మోకాళ్ల `నొప్పి.. ఒక్కసారి ప్రారంభం అయ్యిందంటే ఒక పట్టాన వదిలిపోదు. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ మోకాళ్ల నొప్పులు బాధిస్తూ ఉంటాయి. ఈ నొప్పి దీర్ఘకాలికంగా ఉండే బాధాకరమైన పరిస్థతి. ఇది మిమ్మల్ని కదలకుండా కట్టిపడేస్తుంది. అడుగేస్తే సలుపుతో చంపేస్తుంది. దీనివల్ల మీ మానసికంగా కూడా కుంగుబాటును అనుభవిస్తారు. ఇక శీతాకాలంలో చలి వాతావరణంలో ఈ నొప్పి మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో మోకాళ్ల నొప్పిని నియంత్రించడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మోకాళ్ల నొప్పులకు అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలపై కూడా అవగాహన అవసరం. అందుకే వైద్య నిపుణుల సూచనలతో మోకాళ్ల నొప్పి, వాపులకు ప్రాథమికంగా అందించే చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్(NSAID).. ఈ మందులు సాధారణంగా మోకాలి నొప్పికి చికిత్స చేయడానికి వైద్యులు సూచించే మొదటి విధానం. ఇవి మోకాలి నొప్పిని తగ్గించడంతో పాటు అసౌకర్యాన్ని నిరోధిస్తాయి.
ఇంజెక్షన్లు.. మోకాలి అసౌకర్యానికి మరొక ప్రభావవంతమైన చికిత్స ఇంజెక్షన్ థెరపీ. ఇంజెక్షన్లలో తరచుగా స్టెరాయిడ్లు లేదా శోథ నిరోధక మందులు ఉంటాయి. ఇవి తాత్కాలికంగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. హైలురోనిక్ యాసిడ్, లూబ్రికెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు తరచుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంజెక్షన్లలో కలిపి వినియోగిస్తారు.
ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా (PRP).. కొంతకాలంగా, కీళ్ల సమస్యలు, క్రీడా గాయాలకు చికిత్స చేయడానికి ఈ సాంకేతికత విధానం బాగా వినియోగిస్తున్నారు. రోగి రక్తం నుంచే ప్లేట్‌లెట్ అధికంగా ఉండే ప్లాస్మాను తీసి గాయపడిన ప్రదేశంలోకి ఇంజెక్ట్ చేస్తారు. దీని ద్వారా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
బ్రేసింగ్.. మోకాలికి బయట వైపు నుంచి పట్టును అందించేందుకు అమర్చేది మోకాలి బ్రేసెస్. ఇది మోకాలి కండరాలను బలోపేతం చేయడానికి, పట్టును పెంచడానికి అసౌకర్యం, వాపు నుండి ఉపశమనం పొందడానికి వీటిని వాడుతారు. ఇది నొప్పిని తగ్గించడంతో పాటు నడుస్తున్నా ఇబ్బంది లేకుండా చూస్తుంది.
ఫిజికల్ థెరపీ.. మోకాలి నొప్పికి చికిత్సగా ఫిజికల్ థెరపీని ఉపయోగించవచ్చు. ఫిజికల్ థెరపిస్ట్ ఆధ్వర్యంలో మోకాలి, దాని చుట్టుపక్కల కండరాలను బలోపేతం చేయడానికి కొన్ని వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. వివిధ రకాల స్ట్రెచ్‌లు ఇందులో ఉంటాయి. మసాజ్ థెరపీ కూడా ఉంటుంది. ఇది ప్రస్తుత కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న చికిత్స.
జీవనశైలి మార్పులతో.. మీ మోకాళ్ల స్థితిని బట్టి, మీరు మీ బరువును తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే పరుగెత్తడం, అధిక బరువులతో వ్యాయామం చేయడం మానేయాలి. అలాగే నొప్పిని తగ్గించేందుకు కొన్ని ఆహార అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవడం ఉత్తమం.
ఈ సాధారణ చికిత్సలతో నొప్పి అదుపులోకి రాకపోతే వైద్యులు కొన్ని శస్త్ర చికిత్సలు సూచిస్తారు. వాటిల్లో మొత్తం మోకాలి మార్పిడి శస్త్రచికిత్స, పాక్షిక మోకాలి మార్పిడి శస్త్రచికిత్స, ఆర్థ్రోస్కోపిక్ విధానాలు, ఆస్టియోటమీ వంటి శస్త్ర చికిత్సా విధానాలను అవలంభిస్తారు. అయితే మోకాలి నొప్పికి చికిత్స విధానాలు ఆ వ్యక్తి స్థితిని బట్టి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ చికిత్స విధానంలో మీకు ఉత్తమమైన ఉపశమనం లభిస్తుందో ఆర్థోపెడిక్ నిపుణుల సూచనలను బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం..