
ది కేరళ స్టోరీ’ సినిమాపై వివాదం ముదురుతోంది. మూవీ ట్రైలర్ మరింత కాంట్రవర్సీకి దారితీసింది. సినిమాపై రాజకీయం దుమారం సైతం చెలరేగింది. ‘ది కేరళ స్టోరీ’ మరో ‘ది కశ్మీర్ ఫైల్స్’ కానుందా..? జనాల్లో ఉత్కంఠ రేపుతున్న ఈ మూవీలో అసలేముంది..? ది కేరళ స్టోరీ.. ఇప్పుడీ మూవీ పెద్ద వివాదంలో చిక్కుకుంది. ద కేరళ స్టోరీ సినిమా రియల్ స్టోరీ ఆధారంగా నిర్మించిన చిత్రం అంటున్నారు. కేరళలో యువతులను బలవంతంగా మతమార్పిడి చేశారన్న నేపథ్యంలో సాగింది ఈ సినిమా కథనం. కొంత మంది యువతులు అకస్మాత్తుగా కన్పించకుండాపోతారు. వారిని మతం మారేలా చేయడమేకాక బ్రెయిన్ వాష్ చేసి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా మార్చుతారన్నది కథ నేపథ్యం. ఈ సినిమాలో హిజాబ్ ప్రస్తావన సైతం ఉంది. హిజాబ్ ధరిస్తే ఏ మహిళ రేప్‌కు గురికాదు… అల్లా అందరిని రక్షిస్తాడని హిందూ యువతితో ఓ ముస్లిం యువతి చెబుతుంది.
కేరళలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అన్న అంశాన్ని సైతం పరిశీలించాల్సి ఉంది. 2022 జనవరిలో కేరళలో ఐఎస్ స్లీపర్ సెల్స్ క్రియాశీలంగా ఉన్నాయని ఎన్ఐఏ వెల్లడించింది. 8 మంది ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చార్జిషీట్ ఫైల్ చేసింది. కేరళలోని ముస్లిం యువతీయువకులను ఉగ్రవాదంపైపు మళ్లించే ప్రయత్నాలు జరిగాయని వెల్లడించింది. ఇందులో మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పింది. మరోవైపు ఉమ్మెన్ చాందీ సీఎంగా ఉన్న కాలంలో మతపరివర్తన గణాంకాలను వెల్లడించారు. 2006-2012లో 7713 ప్రజలు ఇస్లాం స్వీకరించారన్నారు. 2009-2012 మధ్య మతం మార్పిడికి గురైనవారిలో 2667మంది యువతులున్నారు. వీరిలో 2195మంది యువతులు హిందువులు కాగా 492 మంది యువతులు క్రిస్టియన్లు ఉన్నారు. దీంతో ద కేరళ స్టోరీ సినిమాపై రాజకీయంగా కూడా దుమారం రేగుతోంది. రాజకీయాల కోసమే ఈ సినిమా నిర్మించారని శివసేన ఎంపీ అరవింద్ సామంత్ అన్నారు.
ఈ సినిమాను బహిష్కరించాలని ఆలిండియా ముస్లింజమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వి డిమాండ్ చేశారు. కేరళలో ఉగ్రవాదులు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతుంటే కేరళ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు బీజేపీ ఐటీవిభాగం ప్రముఖుడు అమిత్ మాలవియా
మొత్తంగా ఈ సినిమా.. టీజర్ విడుదలతోనే కష్టాల్లో పడింది. మరి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న ‘ది కేరళ స్టోరీ’ విడుదల అవుతుందో లేదో చూడాలి!
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..