Morning Walk: చలికాలంలో మార్నింగ్ వాక్ చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

| Edited By: Velpula Bharath Rao

Dec 11, 2024 | 7:58 AM

చలికాలంలో మార్నింగ్ వాక్ చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి.. చలికాలంలో మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు.  ఎందుకో తెలుసా?

Morning Walk: చలికాలంలో మార్నింగ్ వాక్ చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
Morning Walk
Follow us on

చలికాలంలో మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళు గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు.  అసలు చలికాలానికి గుండెకు ఉన్న సంబంధం ఏమిటి..? చలికాలంలోనే అది కూడా తెల్లవారుజాము సమయంలోనే ఎక్కువగా గుండెపోటు రావడానికి గల కారణం ఏమిటి..? ఎండాకాలం, వానాకాలంతో పోల్చితే చలికాలంలో ఎక్కువగా గుండెపోట్లు సంభవిస్తున్నాయి. చల్లని వాతావరణానికి రక్తనాళాలు సంకోచిస్తాయి. రక్తప్రవాహం తగ్గి గుండెపై ఒత్తిడి ఏర్పడుతుంది. రక్తపీడనం ఎక్కువైతే గుండెపోటు వచ్చే ప్రమాదముంది. అధిక శారీరక శ్రమ, నిద్రలేమి, పని ఒత్తిడి, మానసిక సమస్యలు, తదితర కారణమని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.

చలిలో శారీరక శ్రమ ఒకింత గుండెకు హానికరమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. చలిలో ఎలాంటి రక్షణ లేకుండా ఆకస్మికంగా వ్యాయామాలు చేయటం వల్ల గుండె పనితీరు క్షీణిస్తుంది. గుండె సంబంధ సమస్యలు ఉన్న వారు చలికాలంలో తేలికపాటి వ్యాయామాలు ఎంచుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు కార్డిసోల్  లెవల్స్ (ఒత్తిడి హార్మోన్స్) పెరుగుతాయి. రక్తం గడ్డకట్టే ధోరణి ఉదయం పూటే ఎక్కువగా ఉంటుంది. చల్లని వాతావరణంలో వ్యాయామం చేయాల్సి  వస్తే నెమ్మదిగా ప్రారంభించి శరీరం కుదుటపడిన తర్వాత మోతాదు పెంచాలి. వీలైనంత వరకు బయట ప్రదేశాల్లో కాకుండా ఇంటి పరిసరాల్లోనే నడక, సాధారణ వ్యాయామాలు చేయడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ధ్యానం, ప్రాణాయామం వంటి వాటితో ప్రయోజనం ఉంటుంటుందంటున్నారు.

మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు ఉన్నవారు చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రతలను సరైన స్థాయిలో ఉంచే దుస్తులు ధరించాలి. దీర్ఘకాలిక వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు ఉన్నవారు తల, చెవులు, చేతులు, కాళ్లు వంటి భాగాలను చలి గాలికి గురికాకుండా రక్షించుకోవాలి. ధూమపానం, మద్యం అలవాటు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు రక్తపోటును పరీక్షించుకుంటూ నియంత్రించుకోవాలి. ఈ కాలంలో కూరగాయలు, పండ్లు, గింజలు, ప్యాటీ ఆమ్లాలు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. వేడి సూప్స్ గోరు వెచ్చని నీరు తాగటం మంచిది. చలిలో దాహం అనిపించకపోయినా తగినంత నీరు తీసుకోవాలి. డీహైడ్రేషన్ కారణంగా గుండెపై ఒత్తిడి పెరగవచ్చు. చలి వాతావరణానికి రక్తనాళాలు మూసుకుపోతాయి. రక్తం గడ్డకడుతుంది. ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. రాత్రి 10 నుంచి ఉదయం 5గంటల మధ్య ఛాతినొప్పి, తలనొప్పి వచ్చే అవకాశముంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రులకు వెళ్లాలి. మధుమేహ బాధితులు ఉదయం 7 గంటల తర్వాత వ్యాయామం చేయాలి. రక్తం పలుచబడే మాత్రలు తప్పనిసరిగా వాడాలి. లేనిపక్షంలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లు రావొచ్చు. చల్లని గాలులతో శ్వాసకోశ సమస్యలు తలెత్తి గుండెను ప్రభావితం చేస్తాయి. చలికాలంలో ధూమపానం చేసేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు పదిరెట్లు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి