Dil Raju: ఎఫ్ 3 సినిమా టికెట్స్ రేట్లపై స్పందించిన దిల్ రాజు.. ఆ కారణంతోనే పెంచడం లేదంటూ క్లారిటీ..
గతంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఎఫ్ 2 చిత్రానికి సిక్వెల్గా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వెంకటేష్.. వరుణ్ తేజ్ కలిసి నటిస్తోన్న సినిమా ఎఫ్ 3 (F3). గతంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఎఫ్ 2 చిత్రానికి సిక్వెల్గా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఎఫ్ 3 సినిమా కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి ఈ సినిమా మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే.. ఎఫ్ 3 సినిమా రేట్లు పెంచకపోవడానికి గల కారణాలను తెలియజేశారు…
కరోనా సంక్షోభం తర్వాత చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమా టికెట్స్ ధరలను పెంచేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలను టికెట్ ధరలను పెంచడం అనివార్యమయ్యింది. దీంతో రాబోయే ప్రతి సినిమా టికెట్స్ రేట్స్ కచ్చితంగా పెంచేస్తుంది అనుకున్నారు సినీ ప్రియులు.. ఈ క్రమంలోనే తాము ఎఫ్ 3 చిత్రానికి సినిమా టికెట్స్ రేట్స్ పెంచడం లేదంటూ దిల్ రాజ్ అనౌన్స్ చేయడంతో ఇప్పుడిదే సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఆ ప్రకటనపై వివరణ ఇచ్చారు దిల్ రాజు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ” ప్యాండమిక్ తర్వాత పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. సినిమాలు ఆగిపోయి బడ్జెట్ లు పెరిగాయి. ఇదే సమయంలో ఆడియన్స్ ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు రేట్లు పెంచి దానికి సరిపడా రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేశాం. ఇందులో మంచి ఫలితాలు కూడా సాధించాం. ఐతే ఇక్కడ పరిశీలించిన అంశం ఏమిటంటే.. చాలా మంది ప్రేక్షకులు థియేటర్ కి దూరమౌతున్నారు. అలాగే రిపీట్ ఆడియన్స్ తగ్గిపోయారు. అప్పర్ క్లాస్ ఓకే కానీ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఆడియన్స్ మాత్రం థియేటర్ కి రావడం తగ్గిపోవడం గమనించాము. టికెట్ల ధరలు వారికి అందుబాటులో లేకపోవడం దీనికి కారణం. ఎఫ్3 అందరి కోసం తీసిన సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ కలిసొచ్చి చూడాల్సిన సినిమా. ధరలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత జీవో ప్రకారం పాత ధరలకే టికెట్లు రేట్లని తగ్గించాం. చాలా మంది ప్రేక్షకులు ఓటీటీ కూడా అలవాటు పడిపోయారు. వాళ్ళని కూడా థియేటర్ కి రప్పించాలనే ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాం” అన్నారు
అలాగే.. ధరలు తగ్గించిన దాని ప్రకారం మీ బడ్జెట్ ని రీచ్ కాగలరని భావిస్తున్నారా ? అని అడగ్గా.. తనకు థియేట్రికల్ రెవెన్యు కిక్ ఇస్తుంది. ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమా చూడటంలోనే ఒక ఆనందం వుంటుందని. ఫస్ట్ డే, ఫస్ట్ వీక్…సెకండ్ వీక్ ఇలా కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడంలోనే ఒక కిక్ వుంటుందని. ఎఫ్ 3 కి తప్పకుండా రిపీట్ ఆడియన్స్ వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.. . థియేటర్లు ఆడియన్స్ తో కళకళలాడుతాయి. ప్రేక్షకులు ఎఫ్ 3ని మళ్ళీ మళ్ళీ చూస్తారన్నారు.. అంతేకాకుండా.. ప్రసాద్, జీఎంబీ లాంటి ప్రైమ్ మల్టీ ప్లెక్స్ 250 ప్లస్ జీఎస్టీ.. మిగతావి జీఎస్టీ కలుపుతూ 250. హైదరాబాద్ లో సింగల్ స్క్రీన్స్ అన్నీ 150ప్లస్ జీఎస్టీ.. జిల్లాలు జీఎస్టీ కలుపుతూ 150. 250లో మాకు వచ్చేది 125 రూపాయిలే అంటూ చెప్పుకొచ్చారు.