
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది తిరుగులేని నటులు ఉన్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. వారిలో దిగ్గజ నటుడు పద్మనాభం ఒకరు.. కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆయన. దాదాపు 400కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు పద్మనాభం. కమెడియన్ గానే కాదు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ మెప్పించారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా రాణించారుపద్మనాభం. ఆయన సినీ జీవితం పాతాళభైరవి చిత్రం తర్వాత అనూహ్యమైన విజయాన్ని సాధించింది. సదాజపం వంటి విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన ప్రత్యేకమైన నడక, నటన పద్మనాభంను ఒక మంచి నటుడిగా నిలబెట్టాయి. అన్నపూర్ణ పిక్చర్స్, ఆదుర్తి సుబ్బారావు వంటి ప్రముఖులు ఆయనను ప్రోత్సహించారు. అదేవిధంగా ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు వంటి టాప్ హీరోలతో కలిసి దేశోద్ధారకులు, కులగోత్రాలు, మూగమనసులు వంటి దాదాపు 35-40 చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
మూగమనసులు చిత్రంలో సావిత్రి భర్తగా చేసిన పాత్ర ఆయన కెరీర్‌కు పెద్ద మలుపుగా నిలిచింది. అనేక చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న సమయంలో పద్మనాభంకి సొంతంగా సినిమా తీయాలనే ఆలోచన కలిగింది. తన స్నేహితులతో కలిసి రేఖా అండ్ మురళి ఆర్ట్స్ అనే బ్యానర్‌ను ప్రారంభించారు. తన మొదటి సినిమా దేవతకు రామారావు గారి కాల్షీట్లు సంపాదించి, ఇల్లు తాకట్టు పెట్టి 40,000 రూపాయల అడ్వాన్స్ ఇచ్చారు. దేవత చిత్రం విజయవంతమైనప్పటికీ, ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన జాతకరత్నం, మిడతంబొట్లు, శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న, పొట్టి ప్లీడరు, కథానాయక మొల్ల , శ్రీరామకథ వంటి సినిమాలు ఆర్థికంగా ఆయనను నిలబెట్టలేకపోయాయి.
తనకున్న ఆస్తులన్నీ సినిమాల నిర్మాణంలో పెట్టి పోగొట్టుకున్నారు. పద్మనాభం జీవితంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఒక దశలో అవకాశాలు లేక గ్రామానికి తిరిగి వెళ్లగా, ఆయన తమ్ముడు ప్రభాకర్ తేలు కుట్టి చనిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే తండ్రి, ఆపై చెల్లెలు, అల్లుడు, మరో చెల్లెలు కూడా మరణించారు. ఈ వరుస మరణాలతో ఆయన తీవ్ర నిరాశలోకి వెళ్లారు. తండ్రి నచ్చజెప్పడంతో మళ్లీ మద్రాసు వచ్చి నటించడం ప్రారంభించారు. కాగా పద్మనాభం మూడు పెళ్లిళ్లు చేసుకున్నారట. అయితే భార్యలను వారి సంతానాన్ని పోషించడం కూడా ఆయన ఆర్థిక కష్టాలకు ఒక కారణమని ఆయన సన్నిహితులు తెలిపారు. ప్రమీల అనే నాటక కళాకారిణితో రెండో పెళ్లి, మరో మహిళతో మూడో పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్యలలో ఇద్దరు, కొడుకు మురళి కూడా చనిపోయారు. 2009లో ఆయన కొడుకు కొడుకు మురళి దురలవాట్ల కారణంగా మరణించారు.ఇవన్నీ ఆయనను కుంగదీశాయి. ఇక సినిమా వైభవం అనే పేరుతో డాక్యుమెంటరీ తరహా చిత్రాన్ని నిర్మించే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక ఫైనాన్షియర్ వద్ద అప్పు తీసుకునేందుకు తన సూపర్ హిట్ చిత్రాల నెగటివ్‌లను తాకట్టు పెట్టగా, ఆ ఫైనాన్షియర్ వాటిని అక్రమంగా విక్రయించి పద్మనాభం గారిని మోసం చేశాడు. ఈ మోసం వల్ల ఆయన తీవ్ర మానసిక ఆవేదనకు గురై పిచ్చిపట్టిన వాడిలా రోడ్లపై తిరిగిన ఘటనలు కూడా జరిగాయి. పిచ్చివాడిలా చొక్కాలు చించుకొని రోడ్లపై తిరిగారట. ఆ తర్వాత తెలిసిన వారి సహాయంతో కోలుకున్నాక, చింతామణి వంటి నాటకలు, టీవీ సీరియల్స్ ద్వారా జీవనం సాగించారు. చివరిగా ఆయన మూడో భార్య కూడా చనిపోయారట. చివరికి కుటుంబంలో ఎవరూ మిగలకుండా, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఒంటరిగా జీవించిన పద్మనాభం 2010లో గుండెపోటుతో మరణించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.