తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. గతంలో పాటల రచయితగా ఓ వెలుగు వెలిగిన కుల శేఖర్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కుల శేఖర్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సింహాచలంలో పుట్టి పెరిగిన కుల శేఖర్ కు చిన్నప్పటి నుంచి సంగీత సాహిత్యాల మీద ఆసక్తి ఉండేది. చదువుకుంటున్న రోజుల్లో పాటలు రాసి బహుమతులు పొందాడు. అయితే చదువు తర్వాత ఒక ప్రముఖ మీడియా సంస్థలో జర్నలిస్టుగా చేరాడు. అదే సమయంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెలకువలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో రామోజీ రావు ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం సినిమాతో గేయ రచయితగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో అన్ని పాటలు ఆయనే రాశారు. దీని తర్వాత ఆర్. పి. పట్నాయక్, తేజ లతో కలిసి అనేక సినిమాలకు గేయ రచయితగా పనిచేశారు కుల శేఖర్. చిత్రంతో పాటు జయం, రామ్మా చిలకమ్మ, ఘర్షణ, వసంతం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా, మృగరాజు, సుబ్బు తదితర సినిమాల్లోని పాటలు కులశేఖర్ కలం నుంచి జాలువారినవే.
కాగా గీత రచయితగా బిజీగా ఉన్నప్పుడే ప్రేమలేఖ రాశా అనే సినిమాకు దర్శకత్వం వహించారు కుల శేఖర్. అయితే ఆ సినిమా విడుదలకు చాలా ఆలస్యం కావడం వల్ల అప్పుల పాలయ్యాడు. ఇది అతనిని మానసికంగా కుంగదీసింది. క్రమంగా సినిమా అవకాశాలు కూడా కరువయ్యాయి. కాగా2013 అక్టోబరు 24 న కాకినాడలో ఒక ఆలయంలో దొంగతనం చేసినందుకు గానూ పోలీసులు కుల శేఖర్ ను అరెస్ట్ చేశారు. అయితే విచారణలో అతని మానసిక స్థితి సరిగా లేదని వదిలేశారు. చికిత్స కోసం రాజమండ్రికి తరలించారు. కాగా కుల శేఖర్ కు హైదరాబాద్ తో పాటు వైజాగ్ లోనూ కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారు. అయితే ఎవరూ ఆయన గురించి పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఇక కులశేఖర్ భార్య ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తోందని సమాచారం.
Popular lyricist #Kulasekhar passed away today at Gandhi Hospital, Hyderabad due to health issues.#OmSanthi pic.twitter.com/EILzkeqIJA
— Vamsi Kaka (@vamsikaka) November 26, 2024
కాగా 2008లోనే మెదడకు సంబంధించిన సమస్యతో కులశేఖర్ పూర్తిగా జ్ఞాపకశక్తి కోల్పోయాడని అతని సన్నిహితులు గతంలో చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.