Health Tips: తరచూ ఎక్స్‌రే పరీక్షలకు వెళుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే..
Health Care Tips: చాలామంది తమ ఆరోగ్య సమస్యలు నిర్ధారించుకునేందుకు ఎక్స్‌రేలు తీయించుకుంటుంటారు. ముఖ్యంగా వృద్ధులు ఈ పరీక్షల కోసం తరచూ ఆస్పత్రులకు వెళుతుంటారు.
Health Care Tips: చాలామంది తమ ఆరోగ్య సమస్యలు నిర్ధారించుకునేందుకు ఎక్స్‌రేలు తీయించుకుంటుంటారు. ముఖ్యంగా వృద్ధులు ఈ పరీక్షల కోసం తరచూ ఆస్పత్రులకు వెళుతుంటారు. X-కిరణాలు అనే విద్యుదయస్కాంత కిరణాలను ఉపయోగించి ఈ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే పలు శస్త్రచికిత్సల్లోనూ వీటిని ఉపయోగిస్తుంటారు. కాగా ఈ X- కిరణాల నుంచి వెలువడే రేడియేషన్ వృద్ధులపై హానికరమైన ప్రభావం చూపుతుందని గత కొన్నేళ్లుగా ఆరోగ్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర విద్యుదయస్కాంత కిరణాలతో పోల్చుకుంటే X- కిరణాల రేడియేషన్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. పైగా వీటి ప్రభావాలను అంత సులభంగా గుర్తించలేరు. అయితే ఇవి మనుషుల DNAలో ఉత్పరివర్తనాలను కలిగిస్తాయి. ఫలితంగా భవిష్యత్‌లో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే అనివార్య పరిస్థితుల్లోనే X-రేలు అవసరమని సూచిస్తున్నారు.
ఎక్స్ పోజర్ ను తగ్గించేందుకు..
కాగా శస్త్రచికిత్సల సమయంలో సి-ఆర్మ్ మెషిన్ ఉపయోగిస్తారు. ఇది రోగికి, సర్జన్లకు రేడియేషన్ ఎక్స్‌పోజర్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక ప్రామాణిక విధానాల విషయంలో X- కిరణాల నుండి వచ్చే ప్రమాదం చాలా తక్కువ. మీరు ఒక సంవత్సరంలో పది ఎక్స్-రేలు లేదా ఒక ఏడాదిలో రెండు ఎక్స్-రేలు తీయించుకున్నారా? అన్నది ఇక్కడ సమస్య కాదు. రేడియేషన్ ఫ్రీక్వెన్సీ, తీవ్రతే ప్రాధాన్యం. ఇక సాధారణ పౌరులతో పోలిస్తే X- కిరణాలు వృద్ధులు, పిల్లలు, గర్భిణీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఎక్స్ కిరణాల రేడియేషన్ వృద్ధుల్లో పలు సమస్యలను కలిగిస్తుంది. ఎక్కువ రేడియేషన్ ఎక్స్‌పోజర్ క్యాన్సర్‌కు కారణమవుతుంది, అయితే ఎక్స్ రే ప్రక్రియలో రేడియేషన్ ఎఫెక్ట్ కాస్త తక్కువగానే ఉండడం కాస్త సానుకూలాంశం. అయినప్పటికీ ఎక్స్-రే వంటి మెడికల్ ఇమేజింగ్ ప్రక్రియ కోసం వెళ్లేటప్పుడు, పరీక్షలు పూర్తయ్యాక ఆరోగ్యపరంగా కొన్ని సూచనలు పాటించాలి. X- రే తీసుకునే ముందు, తర్వాత కచ్చితంగా వైద్యులతో మాట్లాడాలి. షాట్ జరిగిన ప్రదేశంలో నొప్పి, వాపు లేదా ఎరుపుగా మారితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఎముకల దృఢత్వం కోసం
శరీర నిర్మాణంలో ఎముకలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే వయసు పెరిగే కొద్దీ చాలామందిలో ఎముకల సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి వయసులో ఎముకల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం. క్షీణించిన ఎముకల సాంద్రత బోలు ఎముకల వ్యాధికి దారి తీస్తుంది. ఫలితంగా వెన్నెముక సంబంధిత సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. అలసట, బలహీనతో పాటు ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి కీళ్ల సమస్యలు కూడా తలెత్తుతాయి. వీటివల్ల సరిగా నడవలేరు. ఈక్రమంలో 70 ఏళ్లు దాటిన వారు ఎముకల దృఢత్వం, ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు. ఎముకలతో పాటు కండరాలు, కీళ్ల సమస్యలను తగ్గించడానికి క్యాల్షియంతో నిండిన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే వ్యాయామాన్ని లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకోవాలి. ఇక మహిళలు వయస్సు పెరిగే కొద్దీ తగినంత కాల్షియం, తగినంత విటమిన్ డి పొందేలా జీవనశైలిని మార్చుకోవాలి. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలు రోజుకు దాదాపు 1,200 mg కాల్షియం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే 70 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులు ప్రతిరోజూ 800 అంతర్జాతీయ యూనిట్ల (IU) విటమిన్ డిని తీసుకోవాలి. ఇక బోలు ఎముకల వ్యాధి ఉన్నట్లయితే, డాక్టర్ సూచించిన సూచనల ప్రకారం క్యాల్షియం, విటమిన్- డి సప్లిమెంట్స్ తీసుకోవాలి.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..