Alcohol Drinking: యాంటీబయోటిక్స్ వేసుకున్నప్పుడు ఆల్కహాల్ తాగొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే!
మద్యం.. ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా.. కొంతమంది నైట్ పెగ్ వెయ్యకుండా నిద్రపోరు. మరికొందరు...
మద్యపానానికి బానిసైన వారు చాలామంది ఉన్నారు. మద్యం.. ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా.. కొంతమంది నైట్ పెగ్ వెయ్యకుండా నిద్రపోరు. మరికొందరు రోజుకు రెండు పెగ్‌లైన వేస్తుంటారు. అయితే వైద్య నిపుణులు మాత్రం మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే.. అంత మంచిదని అంటున్నారు. అలాగే యాంటీబయోటిక్స్ తీసుకున్న సమయంలో కచ్చితంగా మద్యం సేవించకూడదని సలహా ఇస్తున్నారు. ఒకవేళ తీసుకుంటే లేనిపోని అనారోగ్య సమస్యలు రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ యాంటీబయోటిక్ టాబ్లెట్స్ తీసుకునేటప్పుడు ఆల్కహాల్ తాగొద్దని డాక్టర్లు అంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం..
మెట్రోనిడాజోల్(Flagyl):
ఈ యాంటీబయోటిక్ టాబ్లెట్.. చిగుళ్లు, దంత ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు, రోసేసియా, పొట్ట, కాలేయంలలో ఏర్పడిన బ్యాక్టీరియాలను చంపేందుకు ఉపయోగపడుతుంది. దీనిని వేసుకున్నప్పుడు మందు తాగినట్లయితే.. వాంతులు, కడుపునొప్పి, తలనొప్పి, వికారం వంటి సమస్యలు వస్తాయి.
టినిడాజోల్:
పేగు ఇన్ఫెక్షన్లకు ఈ యాంటీబయోటిక్ టాబ్లెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది వేసుకున్నప్పుడు ఆల్కహాల్ తాగినట్లయితే.. వికారం, వాంతులు, తలనొప్పి, రక్తపోటులో హెచ్చుతగ్గులు, ఊపిరాడకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.
అలాగే సల్ఫామెథోక్సాజోల్(Sulfamethoxazole), సెఫోటెటాన్(Cefotetan), లైన్జోలిడ్(Linezolid) లాంటి యాంటీ బయోటిక్స్ తీసుకునేటప్పుడు మద్యం, వైన్, బీర్‌లకు దూరంగా ఉండాలి. యాంటీబయోటిక్స్‌తో పాటు మద్యం సేవిస్తే.. కొన్ని గంటల పాటు దుష్ప్రభావాలు కనిపిస్తాయి. అలా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.