Pawan Kalyan: కీరవాణికి పవన్ ఆత్మీయ సన్మానం.. ఆస్కార్ అవార్డును చూసి ఎలా మురిసిపోయాడో చూశారా? వీడియో

పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తయ్యింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా బుధవారం (మే21) ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని కలిశారు.

Pawan Kalyan: కీరవాణికి పవన్ ఆత్మీయ సన్మానం.. ఆస్కార్ అవార్డును చూసి ఎలా మురిసిపోయాడో చూశారా? వీడియో
Pawan Kalyan, MM Keeravani

Updated on: May 20, 2025 | 1:32 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని కలిశారు. హరిహర వీరమల్లు నుంచి బుధవారం మూడో సాంగ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా ఆస్కార్ విజేతను కలిశారు. ఈ సందర్భంగా కీరవాణితో సరదాగా ముచ్చటించారు. అలాగే ఆయనకు వచ్చిన ఆస్కార్ అవార్డును ఆసక్తిగా చూశారు. ఈ సందర్భంగా కీరవాణిని ఘనంగా సన్మనించారు పవన్ కల్యాణ్. ‘మనలోని పౌరుషం… వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు అని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే- ‘సలసల మరిగే నీలోని రక్తమే…’ అని పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు కీరవాణి. ‘హరిహర వీరమల్లు’లో ఈ గీతం వినిపిస్తుంది. నేటి పరిస్థితులలో మనందరిలో వీరత్వం చేవజారిపోకూడదని చర్నాకోలతో చెప్పినట్లు అనిపించింది. ఈ పాటను 21వ తేదీన అందరికీ విన్పించబోతున్నారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ సినిమా కోసం ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశాను. ‘వీరమల్లు’కి ప్రాణం పోశారు అంటే అతిశయోక్తి కాదు. ‘మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే… అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టు ఉండాలి కదా’ అనడం కీరవాణిలో అంకిత భావాన్ని తెలియచేస్తోంది’

‘ఈ రోజు ఉదయం ఆస్కార్ గ్రహీత కీరవాణి ని కలిసి సాగించిన సంభాషణ ఎంతో సంతోషాన్ని కలిగించింది. సంగీత దర్శకులు చక్రవర్తి గారి దగ్గర శిష్యరికం నుంచి సరస్వతి పుత్రులైన వేటూరి సుందర రామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వరకూ తనకున్న అనుబంధాన్ని, సంగీత సాహిత్యాల గురించి చెబుతుంటే సమయం తెలియలేదు. కీరవాణి గారి దగ్గర ఉన్న వయొలిన్లు చూసి వాటి గురించి మాట్లాడుకొంటున్నప్పుడు – నేను వయొలిన్ నేర్చుకోవడం, జంట స్వరాల వరకూ నేర్చుకొని వదిలేయడం గుర్తు చేసుకున్నాను. చిదంబరనాథన్ గారు ఇచ్చిన వయొలిన్ ను ఎంత భద్రంగా దాచుకున్నారో చూపించారు కీరవాణి .
తెలుగు కథలను ప్రేమించే కీరవాణి తనకు అమితంగా నచ్చిన 32 కథలను ఒక సంకలనంలా చేసుకొన్నారు. వాటిని నాకు బహూకరించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అందులో కీరవాణి గారు రాసిన రెండు కథలు కూడా ఉన్నాయి. ఆయన సరిగమలతో బాణీలు కూర్చే కూర్పరి మాత్రమే కాదు… చక్కటి తెలుగు పదాలతో గీతాలు అల్లగల నేర్పరి కూడా. తన పదాలతో గీత రచయితలకు మార్గం వేస్తారు. తెరపై కనిపించేది రెండున్నర గంటల సినిమాయే… కానీ కీరవాణి రోజుల తరబడి, నెలల తరబడి ఆ సినిమా కోసం తపనపడతారు. సృజనాత్మక స్వరాలతో మైమరపిస్తూ తెలుగు పాటను ఆస్కార్ వేదికపైకి తీసుకువెళ్లారు’

కీరవాణితో పవన్ కల్యాణ్.. వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.