జయాపజయాలతో సంబంధం లేదు.. మనల్ని స్ట్రాంగ్‌గా ఉంచేది అదేనంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక చిన్న సినిమాతో కెరీర్ మొదలుపెట్టి, నేడు పాన్ ఇండియా స్థాయిలో చక్రం తిప్పుతున్న ఆ భామకు ఇప్పుడు తిరుగులేకుండా పోయింది. కన్నడలో ఎంట్రీ ఇచ్చినా, తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుని ఇప్పుడు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

గత ఏడాది ఆమెకు ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. అయితే ఇంతటి స్టార్ డమ్ వచ్చిన తర్వాత కూడా ఆమె మర్చిపోకూడని ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించానని చెబుతోంది. అసలు ఆమె నేర్చుకున్న ఆ గొప్ప పాఠం ఏంటి? హిందీలో ఆమె నటిస్తున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్ విశేషాలేంటి? ఇంతకీ ఎవరా హీరోయిన్?
నటిగా కొత్త పరిణితి..
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ రాణిస్తూ నేషనల్ క్రష్‌గా అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందన్న. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో అత్యంత బిజీగా ఉన్న నటీమణుల్లో ఒకరు రష్మిక. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత ఏడాది తన సినీ ప్రయాణంలో ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేసింది. భిన్న భాషల్లో, విభిన్నమైన మనస్తత్వం ఉన్న దర్శకులతో పనిచేయడం వల్ల నటిగా తనలో పరిణితి పెరిగిందని ఆమె అభిప్రాయపడింది. “గత ఏడాది నాకు అన్నీ కలిసొచ్చాయి. కొత్త వ్యక్తులను కలవడం వల్ల ఫిల్మ్‌మేకింగ్‌కు సంబంధించిన ఎన్నో రహస్యాలు తెలుసుకోగలిగాను” అని చెప్పుకొచ్చింది రష్మిక.

Mandanna Rashmika
మూలాల్ని మర్చిపోకూడదు..
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని తాను నమ్ముతానని రష్మిక స్పష్టం చేసింది. “జీవితంలో ఎంతటి స్థాయికి చేరుకున్నా మన మూలాలను ఎప్పటికీ మర్చిపోకూడదు. అదే మనల్ని దృఢంగా ఉంచుతుంది. అలాగే జయాపజయాలతో సంబంధం లేకుండా మనదైన వ్యక్తిత్వం, అంకితభావంతో ముందుకు సాగాలని నేను నిర్ణయించుకున్నాను” అని రష్మిక తన మనసులోని మాటను బయటపెట్టింది. సినిమాల ఫలితాల కంటే చేసే పని మీద పెట్టే శ్రద్ధే ముఖ్యమని ఆమె ఉద్ఘాటించింది.
కాక్‌టెయిల్-2లో..
ప్రస్తుతం ఆమె హిందీలో నటిస్తున్న ‘కాక్‌టెయిల్-2’ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సినిమాలో తన పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటుందని రష్మిక తెలిపింది. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఇటువంటి పాత్ర చేయలేదని, ఈ క్యారెక్టర్ ఆడియన్స్‌కు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేసింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యభరితమైన పాత్రలు చేయడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చింది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక మందన్న అంకితభావంతో అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగులో ‘మైసా’ వంటి చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ గ్లోబల్ స్టార్‌గా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది.
