
Krishnam Raju Demise: సీనియర్ నటుడు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) కన్నుమూయడంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది . గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నేటి ఉదయం 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో రెబల్‌స్టార్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. సినిమా ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజు మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కృష్ణంరాజు మృతికి సంతాపం తెలిపారు. ఆయన మరణం వెండితెరకు తీరని లోటని అభివర్ణించారు. కేంద్రమంత్రిగా దేశ ప్రజలకు సేవలందించారని గుర్తుచేసుకున్నారు. ఆయన తన అద్భుత నటనతో అశేష అభిమానం సంపాదించుకున్నారన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా కృష్ణం రాజు మృతికి సంతాపం ప్రకటించారు. ‘రెబల్ స్టార్’గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. వందలాది సినిమాల్లో నటించిన ఆయన రాజకీయాల్లోనూ సత్తాచాటారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా సేవలందించారు. కాగా కృష్ణంరాజు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు. 1940, జనవరి20న జన్మించారు. కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు. కృష్ణం రాజు మరణ వార్త తెలిసి మొగల్తూరు లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..