- Telugu News Photo Gallery Cinema photos Rebal Star Krishnam Raju is an actor who can express many different gestures on screen full details here
Krishnam Raju: తనదైన ఆహార్యంతో విభిన్న పాత్రలతో అలరించిన కృష్ణం రాజు.. జీవితంలో ముఖ్య ఘట్టాలు మీకోసం..
రెబల్ స్టార్... ఈ పదం వినగానే సినిమా ప్రియుల్లో అదో రకమైన ఉత్సాహం. ఇన్నాళ్లు ఉరకలు వేసిన ఈ ఆనందం, ఇప్పుడు మూగబోయింది. రెబల్ అభిమానుల్లో మాత్రమే కాదు, యావత్ సినిమా పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Updated on: Sep 12, 2022 | 2:04 PM

రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇక లేరు. రెబల్ స్టార్‌గా పాపులర్ అయిన కృష్ణం రాజు సొంతపేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. తెలుగు సినిమా కథానాయకుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా వెలుగు వెలిగిన కృష్ణంరాజు ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. విషయం తెలియగానే ప్రభాస్ హుటాహుటిన ఏఐజీకి చేరుకున్నారు.

కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు. తొలి భార్య సీతాదేవి కన్నుమూయడంతో, 1996లో శ్యామలా దేవిని వివాహం చేసుకున్నారు. దాదాపు 200 సినిమాల్లో నటించిన అనుభవం కృష్ణంరాజు సొంతం. చిలకా గోరింక అనే చిత్రంతో కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు కృష్ణంరాజు. అమరదీపం, భక్త కన్నప్ప వంటి సొంత చిత్రాలు గొప్ప నటుడిగా పేరు తెచ్చిపెట్టాయి

తెరమీద అన్ని రకాల హావభావాలను పలకించగల నిలువెత్తు రూపం.. రెబల్ స్టార్. 1976లో బాపు దర్శకత్వంలో భక్త కన్నప్ప సినిమాలో కృష్ణం రాజు నటించి తనలోని భక్తి రసాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. శ్రీకాళహస్తి ఆలయ మహాత్మ్యంలోని ముఖ్యమైన భాగమైన కన్నప్ప కథతో తెరకెక్కించారు.సాక్షాత్తు శివుడినే మెప్పించగలిగే పరమ భక్తుడి కన్నప్ప పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడా అన్నట్లుగా కృష్ణంరాజు తన నటన నైపుణ్యాన్ని తెరముందు ప్రదర్శించారు.

తెలుగువారికి వెండితెర బొబ్బిలి బ్రహ్మన్న కృష్ణంరాజు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1984 లో విడుదలైన సినిమా బొబ్బిలి బ్రహ్మన్న. బ్రహ్మన్నగా కృష్ణంరాజు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. పరుచూరి సోదరులు అందించిన కథ, మాటలు చిత్రానికి ప్లస్ పాయింట్ గా నిలిచాయి.

1987లో కటకటాల రుద్రయ్య సినిమా విడుదలైంది. కృష్ణంరాజు సినిమాల గురించి ప్రస్తావించాల్సి వస్తే కటకటాల రుద్రయ్య కచ్చితంగా ఉండాల్సిందే. అప్పట్లో ఈ సినిమా బాహుబలి కలెక్షన్స్‌ను రాబెట్టగలిగింది. కృష్ణంరాజు నటించిన 93వ చిత్రం ఇది. కథ కూడా వినకుండా కృష్ణంరాజు నటించిన ఏకైక చిత్రం కూడా ఇదే. దాసరి నారాయణ, కృష్ణంరాజు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో కటకటాల రుద్రయ్య బాక్సాఫీస్‌ని ఉపేసింది.

కృష్ణంరాజు కెరీర్‌లో చెప్పుకోదగ్గ మరో సినిమా అంతిమ తీర్పు. ఇందులో జర్నలిస్టుగా మెప్పించారు కృష్ణంరాజు. ఆయన కెరీర్‌లో మరిచిపోలేని చిత్రంగా నిలిచింది. స్వార్థ రాజకీయాలకు బలైన పాత్రలో కృష్ణంరాజు తన నటతో ప్రేక్షకులను మెప్పించారు. నా అనుకున్నవారిని పోగొట్టుకుని, అంగవైకల్యానికి గురైనా తన నిజాయితీతో... నమ్ముకున్న జర్నలిజాన్నే ఆయుధంగా మలుచుకుని ఎదిగిన వ్యక్తి కథే అంతిమతీర్పు.

నిన్నటితరానికే కాదు, నేటి తరానికి కూడా సుపరిచితులు కృష్ణంరాజు. ప్రభాస్ పెదనాన్నగా, సీనియర్ రెబల్ స్టార్‌గా ఆయనకు జనాల్లో ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ప్రభాస్ నటించిన బిల్లాలో స్పెషల్ కేరక్టర్ చేశారు కృష్ణంరాజు. రెబల్‌లోనూ వీరిద్దరూ కలిసి నటించారు. కృష్ణంరాజు నటించిన ఆఖరి సినిమా రాధేశ్యామ్. ఇందులో ప్రభాస్‌కి గురువుగా కనిపించారు.

కృష్ణంరాజు కెరీర్‌లో ప్రతి చిత్రమూ ఆణిముత్యమే. నటుడిగా తనదైన శైలితో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ని ఏర్పాటు చేసుకున్నారు కృష్ణంరాజు. ఆయన తెరమీద కనిపిస్తే కచ్చితంగా ఆ పాత్రకు ఏదో ప్రత్యేకం ఉంటుందని జనాల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.

కృష్ణంరాజు నటనకు వచ్చిన అవార్డులు చాలానే. అమరదీపం, మనవూరి పాండవులు సినిమాలకు రాష్ట్రపతి అవార్డులు అందుకున్నారు. అమరదీపం, ధర్మాత్ముడు, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు చిత్రాలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. అమరదీపం, బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలకు నంది అవార్డులు వరించాయి. 2014లో రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం అందుకున్నారు.

గోపీకృష్ణ మూవీస్ పతాకంపై 74 నుంచి పలు హిట్ సినిమాలను నిర్మించారు. 1974లో విడుదలైన కృష్ణవేణి నిర్మాతగా ఆయన తొలి చిత్రం. భక్త కన్నప్ప, అమరదీపం, మనవూరి పాండవులు, సీతారాములు, మధుర స్వప్నం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, బిల్లా, రాధేశ్యామ్ చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా ఓ సినిమా సెట్స్ మీద ఉంది. కృష్ణంరాజు మృతిపట్ల సినీ ప్రముఖులు పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.





























