Pawan Kalyan: సింగపూర్ చేరుకున్న చిరంజీవి, పవన్‌కళ్యాణ్.. మార్క్ శంకర్‌కు ప్రమాదం ఏమీ లేదన్న పవన్..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కు జరిగిన ప్రమాదం తెలుగు వారిని కలవరపెట్టింది. సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం తన ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాతే సింగపూర్ బయల్దేరి వెళ్లారు. ఆయనతోపాటు అన్న చిరంజీవి కూడా ఉన్నారు. అయితే మార్క్ పవనోవిచ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించడమేకాదు.. సింగపూర్‌లో ఉన్న అధికారులను అప్రమత్తం చేశారు.

సింగపూర్ స్కూల్లో జరిగిన ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్.. ఆయనతోపాటు మెగాస్టార్ చిరంజీవి సైతం సింగపూర్ బయల్దేరి వెళ్లారు. తాజాగా తన కొడుకు ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అందరి ఆశీస్సులతో తన కొడుకు కోలుకుంటున్నాడని అన్నారు. పవన్ చిన్నకుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో చదువుకుంటున్నారు. ఆయన వయసు ఏడున్నరేళ్లు. ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. పొగ కారణంగా ఊపిరాడక అస్వస్థత గురికావటంతో ఆస్పత్రికి తరలించారు. రివర్ వ్యాలీ రోడ్ షాప్ హౌస్ బిల్డింగ్ 2,3 అంతస్తులు మంటల్లో చిక్కుకున్నాయి. ఇదే భవనంలోని టమాటో కుకింగ్ స్కూల్‌లో మార్క్‌ని చదివిస్తున్నారు. భద్రతా ప్రమాణాల విషయంలో అప్రమత్తంగా ఉండే సింగపూర్‌లో ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోంది.
పవన్ భార్య అన్నా లెజ్‌నోవా ప్రస్తుతం సింగపూర్‌లోనే ఉన్నారు. అక్కడి స్కూల్‌లోనే మార్క్ శంకర్‌ని చదివిస్తున్నారు.. కుమారుడి ప్రమాద వార్తను అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎంకు అధికారులు తెలియజేశారు. పర్యటన నిలిపివేసి వెంటనే సింగపూర్ వెళ్లాలని నేతలు, అధికారులు సూచించారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసిన తర్వాతే సింగపూర్ వెళ్తానన్న పవన్‌కల్యాణ్ తన పర్యటన కొనసాగించారు. అనంతరం రాత్రి 11.30 గంటలకు శంషాబాద్ నుంచి సింగపూర్ వెళ్లారు పవన్. ఆయనతోపాటు చిరంజీవి కూడా వెళ్లారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో 19 మంది గాయపడ్డారని, వీరిలో 15మంది పిల్లలని సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. మంటలు వ్యాపించిన భవనంతోపాటు, పక్కనున్న భవనాల నుంచి 80 మందిని సురక్షితంగా తరలించారు.
పవన్‌కల్యాణ్ కుమారుడి యోగక్షేమాలగురించి తెలుగురాష్ట్రాల నేతలతో పాటు ప్రధాని కూడా ఆరాతీశారు. పవన్‌కల్యాణ్‌కి ఫోన్‌చేసి మాట్లాడారు మోదీ. అంతేకాదు సింగపూర్‌లో ఉన్న ఇండియన్ హై కమిషనర్‌ను అలర్ట్ చేశారు ప్రధాని. అవసరమైన సహకారం అందించాలని విదేశాంగ శాఖను పురమాయించారు. మార్క్‌శంకర్ త్వరగా కోలుకోవాలని జనసేనశ్రేణులు కొన్నిచోట్ల ఆలయాల్లో పూజలు చేశారు. అంతేకాదు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, వైసీపీ అధినేత జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు.. అనేక మంది రాజకీయ నాయకులు, సినీ రంగ ప్రముఖులు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ పవన్ కల్యాణ్ ఓ నోట్ విడుదల చేశారు. అందరి ఆశీస్సులతో మార్క్ శంకర్ కోలుకుంటున్నారని చెప్పారు. ఇక కాళ్లూ చేతులకు గాయాలైన మార్క్‌శంకర్ కోలుకునేందుకు కొన్నిరోజులు పట్టొచ్చంటున్నారు.
ఇవి కూడా చదవండి :