P Jayachandran: సినిమా ఇండస్ట్రీలో విషాదం.. 16 వేలకు పైగా పాటలు ఆలపించిన లెజెండరీ సింగర్ కన్నుమూత

‘రోజావే చిన్ని రోజావే' (సూర్యవంశం), అనగనగా ఆకాశం ఉంది (నువ్వే కావాలి), హ్యాపీ హ్యాపీ బర్త్‌డేలు (సుస్వాగతం)’ వంటి పలు సూపర్ హిట్ పాటలు ఆలపించిన ప్రముఖ గాయకుడు పి. జయచంద్రన్ (80) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆయన గురువారం (జనవరి 09) రాత్రి తుదిశ్వాస విడిచారు.

P Jayachandran: సినిమా ఇండస్ట్రీలో విషాదం.. 16 వేలకు పైగా పాటలు ఆలపించిన లెజెండరీ సింగర్ కన్నుమూత
P Jayachandran
Follow us
Basha Shek

|

Updated on: Jan 10, 2025 | 6:39 AM

ప్రముఖ  నేపథ్య గాయకుడు పి. జయచంద్రన్ కన్నుమూశారు. కేరళకు చెందిన ఆయన పలు భాషల్లో పాడి సంగీత అభిమానులను అలరించారు. తెలుగులోనూ ఎన్నో సూపర్ హిట్ పాటలకు పి. జయచంద్రన్ గాత్రదానం చేశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న జయచంద్రన్ త్రిసూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పి. జయచంద్రన్ మరణవార్త విని సంగీత అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు . గతేడాది పి. జయచంద్రన్ అనారోగ్యంపై పుకార్లు వచ్చాయి. అయితే ఆ పుకార్లను కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. ఇప్పుడు పి. జయచంద్రన్‌ ఇక లేరన్న వార్త విని అందరూ షాక్‌కు గురయ్యారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, భాష సినిమాల్లో సుమారు 16 వేలకు పైగా పాటలు పాడారు జయచంద్రన్. ఇళయరాజా, ఎ.ఆర్. రెహమాన్, ఎంఎం కీరవాణి, కోటి, విద్యా సాగర్ తదితర దిగ్గజ సంగీత దర్శకులతో ఆయన పనిచేశారు.

జయచంద్రన్‌ తెలుగులోపాడిన‘రోజావే చిన్ని రోజావే (సూర్యవంశం), అనగనగా ఆకాశం ఉంది (నువ్వే కావాలి), హ్యాపీ హ్యాపీ బర్త్‌డేలు (సుస్వాగతం)’ వంటి పాటలు ఎవర్ గ్రీన్ హిట్‌గా నిలిచాయి. 2002లో వచ్చిన ‘ఊరు మనదిరా’లోపాడిన ‘నా చెల్లి చంద్రమ్మ’ తెలుగులో ఆయన చివరిగా ఆలపించిన పాట. ‘శ్రీ నారాయణ గురు’ అనే మలయాళ సినిమా లోని ‘శివ శంకరా సర్వ శరణ్య విభో..’పాటకుగానూ ‘బెస్ట్‌ మేల్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌’గా 1986లో జాతీయ అవార్డు అందుకున్నారీ లెజెండరీ సింగర్. అలాగే ఐదు కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులు, రెండు తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులు కూడా ఆయన్ని వరించాయి. జయచంద్రన్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రముఖుల సంతాపం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.