ఎర్ర రక్త కణాలు పెరగాలంటే టాబ్లెట్లే కాదు.. ఈ నాచురల్ ఫుడ్స్ కూడా ట్రై చేయండి..!
మన శరీరంలో రక్తప్రసరణ సజావుగా కొనసాగాలంటే ఎర్ర రక్త కణాలు బాగా పని చేయాలి. ఇవి ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తాయి. అయితే కొన్ని పోషకాలు తక్కువైతే ఈ కణాల ఉత్పత్తి తక్కువవుతుంది. ఈ పరిస్థితిని అనేమియా అంటారు. నీరసం, గుండె దడ, బలహీనంగా ఉండటం అనేమియా వచ్చినప్పుడు కనిపిస్తాయి. ఇది ఐరన్ తక్కువగా ఉండటం వల్ల వస్తుంది. దీన్ని తగ్గించాలంటే పోషకాలున్న మంచి ఆహారం తీసుకోవాలి.

శరీరానికి హిమోగ్లోబిన్ తయారవ్వడానికి ఐరన్ చాలా అవసరం. ఇది తక్కువగా ఉంటే ఎర్ర రక్త కణాలు తక్కువగా తయారవుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. సహజంగా లభించే కొన్ని ఐరన్ కలిగిన ఆహారాలు తోటకూర, పొన్నగంటి కూర, గోంగూర వంటి ఆకుకూరలు, మటన్, లివర్ వంటి మాంసాహార పదార్థాలు, శెనగలు, మినప్పప్పు, బీన్స్ లాంటి పప్పులు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్.
ఈ పదార్థాలను రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనతకు మంచి పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా నిమ్మకాయ, ముసంబి, ఉసిరికాయ లాంటి పండ్లలో ఉండే విటమిన్ సి సహాయంతో ఐరన్ శరీరంలో వేగంగా గ్రహించబడుతుంది.
ఫోలేట్ కూడా మన శరీరానికి చాలా అవసరం. ఇది బి గ్రూప్ విటమిన్లలో ఒకటి. కొత్త ఎర్ర రక్త కణాలు తయారవ్వడానికి ఇది సహాయపడుతుంది. శరీరంలో ఫోలేట్ సరైన స్థాయిలో లేకపోతే రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. బీట్ రూట్, పాలకూర, అరటికాయ, బఠాణీలు, పప్పులు, డ్రైఫ్రూట్స్ వంటి ఆహార పదార్థాలలో ఫోలేట్ ఎక్కువగా లభిస్తుంది. ఒకవేళ మీ శరీరంలో ఫోలేట్ తక్కువగా ఉంటే.. వైద్యుల సూచన మేరకు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు కూడా తీసుకోవచ్చు. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడుతుంది.
విటమిన్ బి12 ఎర్ర రక్త కణాలు ఎదగడానికి చాలా అవసరం. ఇది శరీరంలోని కణాలు సక్రమంగా పనిచేయడానికి కూడా తోడ్పడుతుంది. ఒకవేళ శరీరంలో బి12 తక్కువగా ఉంటే రక్తహీనత ఏర్పడటమే కాకుండా మెదడు పనితీరు కూడా దెబ్బతింటుంది. ఈ విటమిన్‌ను పొందడానికి గుడ్డు, పాల పదార్థాలు, చేపలు, చికెన్ వంటి ఆహారాలు తీసుకోవాలి. మాంసాహారం తీసుకోని వారికి బి12 లోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి వారు డాక్టర్ సలహా మేరకు బి12 సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది.
ఆకుకూరలు, పచ్చని కూరగాయలు, బీన్స్ లాంటివి తినడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్, ఫోలేట్, బి12 వంటి పోషకాలు అందుతాయి. వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీరాన్ని బలంగా ఉంచుతాయి. దీంతో ఎర్ర రక్త కణాలు సహజంగా పెరుగుతాయి.
రక్తహీనత అనేది చిన్న సమస్య కాదని గుర్తుపెట్టుకోవాలి. ఇది గుండె, మెదడు, మిగతా శరీర భాగాల పని తీరు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. ఐరన్, ఫోలేట్, బి12 లాంటి పోషకాలున్న తిండి తింటూ ఎర్ర రక్త కణాల సంఖ్యను నాచురల్‌గా పెంచుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
