Pawan Kalyan: పాలిటిక్స్‌లో యాక్టివ్ అయిపోయిన జనసేనాని.. పవర్ స్టార్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురుచూపు
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలు చేస్తారా చేయరా..? మరో ఏడాదిన్నరలోనే ఎన్నికలు రానుండటంతో.. ఇప్పటి నుంచే రాజకీయాల్లో బిజీ అయిపోయారు జనసేనాని.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూవీస్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి? ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలు ఆయన ఎప్పుడు పూర్తి చేస్తారు..? మరో ఏడాదిన్నరలోనే ఎన్నికలు రానుండటంతో.. ఇప్పటి నుంచే రాజకీయాల్లో బిజీ అయిపోయారు జనసేనాని. మరి ఆ జనాన్ని వదిలేసి.. మళ్లీ కెమెరా ముందుకొచ్చేదెప్పుడు..? ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసేదెప్పుడు..? కమిటైన సినిమాల్లో దేన్ని ముందు పూర్తి చేస్తారు..? వీటికి సమాధానం తెలియక.. దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
అక్టోబర్ 5 నుంచి పొలిటికల్ టూర్‌లో బిజీ అవుతానని ఆ మధ్య చెప్పారు పవన్ కళ్యాణ్. కానీ చెప్పిన డేట్ కంటే చాలా ముందుగానే రాజకీయాల్లో బిజీ అయిపోయారు. పైగా గత రెండు నెలలుగా పవర్ స్టార్ షూటింగ్స్‌కు దూరంగానే ఉంటున్నారు. చివరగా హరిహర వీరమల్లు షెడ్యూల్‌లోనే పాల్గొన్నారు. ఇది జరిగి కూడా చాలా రోజులైపోయింది. దాని తర్వాత కొన్నాళ్లు అనారోగ్యం.. మరికొన్ని రోజులు పొలిటికల్ టూర్స్‌తో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లుతో పాటు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలకు సైన్ చేసారు. వీటితో పాటు సముద్రఖని దర్శకత్వంలో వినోదీయ సీతం రీమేక్ కన్ఫర్మ్ అయింది. వీటిలో క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయింది. ఏడాదిగా ఈ సినిమాను పవన్ ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారా? అని క్రిష్ వేచి చూస్తున్నారట.
ఇక హరీష్ శంకర్ మూడేళ్లుగా పవన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. రాజకీయంగా ఇంత బిజీ అయిపోయిన పవన్.. ఒప్పుకున్న సినిమాలన్నింటినీ అనుకున్న సమయంలో పూర్తి చేస్తారా అనేది అనుమానమే. ఇప్పటికే హరిహర వీరమల్లు ఆలస్యమవుతూనే ఉంది.. మరోవైపు మిగిలిన సినిమాలపై ఈ ప్రభావం పడటం ఖాయం. దాంతో దర్శక నిర్మాతలకు హై టెన్షన్ తప్పట్లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పవన్ వీటన్నింటినీ ఎప్పటికి పూర్తి చేస్తారో.. అసలు పూర్తి చేస్తారో లేదో అనే మేకర్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట.




అటు ఫ్యాన్స్ కూడా పవర్ స్టార్ సినిమాల కోసం కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా హరిహర వీరమల్లును త్వరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు.
మరిన్ని సినిమా వార్తలు చదవండి




