Sound Party Review: ‘సౌండ్ పార్టీ ‘ రివ్యూ.. ప్రేక్షకులను నవ్వించే కామెడీ డ్రామా..
బిగ్ బాస్ విన్నర్ విజే సన్నీ హీరోగా నటించిన సినిమా సౌండ్ పార్టీ. సంజయ్ షేరీ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 24న విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. కామెడీతో కడుపులు చెక్కలు చేసిందా లేదా.. సన్నీ హీరోగా నిలబడ్డాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం..కామెడీ బేస్డ్ కథలు తెలుగులో చాలానే వచ్చాయి. ముఖ్యంగా ఈజీ మని కోసం ఎగబడే స్టోరీస్ ఎన్నో రాసారు మన దర్శకులు. అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ ఇలాంటి కథలను బాగా డీల్ చేసేవాళ్లు. ఇప్పుడు సౌండ్ పార్టీ కూడా ఇలాంటి కథతోనే వచ్చింది.

మూవీ రివ్యూ: సౌండ్ పార్టీ
నటీనటులు: వీజే సన్నీ, హృతికా శ్రీనివాస్, శివన్నారాయణ, భువన్ సాలూరు, అలీ, సప్తగిరి, పృథ్వీరాజ్, చలాకీ చంటి, శైలజ ప్రియ తదితరులు
సంగీతం: మోహిత్ రహ్మానియాక్
సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ జె రెడ్డి
ఎడిటర్: అవినాష్ జి
నిర్మాతలు: రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర
దర్శకుడు : సంజయ్ షెరీ
బిగ్ బాస్ విన్నర్ విజే సన్నీ హీరోగా నటించిన సినిమా సౌండ్ పార్టీ. సంజయ్ షేరీ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 24న విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. కామెడీతో కడుపులు చెక్కలు చేసిందా లేదా.. సన్నీ హీరోగా నిలబడ్డాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం..
కథ:
జీవితంలో ఎలాంటి కష్టం లేకుండా సౌండ్ పార్టీ అవ్వాలనుకునే తండ్రీ కొడుకులు కుబేర్ కుమార్ (శివన్నారాయణ నరిపెద్ది), డాలర్ కుమార్(వీజే సన్నీ). ఎప్పటికైనా కోటీశ్వరులు అవ్వాలనేది వీళ్ల కల. దానికోసం ఏవేవో ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలోనే లోకల్ ఎమ్మెల్యే జోడెద్దుల వరప్రసాద్ (30 ఇయర్స్ పృథ్వీ) తన కొడుకుని (భువన్ సాలూరు) కాపాడుకోడానికి డబ్బు ఆశ చూపించి కుబేర్, డాలర్ కుమార్‌లను జైలుకి పంపిస్తారు. డబ్బులు వస్తున్నాయి కదా అని.. అసలు కేసేంటో తెలియకుండానే జైలుకు వెళ్లిపోతారు తండ్రీ కొడుకులు. తీరా జైలుకు వెళ్లాక.. అది దొంగతనం కేసు కాదు రేప్ కేసు అని తెలుస్తుంది. మరి ఆ కేసు నుంచి డాలర్, కుబేర్ కుమార్‌లు ఎలా బయటపడ్డారు.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ..
కథనం:
కామెడీ బేస్డ్ కథలు తెలుగులో చాలానే వచ్చాయి. ముఖ్యంగా ఈజీ మని కోసం ఎగబడే స్టోరీస్ ఎన్నో రాసారు మన దర్శకులు. అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ ఇలాంటి కథలను బాగా డీల్ చేసేవాళ్లు. ఇప్పుడు సౌండ్ పార్టీ కూడా ఇలాంటి కథతోనే వచ్చింది. ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బి ది కింగ్ అని ఆ ఒక్కటి అడక్కులో రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు కదా.. అలాగే జనరేషన్స్ తరబడి మేం రాజులం, కోటీశ్వరులం అంటూ కలలు కనే కుటుంబం కథ ఇది. ఇందులో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. అక్కడక్కడా మంచి మంచి కామెడీ సీన్స్ కూడా పడ్డాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కేవలం నవ్వించడం తప్ప మరో మోటో ఏదీ పెట్టుకోకుండా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సంజయ్. అందుకే ఇందులో లాజిక్స్ వెతకడం అనవసరం. పూర్తిగా కామెడీపైనే ఫోకస్ చేసాడు దర్శకుడు. కాకపోతే సౌండ్ పార్టీకి మైనస్ ఏంటంటే స్లో నెరేషన్. పైగా కథలో కూడా ఎలాంటి కొత్తదనం లేదు. ఈ కాన్సెప్ట్ ఇప్పటికే ఓల్డ్ అయిపోయింది.. దాన్నే పట్టుకుని మరో సినిమా చేసారంతే. ఫస్టాఫ్ అంతా ఏదో సోసోగా సాగిపోతుంది కానీ సెకండాఫ్ మాత్రం పర్లేదు. అక్కడక్కడా మంచి నవ్వులు పూసాయి. ముఖ్యంగా బిట్ కాయిన్ కామెడీ అయితే అదిరిపోయింది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఈ సీన్ కడుపులు చెక్కలయ్యేలా నవ్వస్తుంది. బిట్ కాయిన్ అంటే తెలియని అమాయకులు ఎలా మోసపోతున్నారనేది కూడా ఇందులో చూపించారు. కొన్ని సీన్స్ అయితే ఎందుకు వస్తాయో అర్థం కాదు. ముఖ్యంగా సీనియర్ కమెడియన్ అలీ పాత్ర అయితే పూర్తిగా వేస్ట్ అని చెప్పాలి. ఆయన సీన్స్ రెండు మూడు ఉన్నా ఎందుకో అర్థం కాదు. హీరో హీరోయిన్ ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోదు. అసలేమాత్రం కొత్తదనం కోరుకోకుండా.. ఏదో కాసేపు అలా నవ్వుకుందాం అనుకున్న వాళ్లకు సౌండ్ పార్టీ ఓకే..
నటీనటులు:
హీరో వీజే సన్నీ బాగున్నాడు.. స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకుంటుంది. నటన కూడా బాగానే ఉంది. కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. డాలర్ కుమార్‌గా మంచి టైమింగ్ చూపించాడు. ఇక ఆయనతో పాటు మరో హీరో కాని హీరోగా నటించాడు శివన్నారాయణ. అప్పాజిగా తెలిసిన ఈయన.. ఈ సినిమాలో తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. ఆయన సీన్స్ చాలా వరకు నవ్వు తెప్పిస్తాయి. ఇక హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ బాగుంది.. స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకుంటుంది. అలాగే అలీ, సప్తగిరి, చలాకీ చంటి ఓకే. 30 ఇయర్స్ పృథ్వీ ఉన్నంత వరకు ఓకే. ఎమ్మెల్యే కొడుకుగా భువన్ సాలూరు నటన బాగుంది.
టెక్నికల్ టీం:
మోహిత్ మ్యూజిక్ జస్ట్ ఓకే. పాటలు ఏమంతగా ఆకట్టుకోవు. సినిమాటోగ్రఫీ వర్క్ పర్లేదు. ఎడిటింగ్ అక్కడక్కడా చాలా సీన్స్ తీసేసి ఉంటే బాగుండేది. కానీ ఫైనల్ కాల్ దర్శకుడికి కాబట్టి ఎడిటర్‌ను ఏమనలేం. ఈ సినిమాలో డైలాగ్స్ బాగున్నాయి. అక్కడక్కడా మంచి మాటలు పడ్డాయి. ఇక దర్శకుడు సంజయ్ షెరి మంచి ఎంటర్‌టైన్మెంట్ కథతోనే వచ్చాడు కానీ స్క్రీన్ ప్లే లోపాలతో రొటీన్ సినిమాగా మిగిలిపోయింది సౌండ్ పార్టీ. సిల్లీ లాజిక్స్ సినిమాలో చాలా ఉన్నాయి.
