Sumanth: నా మాజీ భార్యతో ఇప్పటికీ మాట్లాడుతుంటా..?
సుమంత్ తన మాజీ భార్య కీర్తి రెడ్డితో ఇప్పటికీ మంచి స్నేహం కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. వివాహంపై ప్రస్తుతానికి ఆసక్తి లేదని, హాస్యచతురత కలిగిన పరిణతి చెందిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. బాలీవుడ్‌లో దీపికా పదుకొణె నటన, రూపం తనకు నచ్చుతాయని సుమంత్ పేర్కొన్నారు.

నటుడు సుమంత్ తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సుమంత్ తన మాజీ భార్య కీర్తి రెడ్డితో తన సంబంధంతో పాటు, వివాహం, ఆదర్శవంతమైన భాగస్వామి గురించిన అభిప్రాయాలను పంచుకున్నారు. సుమంత్ తన మాజీ భార్య కీర్తి రెడ్డితో ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు నిర్మొహమాటంగా తెలిపారు. 2004లో వివాహం చేసుకుని, 2006లో విడాకులు తీసుకున్నప్పటికీ, తాము ఇప్పటికీ మంచి కుటుంబ స్నేహితులుగా ఉన్నారని, తాను తరచుగా ఆమెతో మాట్లాడుతుంటానని సుమంత్ పేర్కొన్నారు. కీర్తి రెడ్డి బెంగళూరులో వివాహం చేసుకుని స్థిరపడిందని, ఆమె అద్భుతమైన కుటుంబాన్ని కలిగి ఉందని, ఆమె సంతోషంగా ఉన్నందుకు తాను ఆనందిస్తున్నానని సుమంత్ చెప్పారు. తాను వ్యక్తిగతంగా గోప్యత పాటించేవాడిని కాదని, తన కాలేజీ, స్కూల్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి కూడా ఇంతకుముందు చెప్పానని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం తనకు ప్రేయసి లేదని, వివాహం చేసుకునే ఆలోచన కూడా లేదని సుమంత్ స్పష్టం చేశారు. ఈ విషయంపై తాను చాలా స్పష్టంగా ఉన్నానని, “ఎవరి పెళ్లికైనా వెళ్తాను కానీ నా పెళ్లికి వెళ్లను” అని తరచుగా చెప్పేవాడినని సరదాగా వ్యాఖ్యానించాను. భవిష్యత్తులో తన అభిప్రాయం మారితే, వివాహం చేసుకోవాలని అనిపిస్తే అప్పుడు ఆలోచిస్తానని అన్నారు. ప్రస్తుతం ఒంటరిగా, తన పెంపుడు కుక్కలతో, స్నేహితులతో, తన ఇంటి థియేటర్‌తో గడపడం చాలా సౌకర్యవంతంగా ఉందని, తాను ఆ దశకు చేరుకున్నానని ఆయన వివరించారు.
భాగస్వామిని ఎంచుకోవడంలో తన ప్రాధాన్యతలు మారాయని సుమంత్ తెలిపారు. గతంలో భౌతిక రూపానికి ప్రాధాన్యత ఇచ్చేవారని, కానీ ఇప్పుడు సంభాషణ, సమయం గడపడం, హాస్యం పంచుకోగల వ్యక్తిని కోరుకుంటున్నానని చెప్పారు. “హాస్యచతురత నాకు చాలా ఆకర్షణీయమైన లక్షణం” అని ఆయన నొక్కిచెప్పారు. ప్రశాంతంగా, కొద్దిపాటి క్లాస్‌తో, పరిణతితో ఉండే అమ్మాయిలను ఇష్టపడతానని, ఎక్కువ టాటూలు లేదా చెవి కుట్టించుకోవడం వంటివి తనకు పెద్దగా నచ్చవని సుమంత్ వెల్లడించారు. నటీమణుల విషయానికి వస్తే, బాలీవుడ్‌లో దీపికా పదుకొణె తనకిష్టమైన నటి అని సుమంత్ తెలిపారు. దీపిక రూపం, నటన తనకు పూర్తిగా నచ్చుతాయని పేర్కొన్నారు. “ఆమె అందం సహజంగా, చేరువగా అనిపిస్తుంది. నటిగా కూడా అద్భుతంగా ఎదిగింది” అని సుమంత్ ప్రశంసించారు.
తెలుగులో తనకు అంతగా ఆకట్టుకునే నటి ఎవరూ లేరని, తెలుగులో హీరోయిన్లకు మంచి, బలమైన పాత్రలు తక్కువగా లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. “అరుంధతి”, “ఏ మాయ చేశావే”లో సమంత, “అ!”లో వంటి చిత్రాలలో మాత్రమే మహిళలకు మంచి పాత్రలు లభించాయని ఆయన గుర్తు చేశారు. తన దినచర్య గురించి మాట్లాడుతూ, ఇంట్లో సమయం గడపడానికి ఇష్టపడతానని సుమంత్ చెప్పారు. తన సోదరి ఇంటికి తరచుగా స్కూటర్‌పై వెళ్తానని, అది కేవలం రెండు నిమిషాల దూరంలో ఉందని తెలిపారు. తనకు కొంతమంది సన్నిహితులు ఉన్నారని, వారితో సమయం గడపడం ఆనందంగా ఉంటుందని సుమంత్ పేర్కొన్నారు.
