డైరక్టర్ రాజమౌళి ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉండగా.. గతంలో ఓ ఇంటర్వ్యలో పాల్గొన్న జక్కన్న మహేష్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు తాను తెరకెక్కించిన సినిమాలన్నింటికంటే ఈ మూవీ మరింత హై లెవల్లో ఉండనుంది.. గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంలో రాబోతుందని చెప్పడంతో మరింత హైప్ ఏర్పడింది. అలాగే ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉండనుందని ప్రముఖ రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ కూడా వెల్లడించారు. ఇక తాజాగా మరిన్ని విషయాలను బయటపెట్టారు విజయేంద్రప్రసాద్. ఈ సినిమా నిజ జీవిత సంఘటన నుంచి ప్రేరణ పొందిన కథ అని అన్నారు.
విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఇది అడ్వెంచర్ స్టోరి. వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది. అలాగే ఈ ఈ సినిమాను ఫ్రాంచైజీగా డెవలప్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సీక్వెల్స్ వస్తాయా అని ఓ యాంకర్ అడగ్గా.. ఆయన స్పందిస్తూ.. “సీక్వెల్స్ కచ్చితంగా వస్తాయి. ఈ సీక్వెల్స్ కథ మారుతున్నప్పటికీ ప్రధాన పాత్రలు మాత్రం అలాగే ఉంటాయి. మొదటి భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ ను పూర్తిచేసే పనిలో ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే ఈ సినిమాకు మహేష్ బాబు సరిగ్గా సరిపోతాడని.. అతను చాలా ఇంటెన్స్ యాక్టర్ అని అన్నారు విజయేంద్ర ప్రసాద్. చాలా కాలంగా తన కుమారుడు రాజమౌళి ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా తీయాలని అనుకుంటున్నారని.. కానీ ఇప్పటివరకు తనకు అలాంటి అవకాశం రాలేదని చెప్పారు. ఇప్పుడు ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమాకు మహేష్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.