మూత్రంలో రక్తమా.. లైట్ తీసుకోవద్దు బాస్.. 90 రోజుల్లో ఏం జరుగుతుందో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
చాలామందికి మూత్రం ఎరుపు లేదా గులాబీ రంగులో రాగానే ఏదో వేడి చేసింది అనుకోవడం అలవాటు. కానీ అది ప్రాణాంతకమైన మూత్రాశయ క్యాన్సర్‌కు రెడ్ సిగ్నల్ కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా 8,500 మందిపై జరిపిన తాజా పరిశోధనలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. పురుషులలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించకపోతే ప్రాణాలకే ముప్పు.

మన ఆరోగ్యంలో వచ్చే చిన్న మార్పులే కొన్నిసార్లు పెద్ద ప్రమాదాలకు సంకేతాలు. ముఖ్యంగా మూత్రంలో రక్తం పడటాన్ని చాలామంది ఇన్ఫెక్షన్ లేదా వేడి వల్ల జరిగిందని సరిపెట్టుకుంటారు. కానీ యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ యూరాలజీ కాంగ్రెస్‌లో సమర్పించిన తాజా అధ్యయనం ప్రకారం.. ఇది మూత్రాశయ క్యాన్సర్‌కు తొలి హెచ్చరిక కావచ్చు. సకాలంలో స్పందించకపోతే పరిస్థితి విషమించి కేవలం 90 రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అధ్యయనం ఏం చెబుతోంది?
ప్రపంచవ్యాప్తంగా 380 ఆసుపత్రులలో సుమారు 8,500 మంది రోగులపై జరిపిన ఈ పరిశోధనలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. మూత్రంలో రక్తంతో ఎమర్జెన్సీ వార్డుకు వచ్చే ప్రతి నలుగురిలో ఒకరికి క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది. సరైన సమయంలో నిర్ధారణ పరీక్షలు జరగకపోతే, ఇటువంటి లక్షణాలున్న వారిలో 10 శాతం మంది 3 నెలల్లోపే మరణిస్తున్నారు. వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స అందించడం కష్టతరం కావడమే ఈ అధిక మరణాల రేటుకు ప్రధాన కారణం.
గుర్తించాల్సిన లక్షణాలు ఇవే..
మూత్రాశయ క్యాన్సర్ ప్రారంభంలో పెద్దగా నొప్పి ఉండదు, అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలవచ్చు.
మూత్రం రంగు మారడం: మూత్రం గులాబీ, ఎరుపు లేదా కోలా రంగులో రావడం.
నొప్పి లేని రక్తస్రావం: ఎటువంటి నొప్పి లేకుండానే మూత్రంలో రక్తం పడటం వల్ల చాలామంది దీనిని సీరియస్‌గా తీసుకోరు.
మూత్ర విసర్జనలో మార్పులు: తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, వెళ్లినప్పుడు మంటగా ఉండటం.
ముదిరిన దశలో: పక్కటెముకల కింద నొప్పి, కటి ప్రాంతంలో అసౌకర్యం, అకస్మాత్తుగా బరువు తగ్గడం.
భారతదేశంలో పరిస్థితి ఆందోళనకరం
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం.. భారత్‌లో పురుషులలో వచ్చే క్యాన్సర్లలో మూత్రాశయ క్యాన్సర్ 9వ స్థానంలో ఉంది. మొత్తం క్యాన్సర్ కేసుల్లో ఇది 3.9 శాతం వాటాను కలిగి ఉంది. అవగాహన లేకపోవడం వల్ల మన దేశంలో చాలా కేసులు చివరి దశలోనే బయటపడుతున్నాయి.
ప్రమాద కారకాలు
మూత్రాశయ క్యాన్సర్ కేసుల్లో 50-60శాతం సిగరెట్ తాగడం వల్లే వస్తున్నాయి. పొగాకులోని రసాయనాలు కిడ్నీల ద్వారా వడపోతకు గురై మూత్రాశయంలో పేరుకుపోవడం వల్ల క్యాన్సర్ గడ్డలు ఏర్పడతాయి.
రసాయనాలు: రంగులు, రబ్బరు, తోలు, పెయింట్ పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈ ముప్పు ఎక్కువ.
వయస్సు: వృద్ధాప్యం కూడా ఒక ప్రధాన కారణం.
ముందస్తు గుర్తింపే ప్రాణరక్షణ
వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే, దాదాపు 96 శాతం మంది రోగులు ఐదేళ్లకు పైగా ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉందని ఆంకాలజీ నిపుణులు చెబుతున్నారు. మూత్రంలో రక్తం కనిపిస్తే వెంటనే సిస్టోస్కోపీ లేదా CT స్కాన్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్‌ను ప్రారంభంలోనే పట్టుకోవచ్చు. లక్షణాలు కనిపించిన 48 గంటల్లోపే వైద్యుడిని సంప్రదించడం ప్రాణాలను కాపాడుకోవడంలో కీలకం.
