ప్రాణాలు తీస్తున్న వడదెబ్బ..! ఈ టిప్స్‌ పాటిస్తే మీ పెంపుడు జంతువులు సేఫ్

వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల ప్రభావం కేవలం మనుషులపైనే కాకుండా మూగజీవులపై కూడా తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా మన ఇళ్లలో ఉండే పెంపుడు కుక్కలు చాలా సులభంగా వడదెబ్బకు గురవుతున్నాయి. అయితే చాలామంది యజమానులు ఈ విషయాన్ని సకాలంలో గుర్తించలేకపోవడం వల్ల మూగజీవులు ప్రాణాలు కోల్పోతున్నాయి.

ప్రాణాలు తీస్తున్న వడదెబ్బ..! ఈ టిప్స్‌ పాటిస్తే మీ పెంపుడు జంతువులు సేఫ్
Petcare1

Updated on: May 04, 2026 | 10:56 PM

కుక్కలకు వడదెబ్బ తగిలినప్పుడు వాటిలో కొన్ని స్పష్టమైన శారీరక మార్పులు కనిపిస్తాయి. కానీ సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. వేసవి తాపానికి పెంపుడు జంతువులు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నాయని పశువైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలలో వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి, తక్షణమే చేయాల్సిన ప్రథమ చికిత్స ఏమిటో చూద్దాం.

వడదెబ్బ సోకినప్పుడు కనిపించే లక్షణాలు

  • కుక్కలకు వడదెబ్బ తగిలినప్పుడు వాటి ప్రవర్తనలో మరియు శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి.
  • అవి సాధారణం కంటే చాలా వేగంగా, ఆపకుండా రొప్పుతూ గాలి పీల్చుకుంటాయి.
  • వాటి నోటిలోని చిగుళ్లు సాధారణ రంగులో కాకుండా ముదురు ఎరుపు, నీలం లేదా ఊదా రంగులోకి మారుతాయి.
  • నోటి నుండి విపరీతంగా లాలాజలం కారుతుంది.
  • తీవ్రమైన వడదెబ్బకు గురైనప్పుడు కుక్కలు నడవలేక ఒకే చోట నీరసంగా పడిపోతాయి.
  • కొన్నిసార్లు వాటికి రక్తంతో కూడిన విరేచనాలు కూడా కావచ్చు. అలాగే వాటి శరీరాన్ని తాకినప్పుడు విపరీతమైన వేడిగా అనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి.

తక్షణమే ప్రథమ చికిత్స

కుక్కకు వడదెబ్బ తగిలిందని గమనించిన వెంటనే యజమానులు కొన్ని తక్షణ చర్యలు తీసుకోవాలి. మొదటగా కుక్కను ఎండ నుండి తప్పించి చల్లని ప్రదేశానికి లేదా ఏసీ, ఫ్యాన్ ఉన్న గదిలోకి మార్చాలి. సాధారణ ఉష్ణోగ్రతలో ఉండే నీటిని కుక్క శరీరంపై పోయాలి. ముఖ్యంగా దాని తల, మెడ, పొట్ట భాగం మరియు కాళ్ల కింద తడి గుడ్డతో బాగా తుడవాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన జాగ్రత్త పాటించాలి. కుక్కపై ఎప్పుడూ మరీ చల్లటి ఐస్ వాటర్ పోయకూడదు. అలా చేయడం వల్ల దాని శరీరంలోని రక్తనాళాలు కుంచించుకుపోయి, లోపల ఉన్న వేడి బయటకు పోకుండా ఉండిపోతుంది.

కుక్కలకు వాటి పాదాల అడుగు భాగం నుంచే శరీరంలోని వేడి త్వరగా బయటకు పోతుంది. కాబట్టి ఆ భాగాలను తడి గుడ్డతో బాగా తుడవాలి. కుక్క కాస్త స్పృహలోకి వచ్చినట్లు అనిపిస్తే దానికి కొద్దికొద్దిగా తాగునీరు అందించాలి. ప్రథమ చికిత్స చేసిన తర్వాత కుక్క కోలుకున్నట్లు కనిపించినప్పటికీ, దానిని వెంటనే పశువైద్యుడి దగ్గరికి తీసుకెళ్లడం చాలా అవసరం. ఎందుకంటే వడదెబ్బ ప్రభావం వల్ల ఒక్కోసారి జంతువుల కిడ్నీలు, కాలేయం వంటి అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వైద్యుల చేత పరీక్షలు చేయించి సరైన చికిత్స అందించడం ద్వారా మన విశ్వాసపాత్రమైన మూగజీవాల ప్రాణాలను కాపాడుకోవచ్చు.

Follow Us