AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్భిణీలకు డేంజర్ బెల్స్.. పుట్టబోయే పిల్లలపై కాలుష్యం ఎఫెక్ట్! సైంటిస్టుల హెచ్చరిక

నగరాల్లో పెరిగిపోతున్న వాయు కాలుష్యం కేవలం ఊపిరితిత్తులపైనే కాదు.. గర్భంలో పెరుగుతున్న పసికందులపై కూడా అత్యంత ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతోందని తాజా అధ్యయనంలో తేలింది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి..

గర్భిణీలకు డేంజర్ బెల్స్.. పుట్టబోయే పిల్లలపై కాలుష్యం ఎఫెక్ట్! సైంటిస్టుల హెచ్చరిక
Air Pollution Harms Babies In The Womb
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Jun 04, 2026 | 2:14 PM

Share

పట్టణ ప్రాంతాల్లోని కాలుష్య కారకాలు గర్భాశయ రక్షణ కవచాన్ని దాటుకుని లోపలికి ప్రవేశించి, పిండం ఎదుగుదలను ఎలా దెబ్బతీస్తున్నాయో శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా గుర్తించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిధులతో జరిగిన ఈ కీలక పరిశోధన లో వాయు కాలుష్యంలోని సూక్ష్మ ధూళి కణాలు (PM2.5 మరియు PM10) గర్భాశయంలోకి చొరబడి తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ కలిగిస్తాయి. ఇది శిశువు ఎదుగుదలకు అత్యంత అవసరమైన IGFBP3 అనే కీలక ప్రోటీన్‌ను నిలిపివేస్తుంది.ఈ ప్రోటీన్ లోపించడం వల్ల గర్భంలో పిండం ఎదుగుదల మందగిస్తుంది. దీని ప్రభావం పిల్లలు పుట్టిన తర్వాత, వారి బాల్యం ముగిసే వరకు కూడా కొనసాగే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఈ అధ్యయనం కోసం తీవ్రమైన కాలుష్యం ఉండే డిల్లీ,తక్కువ కాలుష్యం ఉండే జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ నగరాలకు చెందిన 994 మంది గర్భిణీల ప్రసవ రికార్డులను, అలాగే ఎలుకలపై జరిపిన ప్రయోగాలను పరిశీలించారు.ఢిల్లీ లాంటి నగరాల్లో నివసించే గర్భిణీలలో PM2.5 కాలుష్యానికి గురికావడం వల్ల పుట్టే పిల్లలు తక్కువ బరువుతో జన్మించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తేలింది. కాలుష్యం పెరిగే కొద్దీ గర్భిణీలలో ప్రమాదకరమైన రీతిలో రక్తపోటు పెరిగే ప్రీక్లాంప్సియా సమస్య ముప్పు గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల ముందస్తు ప్రసవాలు జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ వాతావరణంలోని కాలుష్య స్థాయిలకు గురైన గర్భిణీ ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఆందోళనకర ఫలితాలు వచ్చాయి. ఎలుకల పిల్లల పరిమాణం 25% వరకు తగ్గిపోయింది. పుట్టిన పిల్లల బరువు 34% వరకు తక్కువగా నమోదైంది. పుట్టబోయే పిల్లల్లో నరాల బలహీనత,చేతులు-కాళ్ల కదలికల్లో సమన్వయ లోపం, తీవ్రమైన ఆందోళన మరియు ఒత్తిడి వంటి లక్షణాలు కనిపించాయి.

కాలుష్యం నుంచి తమను తాము, పుట్టబోయే బిడ్డను కాపాడుకోవడానికి గర్భిణీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.బయటకు వెళ్ళేటప్పుడు నాణ్యమైన మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. శరీరంలో కాలుష్య టాక్సిన్స్‌తో పోరాడేందుకు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలి. గర్భిణీల వైద్య పరీక్షల్లో పొల్యూషన్ మానిటరింగ్‌ను కూడా ఒక భాగంగా చేర్చాల్సిన అవసరం ఉందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.రాబోయే రోజుల్లో ఈ కాలుష్యం తదుపరి తరాలపై ఐక్యూ తగ్గడం, గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు మెటబాలిక్ వ్యాధుల ప్రభావం చూపుతుందనే దానిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Follow Us