Ichata Vahanamulu Nilupa Radu Review: అలరిస్తున్న సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’..
అక్కినేని కుర్ర హీరో సుశాంత్ సాలిడ్ హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతున్నాడు. చిలసౌ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సుశాంత్ ఆతర్వాత సెకండ్ హీరోగా మారోపోయాడు..
నటీనటులు: సుశాంత్-మీనాక్షి చౌదరి-వెంకట్-వెన్నెల కిషోర్-ప్రియదర్శి-అభినవ్ గోమటం మాటలు: సురేష్ బాబా-భాస్కర్ నిర్మాతలు: రవిశంకర్ శాస్త్రి-ఏక్తా శాస్త్రి-హరీష్ కోయలగుండ్ల కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దర్శన్
అక్కినేని కుర్ర హీరో సుశాంత్ సాలిడ్ హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతున్నాడు. చిలసౌ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సుశాంత్ ఆతర్వాత సెకండ్ హీరోగా మారోపోయాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురంలో సెకండ్ హీరోగా నటించాడు సుశాంత్. ఇక ఇప్పుడు ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..ఎస్. దర్శన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సుశాంత్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. తాజాగా ఈ మూవీ ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
అరుణ్ (సుశాంత్) ఒక ఆర్కిటెక్ట్ కంపెనీలో పనిచేసే మధ్య తరగతి కుర్రాడు. తన కంపెనీలోకి కొత్తగా వచ్చిన మీనాక్షి (మీనాక్షి చౌదరి)తో అరుణ్ ప్రేమలో పడతాడు. మీనాక్షి కూడా అతడిని ప్రేమిస్తుంది. తన జీవితంలో కొనబోయే తొలి బైక్ మీద మీనాక్షిని కూర్చోబెట్టి తిప్పాలని అనుకున్న అరుణ్.. బండి కొనగానే దాన్ని తీసుకుని మీనాక్షి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన ఇంటికి వెళ్తాడు. కానీ అదే సమయంలో మీనాక్షి ఇల్లుండే కాలనీలో ఒక మహిళపై హత్యాయత్నం జరుగుతుంది. తనింట్లో నగలు దొంగతనానికి గురవుతాయి. అరుణ్ వేసుకొచ్చిన బైక్ దొంగదేనని అనుకున్న ఆ కాలనీ వాసులు .. అతడి అంతు చూడాలని ఎదురు చూస్తుంటారు. ఆ పరిస్థితి నుంచి హీరో ఎలా తప్పించుకున్నాడు. హీరో హీరోయిన్లు కలుసుకున్నారా లేదా అన్నది తెలియాలంటే సినిమా చుడాలిసిందే..
కథనం:
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ఇంట్రెస్టింగ్ టైటిల్ చూడగానే ఇదేదో కొత్త తరహా సినిమా అని అర్థమయిపోతుంది. ఈ సినిమా టీజర్.. ట్రైలర్లో కథ గురించి హింట్స్ ఇచ్చేశారు చిత్రయూనిట్. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాకథ మరీ కొత్తదని చెప్పలేం కానీ.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగానే నడుస్తుంది. ఎంచుకున్న పాయింట్ కూడా కొత్తగా ఉంది. దర్శకుడు దర్శన్ కూడా దాన్ని బాగా నడిపించాడు. థ్రిల్లర్ కథాంశం ఎంచుకుని తొలి గంటను కామెడీ.. లవ్ తో నడిపించి ఆకట్టుకున్నాడు. మధ్యలో నుంచి కథ కాస్త ఉత్కంఠ రేకెత్తించినప్పటికీ అవసరం లేని పాత్రలు.. సన్నివేశాల కాస్త అసహననికి గురిచేస్తాయి.. మొత్తానికి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ఆ జానర్లోకి అడుగు పెట్టడానికే చాలా టైం తీసుకుంది. దాదాపు రెండున్నర గంటల నిడివితో ఉన్న ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకేతించింది. వెన్నెల కిషోర్ మంచి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. షోరూంలోనే కూర్చుని హీరో తన ప్రేమకథ చెప్పడం ఆకట్టుకుంది. ఓవైపు హీరో ఆర్థిక కష్టాలను ప్రస్తావిస్తూ ఇంకోవైపు అతను ప్రతి సీన్లోనూ డిజైనర్ డ్రెస్సులేసుకుని సీఈవో లాగా తయారై రావడం.. కథానాయికతో సరదాగా ప్రేమాయణం సాగించడం అలరిస్తుంది. మొదట్లో హీరో హీరోయిన్ ప్రేమలో పడటంచూపించారు. ఈ ప్రేమకథ అయ్యాక కానీ అసలు కథలోకి వెళ్లలేదు దర్శకుడు. హీరోయిన్ ఇంట్లో హీరో ఇరుక్కుపోయే దగ్గర ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి ద్వితీయార్ధం మీద ఆసక్తి పెంచగలిగారు. హీరో అక్కడ్నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు కొంత ఉత్కంఠ రేకెత్తిస్తాయి. కథ పరంగా ఉన్న సస్పెన్స్ ద్వితీయార్ధాన్ని నడిపిస్తుంది. వెన్నెల కిషోర్.. సునీల్ పాత్రలను ప్రవేశ పెట్టి నవ్వులు పూయించారు. సస్పెన్స్ రివీలయ్యే చోట ప్రేక్షకులు థ్రిల్ అవుతారు.
నటీనటులు:
పెర్ఫామెన్స్ పరంగా సుశాంత్ ఆకట్టుకున్నాడు. ఈ కథకు.. పాత్రకు తగ్గట్లుగా అతను కనిపించి అలరించాడు. అరుణ్ పాత్రలో చక్కగా నటించాడు. హీరోయిన్ మీనాక్షి చౌదరి జస్ట్ ఓకే అనిపించింది. కొన్ని చోట్ల అందంగా కనిపించిన ఆమె.. నటన పరంగా కూడా మెప్పించింది. చాన్నాళ్ల తర్వాత తెరపై కనిపించిన వెంకట్ ఆకట్టుకున్నాడు. అభినవ్ గోమటం బాగా చేశాడు. రవివర్మ పర్వాలేదు. వెన్నెల కిషోర్ ను దర్శకుడు ఇంకొంచం ఉపయోగించుకుంటే బాగుండు అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం:
సుకుమార్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లున్నాయి. సురేష్ బాబా-భాస్కర్ రాసిన మాటలు ఆకట్టుకుంటాయి. దర్శకుడు దర్శన్ మెప్పించాడు. అతనెంచుకున్న పాయింట్ బాగుంది. ఇందులో కామెడీ.. లవ్ అంటూ ఆసక్తికరంగా నడిపించాడు. ప్రవీణ్ లక్కరాజు నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. ఆర్ఆర్ పరంగా. హీరోయిన్ ఇంట్లో వచ్చే పాట అన్నింట్లోకి వినడానికి బాగుంది. మిగతా పాటలు ఓకే అనిపించాయి.
చివరగా… ఆకట్టుకున్న ఇచ్చట వాహనములు నిలపరాదు..