సలలిత రాగసుధారసాన్ని పంచిన సుస్వరాల సుసర్ల.. లతాను తెలుగువారికి పరిచయం చేసింది ఆయనే!

సలలిత రాగసుధారసాన్ని పంచిన సుస్వరాల సుసర్ల.. లతాను తెలుగువారికి పరిచయం చేసింది ఆయనే!
Tollywood

ఆయన సలలిత రాగ సుధారసాన్ని మనందరికి పంచిన మహా స్వరకర్త... గాన కోకిల లతా మంగేష్కర్‌ను తెలుగు వారికి పరిచయం చేసిన సంగీత ద్రష్ట. తెలుగు సినిమా...

Balu

| Edited By: Ravi Kiran

Feb 09, 2022 | 3:05 PM

ఆయన సలలిత రాగ సుధారసాన్ని మనందరికి పంచిన మహా స్వరకర్త… గాన కోకిల లతా మంగేష్కర్‌ను తెలుగు వారికి పరిచయం చేసిన సంగీత ద్రష్ట. తెలుగు సినిమా సంగీతానికి కొత్త సొబగులు చేకూర్చిన సంగీత విద్వాంసుడు. చక్కని పాట వరసకు చిక్కని స్ఫూర్తి. ఆయనే సుసర్ల దక్షిణామూర్తి. ఇవాళ ఆయన వర్ధంతి. దక్షిణామూర్తి గురించి నాలుగు మాటలు. మనసు దోచే మధుర గీతాలెన్నింటినో ఆయన సృష్టించారు. తెలుగు సినీ సంగీత చరిత్రలో అజరామరంగా నిలిచిపోయే అనేక గీతాలను ఆవిష్కరించారు. సినీ సంగీతంలో ఆయనది ఓ ప్రత్యేకమైన శైలి. ప్రతి పాటల్లో అది ప్రతిఫలిస్తుంది. ఆయన హార్మోనియం అందుకోగానే సుస్వరాలు ఆయన చుట్టు ప్రదిక్షణలు చేస్తాయి. ఆయన పాటలో ఇమిడిపోవడానికి రాగాలు తహతహలాడిపోతాయి. అసంకల్పితంగానే శ్రుతులు తమకు తాము సవరించుకునేసి సిద్ధమైపోతాయి. ఆయన పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సంతానం సినిమాలో లతా మంగేష్కర్‌తో పాడించిన జోల పాటను ఎవరైనా మర్చిపోగలరా? తాదాత్మ్యంలోకి తీసుకెళ్లి గుండెని చెమరింపచేయదూ! పల్లవికి, తొలి చరణానికి హిందుస్తానీ రాగమైన బేహాగ్‌ని ఆధారంగా చేసుకున్న సుసర్ల వారు జాలి తలచి కన్నీరు తుడిచే చరణానికి భైరవిని వాడుకున్నారు. అందుకు కారణం కరుణ, ఆర్ర్దతలను పలికించే గుణం భైరవిలో వుండటమే! ఇవన్నీ సుసర్లకు తెలుసు కాబట్టే అంత గొప్పవారయ్యారు. సుసర్లవారు 1921, నవంబర్‌ 11న కృష్ణా జిల్లా దివిసీమలో దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకళ్లేపల్లిలో అన్నపూర్ణ, కృష్ణబ్రహ్మ శాస్త్రి దంపతులకు జన్మించారు. తన ఆరో ఏట నుంచి తండ్రిగారి దగ్గరే సంగీతాన్ని అభ్యసించారు. అప్పుడే వయోలిన్‌ను కూడా నేర్చుకున్నారు. చదువు పెద్దగా అబ్బలేదు కానీ చిన్నవయసులోనే సంగీత విద్యలో మాత్రం అద్భుత ప్రతిభను కనబర్చారు.. పదమూడేళ్లకే రాజాస్థానాలలో సంగీత కచేరీలు ఇచ్చారు.. పదహారో ఏటనే గజారోహణ గౌరవం అందుకున్నారు..

సుసర్ల దక్షిణామూర్తికి ఆయన తాతగారి పేరే పెట్టారు. తాతగారు త్యాగరాజస్వామి శిష్యపరంపరలో ఒకరు. ఈయన త్యాగరాజు ప్రియ శిష్యుడు ఆకుమళ్ల వెంకట సుబ్బయ్య గారి దగ్గర సంగీతం అభ్యసించి ఓ గురువుగా ఎంతో మందికి శాస్త్రీయ సంగీత విద్యాదానం చేశారు. పారుపల్లి రామకృష్ణయ్య ఈయన శిష్యుడే. తండ్రిగారి దగ్గర నుంచి సుసర్ల కృష్ణబ్రహ్మశాస్త్రికీ అనంతరం ఆయన కుమారుడైన సుసర్ల దక్షిణామూర్తి జూనియర్‌కూ శాస్త్రీయ సంగీతం వాహినిగా ప్రవహించింది. శాస్త్రీయ సంగీతంలో అపారమైన పాండిత్యాన్ని గడించారు కాబట్టే ఆయన కట్టిన పాటలు అంత మనోహరంగా వుంటాయి.సంగీతంలో సుసర్ల విద్వత్తును గుర్తించిన నటి కాంచనమాల ప్రముఖ సంగీత దర్శకుడు భీమవరపు నరసింహారావుకు పరిచయం చేశారు.. ఆయన పిలుపుతో సుసర్ల మద్రాసుకెళ్లారు.. ఆయన దగ్గరే సహాయకునిగా పని చేశారు.. బిఎన్‌ ఆర్‌ ట్రూపులో వయోలిన్‌ వాయించడంతో పాటు అప్పుడప్పుడు పాటలు కూడా పాడారు సుసర్లవారు.. 1938లో హెచ్‌ఎంవి సంస్థలో హార్మోనిస్టుగా చేరారు.. ఆ మరుసటి ఏడాది ఉద్యోగాన్ని ఆకాశవాణికి మార్చుకున్నారు.. దక్షిణ భారత భాషల సంగీత నిర్దేశకుడిగా ఎన్నో మధురమైన బాణీలను ఆకాశవాణి శ్రోతలకు అందించారాయన! 1946లో నారద నారది సినిమాతో సినీ సంగీత దర్శకుడిగా మారారు.. అందులో ఓ చిన్న పాత్రను కూడా వేశారు ఆ తర్వాత సేతు బంధన్‌, భట్టి విక్రమార్క చిత్రాలకు సంగీతాన్ని అందించారు.

తొలి రోజుల్లో సంసారం (1950)తో నిలదొక్కుకున్న సుసర్ల ఆ తరువాత సంగీతం అందించిన చిత్రాల్లో ముఖ్యమైనవి కొన్ని – ఆలీబాబా – నలభై దొంగలు, సర్వాధికారి (1951), ఆడజన్మ (1951), దాసి (1952), సంతానం (1955), ఇలవేలుపు (1956), హరిశ్చంద్ర (1956), భలే బావ (1957), శ్రీకృష్ణలీలలు (1959), అన్నపూర్ణ (1960), నర్తనశాల (1963), శ్రీమద్విరాటపర్వం (1979), శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (1984) మొదలైనవి. నిండైన గాత్రం ఉన్న దక్షిణామూర్తి తొలి రోజుల్లో సినీ నేపథ్య గాయకుడిగా పలు పాటలు పాడారు. పరమానందయ్య శిష్యులు (1950), శ్రీలక్ష్మమ్మ కథ (1950), స్త్రీ సాహసం (1951) మొదలైన చిత్రాలలో ప్రముఖ హీరో అక్కినేని నాగేశ్వరరావుకు ప్లే-బ్యాక్‌ పాడారు. సర్వాధికారి’ (1951) చిత్రంలో తమిళ హీరో ఎం.జి.ఆర్‌.కు గొంతు అరువిచ్చారు.

సుదీర్ఘ సినీ జీవితంలో సుసర్లవారు అన్ని భాషల్లోనూ కలిపి నూటపాతికకుపైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. సంగీత దర్శకులు ఎస్‌.పి.కోదండపాణి, ఏ.ఏ.రాజ్‌, శ్యామ్‌ వంటివాళ్లు ఈయనదగ్గర పని చేసిన వాళ్లే… ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ కూడా ఈయన దగ్గర హార్మోనిస్టుగా పని చేశారు. పి.లీల, జమునారాణి, బెంగుళూరు లత వంటి గాయనీమణులకు తెలుగులో తొలి అవకాశం ఇచ్చింది సుసర్లే! మంగళంపల్లి బాలమురళీకృష్ణను సినీ ప్రేక్షకులకు దగ్గర చేసింది కూడా సుసర్లనే! సినీ సంగీతంలో వచ్చిన మార్పులు సుసర్ల వారిని నెమ్మదిగా సినిమాలకు దూరం చేశాయి. దానికి తోడు ఆరోగ్యం ఆయనతో చెలగాటమాడుకుంది… మధుమేహ వ్యాధి కారణంగా ఆయన రెండు కళ్లూ దెబ్బతిన్నాయి… ఎనిమిదో దశకంలో కుటుంబ పోషణ కోసం సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర వయోలిన్‌ ఆర్టిస్టుగా కూడా పని చేయాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో ఎన్టీయార్‌ తను తీసిన సినిమాలకు సుసర్ల వారినే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు.. సుసర్లంటే ఎన్టీయార్‌కు ప్రత్యేకాభిమానం. శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా అప్పుడే సుసర్ల రెండు కళ్లు సరిగ్గా కనిపించకుండా పోయాయి.. ఆ స్థితిలో కూడా ఆయన హార్మోనియం మెట్ల మీద వేళ్లు కదిలిస్తూ బాణీలు కట్టారు.. గాయకులతో పాడించారు.. సుసర్ల దక్షిణామూర్తి మోహినీ రుక్మాంగద, రమా సుందరి అనే రెండు సినిమాలను కూడా నిర్మించారు. నిర్మాణ వ్యవహారాల్లో పెద్దగా అనుభవం లేకపోవడంతో చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది… ఆయన ఎన్నో సత్కారాలను.. పురస్కారాలను అందుకున్నారు.. ఆంధ్ర రాష్ర్ట అవతరణ సందర్భంగా ప్రార్థన గీతాన్ని ఆలపించింది సుసర్లవారే! అందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు.. స్వరశిల్పి, సంగీత కళాప్రపూర్ణ, సుస్వరాల సుసర్ల , స్వర బ్రహ్మ, సంగీత కళానిధి, సంగీత సమ్రాట్‌ వంటి బిరుదులు సుసర్ల పేరు ముందు చేరాయి. ఎన్టీయార్‌ స్వయంగా స్వర సుధానిధి బిరుదును ప్రదానం చేశారాయనకి! బిరుదులు కొలమానం కాదు కానీ ఆయన మాత్రం తెలుగు పాటకు మకరందాలను అద్దారన్నది మాత్రం నూటికి నూరుపాళ్లు నిజం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu