Coffee Side Effects in Telugu: ఉరుకు పరుగుల జీవితం.. పనులు, బాధ్యతలు, ఒత్తిడి లాంటి సమస్యలు మనందరినీ వెంటాడుతుంటాయి. అందుకే.. బిజీలైఫ్‌లో పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు కుదిరితే.. ఓ కప్పు కాఫీ (Coffee), లేకపోతే టీ, గ్రీన్ టీ లాంటివి చాలామంది తాగుతుంటారు. అంతేకాకుండా ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే మొదట వీటినే తాగుతుంటుంటారు. అయితే.. కాఫీ తగడం వల్ల లాభాల కంటే.. నష్టాలే అధికంగా (Coffee Side Effects) ఉన్నాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత.. పరగడుపున కాఫీ (caffeine) తాగితే.. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటున్నారు. ఈ అలవాటు ఉన్నవాళ్లంతా వెంటనే మార్చుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీని ఉదయాన్నే తాగడం వల్ల నిద్రలేమితోపాటు మానసిక ప్రశాంతతకు భంగం కలుగుతుందంటున్నారు. కాఫీ తాగడం వల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు, గుండె, శ్వాస, రక్తపోటు సమస్యలతోపాటు ఇతర దుష్ప్రభావాలకు కారణమవుతుందని పేర్కొంటున్నారు. ఎక్కువ మొత్తంలో కాఫీ తీసుకోవడం వల్ల తలనొప్పి, ఆందోళన, దడపుట్టడం, ఆ తర్వాత క్రమంగా గుండెపోటుకు కూడా కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా రోజుకు ఆరు కప్పుల కాఫీ తాగితే.. మెదడుకు సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాఫీ ఎక్కువగా తాగడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రలేమి..
ఉదయాన్నే నిద్ర లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటే మానుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కెఫిన్ ఎక్కువగా ఉన్న కాఫీ తాగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. కాఫీ తాగడం వల్ల ముఖ్యంగా నిద్రలేమి సమస్య వస్తుంది. కెఫిన్ ఉన్న కాఫీని తాగడం వల్ల మీ మానసిక ప్రశాంతతకు భంగం కలగడంతోపాటు.. జీవక్రియ, శారీరక పనితీరుపై దుష్ప్రభావం చూపుతుంది.
జీర్ణ వ్యవస్థపై ప్రభావం..
చాలా మంది ఉదయాన్నే కప్పు కాఫీ తాగనది ఉండలేరు. అయితే.. కాఫీ ఉదయాన్నే తాగితే.. గ్యాస్ట్రిన్ విడుదలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కడుపులో ఉత్పత్తి చేసే హార్మోన్ వల్ల గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. జీర్ణాశయం, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనివల్ల కడుపులో వికారం, గ్యాస్, మంట లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
గుండెపోటు-రక్తపోటు..
అధిక కెఫిన్ తీసుకోవడం వల్ల కలిగే ఉద్దీపన ప్రభావాలు మీ గుండెను వేగంగా కొట్టుకునేలా చేస్తాయి. దీనివల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. దీంతోపాటు కాఫీ నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించి రక్తపోటును అమాంతం పెంచుతుంది. అందుకే గుండెపోటు, బీపీ ఉన్న వారు కాఫీకి దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు..
Also Read: