AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Health Diet: మహిళల ఆరోగ్యానికి మేలు చేసే 6 అద్భుతమైన పండ్లు..!

30 ఏళ్లు దాటిన మహిళలు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన పండ్లను తీసుకోవాలంటున్నారు వైద్యులు. ఈ పండ్లు తమ ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ పండ్లు ఏంటో.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Women Health Diet: మహిళల ఆరోగ్యానికి మేలు చేసే 6 అద్భుతమైన పండ్లు..!
Women Health Food Diet
Prashanthi V
|

Updated on: Feb 24, 2025 | 8:49 AM

Share

ప్రతి ఒక్కరికీ వయస్సు పెరగడం సహజం. అయితే శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందితే వయస్సు ప్రభావం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా 30 ఏళ్లకు పైబడిన మహిళలు సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, బలహీనత, ఎముకల సమస్యలు, చర్మ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచుకోవచ్చు. ఈ వయస్సులో ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు కొన్ని రకాల పండ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

యాపిల్

రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అని ప్రముఖంగా చెబుతారు. యాపిల్‌లో ఉన్న పెక్టిన్ అనే పీచు పదార్థం కొవ్వు నిల్వలను తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక ఫైబర్ కంటెంట్ వల్ల ఆకలి వేయకుండా నియంత్రించబడుతుంది. దీనివల్ల అధిక బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

జామపండ్లు

జామ పండు విటమిన్ C లో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరానికి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పొటాషియం, పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా నెలసరి సమస్యల నివారణకు సహాయపడే గుణాలు కూడా జామలో ఉంటాయి.

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్ A, C, ఫోలేట్, ఇతర ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని పపెయిన్ ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరిచి, అజీర్ణం, మలబద్ధకం సమస్యలను నివారించేందుకు సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే బీటా కెరోటీన్ గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించడంలో సహాయపడుతుంది.

చెర్రీ పండ్లు

వీటిని వారానికి మూడుసార్లు తింటే ఎముకల బలహీనత తగ్గి జాయింట్ల నొప్పులు తగ్గుతాయి. షుగర్ లేకుండా చెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు అందుతాయి.

ఆవకాడో

ఆవకాడో మోనోఅన్‌శాట్యురేటెడ్ కొవ్వులు అధికంగా కలిగి ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మధ్యాహ్న భోజనంలో సగం ఆవకాడో తినడం వల్ల ఆకలి నియంత్రణగా ఉండి ఎక్కువ తినకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యం చేసేందుకు సహాయపడుతుంది.

టమాటాలు

టమాటాలు కేవలం కూరగాయలు మాత్రమే కాకుండా పండ్ల కోవలోనూ ఉంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే లైకోపీన్ హార్మోన్ల సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. తరచుగా టమాటాలను తినే మహిళలు చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)