ఫుడ్ పాయిజనింగ్ ఎందుకొస్తుంది..? ఏ ఫుడ్స్ వల్ల వస్తుంది..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!
కలుషితమైన ఆహారం లేదా నీటితో శరీరంలోకి హానికరమైన క్రిములు చేరితే ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది. దీని వల్ల వాంతులు, మోషన్స్, జ్వరం, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ హ్యాండ్లింగ్, కిచెన్ శుభ్రత, సరైన వంట పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి.

కలుషితమైన ఫుడ్ లేదా వాటర్ వల్ల మన శరీరంలోకి హానికరమైన క్రిములు చేరితే దాన్ని ఫుడ్ పాయిజనింగ్ అంటారు. చాలా మంది ఒకటి, రెండు రోజుల్లో దీని నుంచి బయటపడతారు. కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లు.. ఐదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వాళ్లకు ఇది ప్రమాదకరంగా మారవచ్చు.
ఫుడ్ పాయిజనింగ్ కు ప్రధాన కారణాలు బ్యాక్టీరియా, వైరస్ లేదా వాటి నుంచి వచ్చే టాక్సిన్స్. తిన్న కాసేపటికే వాంతులు, వికారం, మోషన్స్, కడుపునొప్పి, జ్వరం లాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి.
లక్షణాలు ఎప్పుడు కనిపిస్తాయి..?
సాధారణంగా కలుషిత ఆహారం తిన్న 2 నుంచి 6 గంటల్లో లక్షణాలు బయటపడతాయి. ఇది దేని వల్ల వచ్చిందో దానిపై ఆధారపడి ఉంటుంది. చాలా సందర్భాల్లో లక్షణాలు 12 నుంచి 48 గంటల వరకు ఉండి ఆ తర్వాత తగ్గిపోతాయి. ఫుడ్ పాయిజనింగ్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- క్లీనింగ్.. ఫుడ్ తినే ముందు, మాంసం లేదా కూరగాయలను పట్టుకున్న తర్వాత చేతులను కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. చేతుల లోపల, బయట, గోళ్ల చుట్టూ బాగా క్లీన్ చేసుకోవాలి.
- కిచెన్ క్లీనింగ్.. కిచెన్‌లో వాడే కటింగ్ బోర్డులు, మిక్సర్లు, జ్యూసర్లు అన్నీ వేడి నీళ్లు, సబ్బుతో శుభ్రం చేయాలి.
- బట్టలు.. వంటకు వాడే డిష్ క్లాత్‌లు, టవళ్లను తరచుగా వేడి నీటిలో లేదా వాషింగ్ మెషీన్ లో ఉతకాలి. వాటిని కిచెన్ లో వేరే పనులకు వాడకూడదు.
- కాయగూరల శుభ్రత.. పండ్లు, కూరగాయలు ఉప్పు, పసుపు, వెనిగర్ లేదా చింతపండు కలిపిన నీటిలో కొద్దిసేపు నానబెట్టి తర్వాత శుభ్రంగా కడగాలి. పూర్తిగా క్లీన్ చేశాకే వాటిని కట్ చేయాలి.
ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమయ్యే క్రిములు
- సాల్మొనెల్లా.. ఇది చాలా కామన్. సరిగ్గా ఉడకని చికెన్, పచ్చి గుడ్ల ద్వారా ఇది వస్తుంది.
- E.coli.. అన్ని రకాలు ప్రమాదకరం కావు. కానీ కొన్ని జాతులు పేగుల్లో ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా సరిగా ఉడకని మాంసం లేదా ఆకుకూరల్లో ఉంటాయి.
- లిస్టెరియా.. చీజ్, డెలి మీట్స్, హాట్‌డాగ్స్ ద్వారా వ్యాపిస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్‌కు ఇది చాలా ప్రమాదకరం.
- నోరోవైరస్.. ఉడికించని షెల్‌ఫిష్, ఆకుకూరలు తినడం వల్ల లేదా ఈ వ్యాధి ఉన్న వ్యక్తి ద్వారా సంక్రమిస్తుంది.
- హెపటైటిస్ A.. కలుషితమైన వాటర్, ఐస్ లేదా షెల్‌ఫిష్ ద్వారా వ్యాపిస్తుంది. ఇది కాలేయంపై ఎఫెక్ట్ చూపుతుంది.
- స్టెఫిలోకాకస్.. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి చేతుల ద్వారా ఫుడ్‌కి చేరుతుంది. మన బాడీలోని చాలా భాగాలపై ఇది ఎఫెక్ట్ చూపుతుంది.
- కాంపిలోబాక్టర్.. సరిగ్గా ఉడకని చికెన్, పచ్చి పాలు, కలుషితమైన కూరగాయల ద్వారా వస్తుంది. ఇది తీవ్రమైన లక్షణాలను కలిగిస్తుంది.
- షిగెల్లా.. ట్యూనా, బంగాళాదుంపలు, మాకరోనీ లేదా మయోన్నైస్ ద్వారా వ్యాపిస్తుంది. దీని వల్ల ఎక్కువగా మోషన్స్ వస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




