ్ర ప్రభావం.. ఏడాది గడిచినా కనిపిస్తున్న దుష్ప్రభావం..
Corona Virus: కరోనా మహమ్మారి మానవాళిని ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి పోయాయి, ఆరోగ్య వ్యవస్థ చిన్నాభిన్నమైంది. మనుషులు ఆరోగ్యాలపై కూడా...
Corona Virus: కరోనా మహమ్మారి మానవాళిని ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి పోయాయి, ఆరోగ్య వ్యవస్థ చిన్నాభిన్నమైంది. మనుషులు ఆరోగ్యాలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. అయితే మొదట్లో కేవలం శ్వాస సంబంధిత వ్యవస్థపైనే కోవిడ్ మహమ్మారి ప్రభావం ఉంటుందని అందరూ భావించారు. అయితే పరిశోధనల్లో మాత్రం రోజుకో కొత్త సమస్య బయటపడుతోంది. కరోనా వైరస్ శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతున్నట్లు పరిశోధనల్లో తేలుతోంది. లాంగ్ కోవిడ్ లక్షణాలు శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త విషయాన్ని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.
కొవిడ్ తీవ్రరూపం ధరిస్తే థైరాయిడ్ గ్రంథిని ప్రభావితం చేస్తుందనీ, ఆ దుష్ప్రభావం ఏడాది గడిచిన తర్వాత కూడా కనిపిస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఇటలీలోని మిలాన్ యూనివర్సిటీల పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కరోనా లక్షణాలు ఉన్నప్పుడు థైరాయిడ్ గ్రంథి వాపునకు గురవుతుందని పరిశోధకులు తేల్చారు. పరిశోధనల్లో భాగంగా కరోనాతో ఆసుపత్రిలో చేరిన 100 మందిపై అధ్యయనం నిర్వహించారు.
వారిలో చాలా మందికి తరచుగా థైరాయిడ్ వాపు గుర్తించారు. అయితే కొవిడ్ తగ్గిన తర్వాత థైరాయిడ్ పరిమాణం మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. కానీ సగం మందిలో మాత్రం ఏడాది తర్వాత కూడా థైరాయిడ్ వాపు పూర్తిగా తగ్గన్నట్లు గుర్తించారు. ఈ విషయమై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిపితే మరికొన్ని విషయాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..