
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కుర్ర హీరోలతో పోటీపడుతూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు వెంకీ. అలాగే మల్టీస్టారర్ సినిమాలంటే చాలు ముందుంటారు వెంకీ. టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలందరితో మల్టీస్టారర్ సినిమాలు చేశారు ఈ సీనియర్ హీరో. రీసెంట్ గా ఎఫ్ 3 సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు రానా తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు వెంకటేష్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫిక్స్ ఈ సిరీస్‌ను నిర్మిస్తోంది. యాక్షన్, క్రైమ్ నేపథ్యంలో రాబోతున్న సిరీస్‌లో వీరిద్దరు తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాలో నటించారు వెంకీ.
ఈ సినిమాలో వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించారు. తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచినా ఓ మై కడవలె సినిమాను తెలుగులో ఓరి దేవుడా పేరుతో రీమేక్ చేశారు. మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఓరి దేవుడా’. పి.వి.పి బ్యానర్‌పై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో నటించారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న విడుదల చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో దేవుడి పాత్రలో నటించిన వెంకటేష్ రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో వెంకీ చిన్న పాత్రలోనే కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ కోసం మొత్తం ఐదు రోజుల పాటు కాల్షీట్స్ ఇచ్చారట వెంకీ. దానికి తగ్గట్లుగానే దర్శకనిర్మాతలు షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. ఐదు రోజుల డేట్స్ కోసం వెంకీకి రూ.3 కోట్లు చెల్లించారట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.