AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: హీరోల రెమ్యునరేషన్‌పైనా వాటి ప్రభావం పడుతోందా? మరి నిర్మాతల సంగతేంటి!

టాలీవుడ్‌లో ఒకప్పుడు సినిమా హిట్ అయితేనే హీరోల రెమ్యునరేషన్ పెరిగేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. సినిమా థియేటర్లలోకి రాకముందే, అసలు షూటింగ్ మొదలవ్వకముందే కోట్లలో వ్యాపారం జరిగిపోతోంది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత సినిమా బడ్జెట్‌ ట్రెండ్‌లోనూ మార్పు వచ్చింది.

Tollywood: హీరోల రెమ్యునరేషన్‌పైనా వాటి ప్రభావం పడుతోందా? మరి నిర్మాతల సంగతేంటి!
Ott
Nikhil
|

Updated on: Jan 21, 2026 | 12:19 AM

Share

ఈ డిజిటల్ యుగంలో ఒక హీరో మార్కెట్ విలువను థియేటర్ల కంటే ఎక్కువగా ఓటీటీ సంస్థలే నిర్ణయిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఒక వింత పరిస్థితి నెలకొంది. ఒకే స్టార్ నటుడు నటించిన రెండు సినిమాలకు ఓటీటీ సంస్థలు ఇచ్చే రేట్లు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడాతో ఉంటున్నాయట. దీనివల్ల నిర్మాతలు నిలువునా మునిగిపోతుంటే, హీరోలు మాత్రం తమ రెమ్యునరేషన్ తగ్గించే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చుంటున్నారట. అసలు ఓటీటీ సంస్థలు చేస్తున్న ఈ ‘పార్షియాలిటీ’ వెనుక ఉన్న రహస్యం ఏంటి?

గతంలో సినిమా విడుదల తేదీలను నిర్మాతలు నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థలు తమ స్ట్రీమింగ్ డేట్స్ ప్రకారం థియేటర్ రిలీజ్ డేట్లను కూడా శాసిస్తున్నాయి. ఇప్పుడు కేవలం తేదీలే కాదు, హీరోల రెమ్యునరేషన్లను కూడా ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లే డిసైడ్ చేస్తున్నాయనే కొత్త పాయింట్ తెరపైకి వచ్చింది. ఒక హీరో సినిమాకు ఓటీటీ నుండి వచ్చే డీల్ విలువను బట్టే ఆ హీరో తన తర్వాతి సినిమా పారితోషికాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు.

ప్రముఖ నిర్మాత సృజన్ ఈ విషయంపై ఆసక్తికరమైన ఉదాహరణను పంచుకున్నారు. “ఒక హీరో నటించిన సినిమాకు ఒక ఓటీటీ సంస్థ రూ. 10 కోట్ల డీల్ ఇస్తుంది. అదే హీరోతో ఒక చిన్న నిర్మాణ సంస్థ సినిమా తీస్తే, దానికి కేవలం రూ. 4 కోట్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఓటీటీ సంస్థలు సినిమా కంటెంట్ లేదా మెరిట్ చూసి కాకుండా.. బ్యానర్ విలువ, ప్రొడక్షన్ వాల్యూస్ వంటి అంశాలను చూసి రేట్లు నిర్ణయిస్తున్నాయి” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్మాతల సందిగ్ధత..

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు చూపిస్తున్న ఈ వివక్ష వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. పెద్ద బ్యానర్లకు ఇచ్చే రేట్లు తమకు ఇవ్వకపోవడంతో చిన్న నిర్మాతలు అప్పుల పాలవుతున్నారు. మరోవైపు, హీరోలు మాత్రం ఈ డీల్స్ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తన గత సినిమాకు రూ. 10 కోట్ల ఓటీటీ డీల్ కుదిరింది కదా అని, తర్వాతి సినిమాకు రెమ్యునరేషన్ భారీగా పెంచేస్తున్నారు. ఒకవేళ ఆ సినిమా చిన్న బ్యానర్ కావడంతో ఓటీటీ డీల్ తక్కువకు కుదిరినా, హీరోలు మాత్రం తమ పారితోషికాన్ని తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు.

ఈ డిజిటల్ డీల్స్ గందరగోళం వల్ల టాలీవుడ్‌లో ఒక అస్తవ్యస్తమైన పరిస్థితి నెలకొంది. కంటెంట్‌ను నమ్మి సినిమా తీసే నిర్మాతలకు ఓటీటీల నుండి సరైన మద్దతు లభించకపోవడం ఇండస్ట్రీ భవిష్యత్తుకు ఆందోళన కలిగించే విషయమే. హీరోలు కూడా కేవలం పారితోషికం మీద కాకుండా, సినిమా నిర్మాణ వ్యయం మరియు ఓటీటీ బిజినెస్ మీద అవగాహన పెంచుకుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది.