అతని కోసం కష్టపడిన ప్రతిరూపాయి ఇచ్చేశాడు.. ఎం.ఎస్. నారాయణ గురించి ఇది తెలిస్తే కన్నీళ్లు ఆగవు
ఎం.ఎస్ నారాయణ. అసలు పేరు సూర్యనారాయణ. 1995లో పెదరాయుడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన కామెడీ, నటనతో ఆకట్టుకున్న ఆయన ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నారు. తెలుగులో దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించారు. నటుడిగానే కాకుండా రచయితగానూ రాణించారు. అంతకుముందు కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశారు.

తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు దివంగత హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రకరకాల పాత్రలు చేసి మెప్పించారు. కమెడియన్ గా నవ్వులు పూయించిన ఎం.ఎస్ అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశారు. కాగా ఎం.ఎస్. నారాయణ జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి మరో నటుడు ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. కొడుకు కోసం తాను కష్టపడ్డ డబ్బులన్నీ ఇచ్చేశారని తెలిపాడు ఆ నటుడు. ఇచ్చిన మాటకు ఎం.ఎస్. నారాయణ ఎలా నిలబడ్డాడో వివరించారు. ఆరోజు అతన్ని చూస్తే కన్నీళ్ళువచ్చాయి అని తెలిపారు. ఇంతకూ ఆ నటుడు ఎవరు.? ఎం.ఎస్. నారాయణ కొడుకు కోసం ఎం చేశారో చూద్దాం.!
ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఎం.ఎస్. నారాయణ జీవితంలోని హృదయం ద్రవింపజేసే సంఘటనను పంచుకున్నారు. ఓ మీటింగ్ లో తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ఎం.ఎస్. నారాయణ తన కొడుకును సినీరంగంలో హీరోగా నిలబెట్టాలనే తపనతో ఒక సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. సినిమా నిర్మించడం అంటే మాటలు కాదు. ఆ సినిమా కోసం కోట్ల రూపాయలు అవసరమయ్యాయి. ఈ క్రమంలో, రావులపాలెంకు చెందిన ఒక పెద్ద వ్యాపారవేత్తను సంప్రదించారు. అతను తనికెళ్ల భరణికు బాగా తెలిసినవాడు కావడంతో ఎం.ఎస్. నారాయణ వ్యక్తిత్వం గురించి ఆయన నిజాయితీ గురించి భరణిని వాకబు చేశారట. ఎటువంటి సంకోచం లేకుండా ఎం.ఎస్. నారాయణను నమ్మొచ్చు అని చెప్పారట. ఆయన డబ్బుకు ఎటువంటి ఢోకా ఉండదని హామీ ఇచ్చారట. భరణి ఇచ్చిన హామీతో ఆ వ్యాపారవేత్త సినిమాకు పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకున్నాడని చెప్పారు భరణి.
అయితే సినిమా తీసిన తర్వాత అనేక కారణాల వల్ల అది ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. దీంతో ఎం.ఎస్. నారాయణ అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ డబ్బు చెల్లించే సమయంలో తనికెళ్ల భరణి కూడా అక్కడ ఉన్నారట. ఎం.ఎస్. నారాయణ పెద్ద సిమెంట్ బస్తాలో లక్షలరూపాయలను తీసుకువచ్చి, ఆ డబ్బును ఆ వ్యాపారవేత్తకు ఇచ్చాడట. దృశ్యం తనికెళ్ల భరణిని తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఎందుకంటే అన్ని లక్షలు ఇక్కడ( సినిమాల్లో) ఒక మనిషికి సంపాదించడం చాలా కష్టం. అంత సంపాదించిన డబ్బు ప్రతీ రక్తపు బొట్టు అలా నా కళ్ల ముందు ఇస్తుంటే నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి అని భరణి తెలిపారు. ఆ సమయంలో ఎం.ఎస్. నారాయణ కళ్ళలో కన్నీళ్లతో “పర్లేదు గురుజీ, భగవంతుడు మళ్లీ మనకు ఇంకోటి ఏదో మార్గం చూపిస్తాడు. ఏం చేసినా నా కొడుకు కోసమే కదా” అని అన్న మాటలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి అని అన్నారు. కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి పడిన ఆ అద్భుతమైన త్యాగం, దాని వెనుక ఉన్న తపన భరణిని ఎంతగానో ప్రభావితం చేశాయి. భగవంతుడు ఆ మాటలు విన్నాడేమో.. ఆ తర్వాత ఎం.ఎస్. నారాయణ తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హాస్యనటుడిగా గుర్తింపు సాధించారు. ఇవాళ ఎం.ఎస్. నారాయణ భౌతికంగా లేకపోయినా, ఆయన జ్ఞాపకాలు, ఆయన చూపిన తండ్రి ప్రేమ, నిజాయితీ ఇప్పటికీ సజీవంగా ఉన్నాయని తనికెళ్ల భరణి ఎమోషనల్ అయ్యారు. “గురుజీ!” అని ఎక్కడినుంచో పిలిచి, వచ్చి వేదిక మీద కూర్చుంటాడేమో అనిపిస్తుంది అంటూ ఎం.ఎస్. నారాయణతో తన అనుబంధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని తనికెళ్ల భరణి గుర్తుచేసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




