మేక రక్తం ఎక్కువగా తింటున్నారా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
మేక రక్తాన్ని తినడం ఆరోగ్యానికి మంచిదని.. శక్తి పెరుగుతుందని, రక్తహీనత తగ్గుతుందని, శరీర బలం మెరుగవుతుందని భావించి దీన్ని ఆహారంలో చేర్చేవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం..? మితిమీరినప్పుడు ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

మేక రక్తం అనేక శక్తివంతమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో ఎక్కువగా హిమోగ్లోబిన్, ప్రోటీన్, ఐరన్, విటమిన్ బీ12 ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించడంలో, శరీరానికి బలాన్ని ఇవ్వడంలో సహాయపడతాయి. మేక రక్తంలో 17 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీర కణాల అభివృద్ధికి ఉపయోగపడతాయి.
మేక రక్తంలో విటమిన్ B2, B3, B6, B12 లాంటి కీలక విటమిన్లు కనిపిస్తాయి. ఇవి నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మెదడు పనితీరు బాగా ఉండేలా చేయడంలో, శక్తి ఉత్పత్తిలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
పోషక విలువలే కాదు.. కొన్ని ప్రమాదాలు కూడా ఇందులో ఉన్నాయి. శుభ్రత లేని పరిస్థితుల్లో రక్తాన్ని సేకరిస్తే.. అది ఇన్ఫెక్షన్లు, వైరస్‌లు, బాక్టీరియా వంటివి కలిగి ఉండే ప్రమాదం ఉంటుంది. అలా శరీరంలోకి చొరబడితే జ్వరాలు, దృష్టి బలహీనత, అంతకన్నా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయొచ్చు.
ఆహార నిపుణులు సూచించేది ఏంటంటే.. బాగా శుభ్రం చేసి తగిన విధంగా ఉడికించిన తర్వాత మాత్రమే మేక రక్తాన్ని తీసుకోవాలంటారు. పూర్తి వేడి పద్ధతిలో వండితేనే దానిలోని సూక్ష్మజీవులు చనిపోతాయి. శరీరం ఎలాంటి హానికరమైన ప్రభావం లేకుండా దానిని జీర్ణించగలదు.
మేక రక్తంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తరచూ తినడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయి గణనీయంగా పెరిగిపోవచ్చు. దీని వల్ల హీమోక్రొమాటోసిస్ అనే వ్యాధి కలుగుతుంది. ఇది కాలేయం, గుండె వంటి ముఖ్య అవయవాల పనితీరును దెబ్బతీయవచ్చు. అందువల్ల దీనిని తరచూ అధికంగా తీసుకోవడం హానికరం.
మేక రక్తం పోషక విలువలతో నిండి ఉంది అనేది నిజమే. కానీ దానిని తీసుకునే ముందు పూర్తిగా శుభ్రత, వండే విధానం, మోతాదు వంటి అంశాలపై స్పష్టత ఉండాలి. వైద్యుల సలహాతో, మితంగా వాడితే ఇది ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




