AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shashtipoorthi Movie Review: షష్టిపూర్తి సినిమా రివ్యూ.. రాజేంద్రప్రసాద్ మూవీ ఎలా ఉందంటే.. ?

ఈ మధ్యకాలంలో తన వయసుకు తగిన పాత్రలు వరుసగా చేస్తూ వెళ్తున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఈ క్రమంలోనే ఆయన నుంచి వచ్చిన సినిమా షష్టిపూర్తి. రూపేష్ చౌదరి ఈ సినిమాను నిర్మించాడు. సినిమాలో ఆయనే హీరో కూడా. అర్చన, ఆకాంక్ష సింగ్ కీలక పాత్రలలో నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Shashtipoorthi Movie Review: షష్టిపూర్తి సినిమా రివ్యూ.. రాజేంద్రప్రసాద్ మూవీ ఎలా ఉందంటే.. ?
Shashtipoorthi Movie
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: May 31, 2025 | 6:33 AM

Share

మూవీ రివ్యూ: షష్టిపూర్తి

నటీనటులు: రాజేంద్రప్రసాద్, రూపేష్ చౌదరి, ఆకాంక్ష సింగ్, అర్చన, ప్రభాస్ శీను తదితరులు

సినిమాటోగ్రాఫర్: రామ్

సంగీతం: ఇళయరాజా

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

నిర్మాత: రూపేష్ చౌదరి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పవన్ ప్రభా

ఈ మధ్యకాలంలో తన వయసుకు తగిన పాత్రలు వరుసగా చేస్తూ వెళ్తున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఈ క్రమంలోనే ఆయన నుంచి వచ్చిన సినిమా షష్టిపూర్తి. రూపేష్ చౌదరి ఈ సినిమాను నిర్మించాడు. సినిమాలో ఆయనే హీరో కూడా. అర్చన, ఆకాంక్ష సింగ్ కీలక పాత్రలలో నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

శ్రీరామ్ (రూపేష్) యువ లాయర్. చిన్నప్పటి నుంచి నీతి న్యాయం అనేది ఆయన పెంపకంలోనే ఉంటాయి. న్యాయవాదిగా మారి వాటికి కాపాడాలని నిరంతరం పోరాడుతూ ఉంటాడు. అలా సాగుతున్న శ్రీరామ్ జీవితంలోకి జానకి (ఆకాంక్ష సింగ్) వస్తుంది. తన విషయం ఇంట్లో చెబుదామంటే శ్రీరామ్ తల్లిదండ్రులు రాజేంద్ర ప్రసాద్, అర్చనలు చాలా రోజుల నుంచి మట్లాడుకోకుండా ఉంటారు. ఈ ఇద్దరిని కలపడానికి జానకి, శ్రీరామ్ షష్టిపూర్తి ప్లాన్ చేద్దామనుకుంటారు. ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సంఘటనలేంటి.. అసలు శ్రీరామ్ తల్లిదండ్రులు ఎందుకు మాట్లాడుకోరు.. షష్టిపూర్తి తర్వాత వాళ్లు మాట్లాడారా లేదా అనేది.. తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే..

కథనం:

ఈ మధ్య కాలంలో చాలా పెద్ద పెద్ద సినిమాల కంటే చిన్న చిన్న సినిమాలలోనే మంచి కథలు వస్తున్నాయి. అలా షష్టిపూర్తి కూడా ఒక మంచి ఆలోచన నుంచి పుట్టింది అని అర్థమవుతుంది. తల్లిదండ్రుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి ఒక కొడుకు చేసే చిన్న సైజు పోరాటమే ఈ షష్టిపూర్తి సినిమా. పూర్తిగా కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీసారు అని అర్థమవుతుంది. కాకపోతే కామన్ ఆడియన్ కోరుకునే వేగం ఈ సినిమాలో కనిపించదు. కాస్త నెమ్మదిగా సాగే స్లో పేస్ ఫ్యామిలీ సినిమా ‘షష్టిపూర్తి’.

దూరంగా ఉన్న తల్లిదండ్రులను కలపాలని ఒక కొడుకు చేస్తున్న భావోద్వేగాలపై ఫోకస్ చేశాడు దర్శకుడు పవన్ ప్రభ. చాలావరకు సన్నివేశాలు ఎమోషనల్‌గా రాసుకున్నాడు. ఫస్టాఫ్ నెమ్మదిగా సాగుతుంది.. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ పర్లేదు. దర్శకుడు ఒకవైపు వీళ్ళ ప్రేమను చూపిస్తూనే.. మరొకవైపు రాజేంద్రప్రసాద్, అర్చన మీద కూడా ఫోకస్ బాగానే పెట్టాడు. లేడీస్ టైలర్ తర్వాత వీళ్ళు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో వాళ్ల మధ్య ఎమోషనల్ సీన్స్ బాగానే రాసుకున్నాడు. కుటుంబ విలువలు, తల్లిదండ్రుల పట్ల గౌరవం, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని చూపించాలా ఈ సినిమా కథ రాసుకున్నాడు దర్శకుడు పవన్ ప్రభ. ఉమ్మడి కుటుంబ నేపథ్యం నుంచి స్ఫూర్తి పొందాడని అర్థమవుతుంది. తల్లిదండ్రులను విడిచి పెట్టే వాళ్లకు ఈ సినిమా ఒక గుణపాఠంగా అనిపిస్తుంది.

నటినటులు:

రాజేంద్ర ప్రసాద్ నటన గురించి కొత్తగా ఏం చెప్పాలి.. ఆయనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా కూడా అద్భుతంగా నటిస్తాడు. షష్టిపూర్తి సినిమాలో కూడా అదే చేశాడు. భావోద్వేగ సన్నివేశాల్లో కూడా చాలా బాగా నటించాడు నటకిరీటి. మూడు దశాబ్దాల తర్వాత తెలుగు సినిమాకు తిరిగి వచ్చిన అర్చన.. బాగా నటించింది. రూపేష్ ఎలాంటి బెరుకు లేకుండా బాగానే కనిపించాడు.. ఆకాంక్ష సింగ్ పర్లేదు. మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

ఇళయరాజా సంగీతం ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకు తోట తరణి కళా దర్శకత్వం వహించడం విశేషం. రామ్ సినిమాటోగ్రఫీ, కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ పర్లేదు. పవన్ ప్రభ మంచి కథను తీసుకున్నాడు కానీ కథనం విషయంలో కాస్త వేగం పెంచి ఉంటే బాగుండేది.

పంచ్ లైన్:

ఓవరాల్ గా షష్టిపూర్తి.. అమ్మానాన్నల కథ..!