విలక్షణ కథలతో ప్రేక్షకులను మెప్పించడంలో ముందుండే హీరో సత్యదేవ్. తాజాగా ఈయన నటించిన ‘జీబ్రా’ విడుదలైంది. ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రముఖ కన్నడ నటుడు డాలీ ధనంజయ మరో హీరోగా నటించాడు. ఈ మనీ బేస్డ్ థ్రిల్లర్ ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
మూవీ రివ్యూ: జీబ్రా
నటీనటులు: సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్, సత్య, అమృత అయ్యంగార్ తదితరులు
సంగీతం: రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ: సత్య పొన్మార్
ఎడిటర్: అనిల్ క్రిష్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: ఈశ్వర్ కార్తీక్
నిర్మాతలు: బాల సుందరం, S. N. రెడ్డి, దినేష్ సుందరం
కథ:
సూర్య (సత్యదేవ్) బ్యాంక్ ఎంప్లాయ్. మరో బ్యాంక్ ఉద్యోగి స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ఐదేళ్లుగా ప్రేమలో ఉంటాడు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటారు. అయితే అనుకోకుండా స్వాతి ఓరోజు చేసిన చిన్న తప్పు వల్ల 4 లక్షలు ఒకరి అకౌండ్ నుంచి మరో అకౌంట్‌కు పోతాయి. దాంతో సూర్య ఏం చేయాలో తెలియక.. బ్యాంక్‌లోని లూప్ హోల్స్ వాడుకుని 4 లక్షలు తీసుకొస్తాడు. అక్కడ్నుంచి జరిగిన కొన్ని అనుకోని సంఘటనల కారణంగా గ్యాంగ్ స్టర్ అయిన ఆది (డాలీ ధనంజయ) సూర్య లైఫ్‌లోకి వస్తాడు. 4 లక్షలతో మొదలైన విషయం కాస్తా.. 4 రోజుల్లో ఆదికి 5 కోట్లు ఇచ్చే వరకు సాగుతుంది. ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి అయిన సూర్య అంత డబ్బు ఎలా తీసుకొస్తాడు..? ఆ 5 కోట్ల కోసం సూర్య ఏం చేశాడు..? అనేది మిగిలిన కథ..
కథనం:
డబ్బు కంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ మరోటి ఉండదు. దాని చుట్టూ కథ కాస్త పకడ్బందీగా అల్లుకుంటే తిరుగుండదు. అందుకే ఈ మధ్య ఎక్కువగా మన దర్శకులు కూడా డబ్బు ప్రధానమైన కథలనే రాస్తున్నారు. లక్కీ భాస్కర్‌తో పాటు మట్కా కూడా అలా వచ్చిన కథే. అందులో లక్కీ భాస్కర్ బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ అయింది.. మిస్ ఫైర్ అయిందేమో మట్కా అయింది. సినిమాను ఎంత బాగా ఓపెన్ చేసామనేది కాదు.. ఎలా ముగించాం అనేది కూడా ముఖ్యమే. జీబ్రా సినిమాలో మిస్ అయింది అదే. కథను చాలా ఇంట్రెస్టింగ్‌గా ఓపెన్ చేసిన దర్శకుడు ఈశ్వర్ కార్తిక్.. పోను పోను పట్టు వదిలేసాడు. ఇంటర్వెల్ టైమ్‌కు రొటీన్ కథలా మారిపోయింది జీబ్రా. సెకండాఫ్‌లో కథ మరింత జిగ్ జ్యాగ్ అయిపోయింది. సత్యదేవ్ లైఫ్‌లోకి ధనుంజయ్ వచ్చిన తర్వాత స్క్రీన్ ప్లే మరింత ఆసక్తికరంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ఫేస్ ఆఫ్ సీన్స్‌లోనూ ధనుంజయ్ పూర్తిగా డామినేట్ చేస్తుంటాడు. అక్కడ సత్యదేవ్ పూర్తిగా తేలిపోతాడు. మరోవైపు కథలో కారెక్టర్స్ ఎక్కువైపోయి.. కన్ఫ్యూజన్ పెరిగిపోయింది. బ్యాంక్‌లో డబ్బు ఎలా మాయం చేయొచ్చు.. లూప్ హోల్స్ వాడి ఎలా మోసం చేయొచ్చనేది ఇందులో చూపించాడు దర్శకుడు. నిజానికి ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ కానీ కథలో కొంతవరకు మాత్రమే ఆ ఇంట్రెస్ట్ క్యారీ అయింది.
నటీనటులు:
సత్యదేవ్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇదివరకు బ్లఫ్ మాస్టర్‌లో ఈ తరహా పాత్రకు దగ్గరగా ఉన్న కారెక్టర్ చేసాడు. కన్నడ నటుడు డాలి ధనుంజయ్ కీలక పాత్రలో మెప్పించాడు. గ్యాంగ్ స్టర్ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. ప్రియా భవానీ శంకర్ ఓకే.. కమెడియన్ సత్య ఉన్నంతలో నవ్వించాడు. బాబా పాత్రలో సత్యరాజ్ మెరిసాడు. అతిథి పాత్రలో అమృత అయ్యంగార్ పర్లేదు.. మిగిలిన వాళ్లంతా ఓకే.
టెక్నికల్ టీం:
సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించిన పాటలు జస్ట్ ఓకే.. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఎడిటర్ కొన్ని సీన్స్ కట్ చేసినా నష్టం ఉండేది కాదేమో..? ఎందుకంటే లెంత్ 2.44 గంటలకు ఉంది.. కానీ దర్శకుడి నిర్ణయం కాబట్టి ఎడిటర్‌ను తప్పు బట్టలేం. సత్య పొన్మార్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు బాల సుందరం, S. N. రెడ్డి, దినేష్ సుందరం నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ కథ వరకు మాత్రమే బాగుంది.. కథనం చాలా వీక్.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా జీబ్రా.. రాంగ్ క్రాసింగ్..