AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!

మనలో చాలా మందికి ప్రతి రోజూ ఉదయం టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ బరువు తగ్గాలనుకునే వారికి ఈ అలవాటు కాస్త అడ్డంకి కావొచ్చని నిపుణులు అంటున్నారు. ఈ మాటలో ఎంత నిజం ఉందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
Weight Loss Food Diet
Prashanthi V
|

Updated on: Jun 16, 2025 | 11:01 PM

Share

టీ తాగడం వల్లనే బరువు పెరగరు. కానీ టీలో పాలు, చక్కెర వేసే విధానం వల్లనే సమస్యలు మొదలవుతాయి. పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. టీకి ఎక్కువ చక్కెర కలిపితే ఒక్క టీ కప్పు ద్వారానే దాదాపు 100 కేలరీలు శరీరంలోకి వెళ్తాయి. అందుకే రోజుకు 3 నుంచి 4 సార్లు టీ తాగే వారికి ఈ అదనపు కేలరీలు బరువు పెరగడానికి కారణం అవుతాయి.

ఇది చాలదన్నట్లుగా టీ తాగేటప్పుడు చాలా మంది బిస్కెట్లు, చిప్స్, వడలు, సమోసాలు లాంటి ఎక్కువ కొవ్వు, చక్కెర ఉన్నవి తింటారు. ఇవి ఆరోగ్యానికి హానికరం. బరువు పెరగడానికి ముఖ్య కారణం కూడా. అయితే టీ తాగడం మానకుండా బరువు తగ్గడం సాధ్యమేనా అంటే అవుననే సమాధానం చెప్పాలి. మీ టీ తాగే విధానాన్ని మార్చుకుంటే బరువు తగ్గడం సులభం అవుతుంది.

  • టీకి చక్కెర బదులు బెల్లం లేదా తేనె వాడండి.
  • ఫుల్ ఫ్యాట్ పాలకంటే తక్కువ కొవ్వు ఉన్న టోన్డ్ పాలు ఉపయోగించండి.
  • టీతో పాటు తినే స్నాక్స్‌ ను మక్కానా, మొలకెత్తిన గింజలు లేదా కూరగాయలతో చేసినవిగా మార్చుకోండి.
  • టీని రోజుకు గరిష్ఠంగా రెండు సార్లు మాత్రమే తాగడానికి ప్రయత్నించండి.

ఈ మార్పులు చేయడం వల్ల రోజూ శరీరంలోకి అనవసరంగా చేరే అదనపు శక్తిని తగ్గించవచ్చు. దీని వల్ల మీ బరువు తగ్గే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. పాలతో చేసే మామూలు టీ బదులు మీరు గ్రీన్ టీ, బ్లాక్ టీ లేదా తులసి, అల్లం లాంటి మూలికలతో చేసిన హెర్బల్ టీలు తాగవచ్చు. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడతాయి. పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా ఉత్సాహంగా అనిపిస్తుంది.

ఏ ఆహార పదార్థమైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే. టీ విషయంలోనూ ఇది వర్తిస్తుంది. రోజుకు 5 నుంచి 6 సార్లు టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు రోజుకు ఒక్కసారి లేదా ఎక్కువగా రెండు సార్లు మాత్రమే టీ తాగమని సూచిస్తున్నారు.

బరువు తగ్గడానికి టీ తాగడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు టీ తయారు చేసే విధానం.. దానితో పాటు తినే స్నాక్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటే బరువు తగ్గడమే కాకుండా.. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. చిన్న మార్పులు పెద్ద ప్రయోజనాలను ఇస్తాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)