
బాలీవుడ్ నటి, కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ ఈ మధ్యన యూట్యూబర్ గా అవతారం ఎత్తారు. తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా సినీ సెలబ్రిటీల హోమ్ టూర్ వీడియోలు చేస్తున్నారామె. అంతే కాదు తన వంట మనిషితో కలిసి వెళుతూ, ఆయా సెలబ్రిటీల ఇంట్లో కొత్త వంటకాలను రుచి చూస్తున్నారు. అలా తాజాగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇంటికి వెళ్లారు ఫరాఖాన్. ముంబైలోని నటుడి ఇంటికి వెళ్లిన ఆమె వారితో సరదాగా, సందడిగా గడిపారు. విలాసవంతమైన వారి ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను చూసిన ఫరాఖాన్ చాలా ఆశ్చర్యపోయారు. అలాగే సోనూ వద్ద పనిచేస్తున్న స్టాప్‌ను కూడా పరిచయం చేశారు. ముఖ్యంగా సోనూ సూద్ ఇంట్లో షూ కలెక్షన్ చూసి ఈ కొరియోగ్రాఫర్ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిన ఈ వీడియోలో సోనూ సూద్ భార్య, ఇద్దరు కుమారులు ఇషాంత్, అయాన్ లు కూడా కనిపించడం విశేషం. ఇక సోనూ సూద్ విలాసవంతమైన ఇంటి విషయానికి వస్తే.. దీని ధర సుమారు రూ. 20 కోట్లు. నటుడు తన ఇంటికి గంగోత్రి అని పేరు పెట్టుకున్నాడు.
సోనూసూద్ ఇంటి ప్రవేశ ద్వారం వద్దనే గంగోత్రి అని ఇంగ్లీష్, హిందీ భాషల్లో రాసిన ఒక పెద్ద బోర్డు కనిపిస్తుంది. బయట బహిరంగ స్థలం చుట్టూ వివిధ రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. వైట్ అండ్ క్రీమ్ కలర్ థీమ్‌తో అలంకరించబడిన డ్రాయింగ్ రూమ్, విశాలమైన డైనింగ్ ఏరియాలు ఉన్నాయి. ఇక ఇషాంత్, అయాన్ లకు ప్రత్యేక గదులు ఉన్నాయి. మొదటి అంతస్తుకు వెళ్లే ముందు, పెద్ద కుమారుడు ఇషాంత్ రూమ్ ను చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అద్భుతమైన కాన్వాస్ పెయింటింగ్ ఇట్టే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడి నుంచి బయటికి వెళ్లడానికి ఎగ్జిట్ గ్లాస్ డోర్ ఉంటుంది. మెట్లు ఎక్కిన తర్వాత, తెల్లటి సోఫాలు, పెద్ద టీవీతో కూడిన కూడిన మీడియా రూమ్ ఉంటుంది. సోను సూద్ అభిమాని బహుమతిగా ఇచ్చిన థ్రెడ్ ఆర్ట్ ను కూడా చూడొచ్చు.
సోనూ సూద్ ఇంట్లో హైలెట్ అంటే షూ కలెక్షన్. దీనిని చూసి డైరెక్టర్ ఫరాఖాన్ ఆశ్చర్యపోయారు. ఇక హోమ్ టూర్‌లోని తదుపరి గది సోనూ సూద్ చిన్న కుమారుడు అహాన్ రూమ్. గ్రే కలర్ పెయింటింగ్స్, మల్టీపుల్ కలర్స్ అనిమే ఆర్ట్, యెల్లో కలర్ ఫర్నీచర్ తో ఈ రూమ్ ఎంతో అందంగా అలంకరించారు. ఈ రూమ్ బయట మామిడి చెట్టుతో సహా అనేక చెట్లతో కూడిన విశాలమైన బాల్కనీ కూడా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరలవుతోంది.
సోను సూద్ చివరిసారిగా యాక్షన్-థ్రిల్లర్ ఫతేలో కనిపించాడు. ఈ మూవీకి అతనే దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం నంది అనే మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు సోనూసూద్. ఈ చిత్రానికి కూడా అతనే దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.