- Telugu News Photo Gallery Can Snakes Sense Pregnancy in Women and not bite Pregnant ladies, check Myth vs Science Behind the Belief
నిజమా.. గర్భిణీ స్త్రీలను పాము కరవదా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి..
భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా ఒక బలమైన నమ్మకం ప్రచారంలో ఉంది. గర్భిణీ స్త్రీలను పాములు కరవవని, ఒకవేళ పాము ఎదురైనా అది కాటు వేయకుండా వెనుతిరిగి వెళ్లిపోతుందని గ్రామాల్లోని పెద్దలు చెబుతుంటారు. సృష్టికి మూలమైన మాతృత్వాన్ని ప్రకృతి స్వయంగా రక్షిస్తుందని కొందరు భావిస్తే, దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా అని మరికొందరు వెతుకుతుంటారు. ఈ నమ్మకం వెనుక ఉన్న పౌరాణిక, జ్యోతిష్య కోణాలు ఏంటి? సైన్స్ ఏమంటుంది..? అనేది తెలుసుకుందాం..
Updated on: May 25, 2026 | 3:07 PM

హిందూ సంప్రదాయం ప్రకారం.. గర్భం దాల్చిన స్త్రీని సాక్షాత్తు శక్తి స్వరూపంగా, దైవత్వంతో సమానంగా చూస్తారు. ఒక కొత్త జీవికి ప్రాణం పోసే పవిత్రమైన ప్రక్రియలో ఆ తల్లి ఉన్నప్పుడు, ఆమె చుట్టూ ఒక దైవిక రక్షణ వలయం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. సర్పాలు పిండంలోని ఆత్మను, దైవత్వాన్ని పసిగట్టగలవని.. అందుకే శివకేశవులకు ప్రియమైన ఆ సర్ప జాతి, సృష్టికర్త అయిన గర్భిణీకి ఎలాంటి హాని చేయకుండా మార్గం సుగమం చేస్తుందని జానపద కథల సారాంశం.

జ్యోతిష్య కోణం: జ్యోతిష్య శాస్త్రంలో పాములను రాహు, కేతువుల ప్రతిరూపాలుగా భావిస్తారు. గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో, మానసిక స్థితిలో వచ్చే మార్పుల వల్ల ఆమె చుట్టూ ఒక శక్తివంతమైన ఆరా ఏర్పడుతుందని జ్యోతిష్కులు అంటారు. ఈ సానుకూల శక్తి వల్ల ప్రతికూల గ్రహాల ప్రభావం తగ్గి, పాములు ఆమె వైపు రావడానికి ఇష్టపడవని, ఒకవేళ వచ్చినా శాంతించి వెళ్ళిపోతాయని నమ్ముతారు.

విశ్వాసాలు ఎలా ఉన్నా ఆధునిక వైద్య విజ్ఞానం, జంతు శాస్త్రం మాత్రం ఈ విషయంలో చాలా స్పష్టమైన హెచ్చరికలు చేస్తున్నాయి. పాములకు ఎదురుగా ఉన్న వ్యక్తి గర్భిణీనా, కాదా అనే విచక్షణ లేదా ఆలోచనా శక్తి ఉండదు. పాము కాటు వేయడం అనేది పూర్తిగా అది ఎదుర్కొనే ప్రమాదంపై ఆధారపడి ఉంటుంది. పొరపాటున దానిపై కాలు వేసినా, లేదా భయంతో గట్టిగా కదిలినా అది తనను తాను రక్షించుకోవడానికి ఆత్మరక్షణ చర్యగా ఎవరినైనా కాటు వేస్తుంది.

హార్మోన్ల వాసన నిజమేనా?: గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. దీనివల్ల శరీర వాసనలో సూక్ష్మమైన మార్పులు వస్తాయి. పాములు తమ జాకబ్సన్ ఆర్గాన్ సాయంతో రసాయన మార్పులను పసిగట్టగలవన్నది నిజమే అయినా... ఆ వాసన చూసి పాములు భయపడి పారిపోతాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. మెడికల్ సైన్స్ ప్రకారం.. గర్భిణీ స్త్రీలకు పాము కాటు వేయదు అనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే. ప్రతీ ఏటా గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలు కూడా పాముకాటుకు గురవుతున్న కేసులు నమోదవుతున్నాయి.

మన సంస్కృతి, సంప్రదాయాల్లోని నమ్మకాలను గౌరవించడం మంచిదే. కానీ ఆ నమ్మకం మూఢనమ్మకంగా మారి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు. గర్భధారణ సమయంలో మహిళలు శారీరకంగా కాస్త నెమ్మదిగా కదులుతారు కాబట్టి పాములు వారి కదలికలను త్వరగా ముప్పుగా భావించకపోవచ్చు. అంతేకాని పాములు కరవవని నిర్లక్ష్యంగా ఉండటం ప్రమాదకరం.
