Health: ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తే వారానికి ఒక రోజు సెలవు.. సాఫ్ట్ వేర్ అయితే కంపెనీని బట్టి రెండు రోజులు.. మినహిస్తే ఇక పెద్దగా చెప్పుకోదగ్గ సెలవులు ఏమి ఉండవు. అదే స్టూడెంట్స్ కి అయితే దసరా, సంక్రాతి ఇలా అకేషన్ ను బట్టి దండిగానే సెలవులు ఉంటాయి. ఇలాంటి సెలవులు ఉద్యోగాలు చేసేవారికి ఉండవు. వారం నుంచి 10 రోజులపాటు ఉద్యోగులకు సెలవంటే అదే ఓ పెద్ద పండుగ.. ఉద్యోగులకు వారానికి పైగా సెలవులు ఇవ్వడం అనేది కళలో కూడా జరగని పని. కాని బెంగళూరుకు చెందిన కంపెనీ తన ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏకంగా 11 రోజుల సెలవులు ప్రకటించింది. అయితే ఇది మొదటిసారి కూడా కాదు. రెండో సారి తన ఉద్యోగుల మైండ్ రిలాక్స్ కోసం ఓ కంపెనీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయం ఉద్యోగులకు మానసిక ప్రశాంతతను ఇవ్వడంతో పాటు.. తరువాత రోజుల్లో వారు మరింత వేగంగా పనిచేయడానికి ఇలాంటి విశ్రాంతి దోహదం చేస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధిక పని ఒత్తిడితో ఉండే వారికి కొంత విశ్రాంతి లభించడం ద్వారా ఆ వ్యక్తి మరింత చురుగ్గా పనిచేయగలుగుతాడు. ఓ ఉద్యోగికి లేదా తీవ్ర పని ఒత్తిడిలో ఉండే వ్యక్తికి విరామం దొరకడం అంటే ఆవ్యక్తి తరువాత రోజుల్లో మరింత చురుగ్గా పనిచేయడానికి మైండ్ ను రీఛార్జ్ చేసుకున్నట్లే. అక్టోబర్ 22 నుంచి 11 రోజుల పాటు తమ ఉద్యోగులకు విశ్రాంతి కోసం సెలవులు ఇస్తున్నట్లు బెంగళూరుకు చెందిన కంపెనీ ప్రకటించింది. ఎప్పుడూ ఆఫీస్ పనిలో బిజీగా ఉండే వ్యక్తులు తమ పనిలో కొంత విరామం తీసుకోకపోతే ఎన్నో అనర్థాలు కలుగుతాయంటున్నారు ఢిల్లీకి చెందిన న్యూరో- సైకియాట్రిస్ట్ డాక్టర్ సంజయ్ చుగ్ (Dr Sanjay Chugh).
విరామం లేకుండా పనిచేయడం ద్వారా వ్యక్తి ఒత్తిడికి గురవుతాడు. పని మధ్యలో కొంత విరామం తీసుకోవడం ద్వారా మైండ్ లోని చెడు ఆలోచనలు, ఓ రకంగా చెప్పాలంటే మెడదులోని విషపదార్థం బయటకు వెళ్లి మైండ్ మరింత చురుగ్గా పనిచేస్తుందని డాక్టర్ సంజయ్ చుగ్ చెబుతున్నారు. కంపెనీలు తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై దృష్టిసారించాలి. పని నుంచి ఉపశమనం కల్పిస్తూ విరామం ఇవ్వడాన్ని రెగ్యులర్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఆవ్యక్తి మరింత బాగా పనిచేయగలుగుతాడని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే నియమం మన శరీరానికి వర్తిస్తుంది. మైండ్ తో పాటు, శరీరానికి విశ్రాంతి అవసరం. శరీరం, మెదడుకు విరామం లభించకపోతే మెదడులో విషపదార్థాలు, చెడు ఆలోచనలు పెరిగిపోయి.. ఆరోగ్యానికి చేటు చేస్తాయి. ఒక మొబైల్ ఫోన్ కు ఛార్జింగ్ అయిపోతే దానిని ఛార్జ్ చేస్తే ఎలా పనిచేస్తుందో.. ఓ వ్యక్తికి పనిలో విరామం అలాంటిది. విశ్రాంతి సమయంలో బాడీ లేదా మైండ్ ఛార్జింగ్ అవుతుంది. దాని ద్వారా కొత్త ఆలోచనలతో మరింత స్పీడ్ గా ఆ వ్యక్తి పనిచేయగలుగుతాడు.
పనిలో విరామం పై డాక్టర్ సంజయ్ చుగ్ (Dr Sanjay Chugh) మాట్లాడుతూ.. రోడ్లపై ఉన్న మురికి, వీధుల్లో చెత్తను వీధులను శుభ్రం చేయడం ఎంత ముఖ్యమో, మెదడుకు విశ్రాంతి ఇచ్చి.. అందులోని విషాన్ని తొలగించి, శరీరాన్ని, మెదడును ఛార్జ్ చేయడం అంతే ముఖ్యమన్నారు. చెత్తను తొలగించకుండా రోజుల తరబడి ఉంచితే ఆ ప్రాంతం చెత్త కుప్పగా మారుతుంది. ప్రతిచోటా దుర్వాసన వెదజల్లుతుంది. అలాగే విరామం ఇవ్వకపోతే మన మెదడు అలసిపోతుంది. దాని వల్ల మనిషి వేగంగా పనిచేయలేరని డాక్టర్ చుగ్ వివరించారు. ఒక మనిషికి నిద్ర, విశ్రాంతి ఎంతో ముఖ్యమైనవి. నిర్ణీత సమయం ప్రశాంతంగా నిద్రపోవడం ద్వారా మైండ్ రిలాక్స్ గా ఉంటుంది. మెదడులో స్కావెంజర్ కణాలను బయటకు పంపిచకపోతే అవి మైండ్ లో విషపదార్థాలుగా మారతాయి. విశ్రాంతి దొరకడం, నిద్రపోవడం ద్వారా స్కావెంజర్ కణాలు మెదడులో ఉండవని డాక్టర్ సంజయ్ చుగ్ తెలిపారు.
కోవిద్ (COVID) మహమ్మారి తర్వాత అనేక కంపెనీలు తమ పని విధానంలో అనేక మార్పులు చేశాయి. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) కు అవకాశం కల్పించింది. దీంతో ఇంటి దగ్గరనుంచే పనిచేయడంతో ఉద్యోగులు ప్రత్యేకంగా విరామాన్ని కోరుకోవడం లేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఆఫీసులకు వెళ్లి పని చేసే విధానాన్ని చాలా కంపెనీలు పునరుద్దరిస్తున్నాయి. దీంతో కొన్ని రోజుల తర్వాత పని ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని కల్పించేలా ఉద్యోగులకు కొంత విశ్రాంతినిచ్చే విధానాన్ని అవలంభించాలని డాక్టర్ సంజయ్ చుగ్ అభిప్రాయపడ్డారు. ఓవర్ వర్క్ నుంచి విరామం తీసుకోవడం ద్వారా ఆ వ్యక్తి చేసే పనిలో నాణ్యత పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కంపెనీలు తమ ఉద్యోగుల మానసిక ప్రశాంతత కోసం మధ్యలో కొన్ని రోజుల విరామాన్నిచ్చేందుకు తీసుకున్న నిర్ణయం ఉద్యోగి పనిలో సానుకూల అంశంగానే ఉంటుందని, మరింత నాణ్యతతో విధులు నిర్వహించడానికి వీలవుతుందని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..