Nenu Student Sir! Movie Review: ‘నేను స్టూడెంట్ సర్’ సినిమా రివ్యూ..

| Edited By: Rajitha Chanti

Jun 02, 2023 | 3:25 PM

గతేడాది దసరాకు ‘స్వాతిముత్యం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు బెల్లంకొండ గణేష్. మొదటి సినిమా థియేటర్స్‌లో ఫ్లాప్ అయినా.. ఓటిటిలో మాత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మంచి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు గణేష్. అన్నయ్య బెల్లంకొండ శ్రీనివాస్ తరహాలో మాస్ కాకుండా క్లాస్ వైపు అడుగులు వేస్తున్నాడు ఈ కుర్రాడు. తాజాగా నేను స్టూడెంట్ సార్ అంటూ ఆడియన్స్ ముందుకొచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది..?

Nenu Student Sir! Movie Review: నేను స్టూడెంట్ సర్ సినిమా రివ్యూ..
Nenu Student Sir Movie Revi
Follow us on

సినిమా రివ్యూ: నేను స్టూడెంట్ సర్

నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు

సినిమాటోగ్రఫర్: అనిత్ కుమార్

ఇవి కూడా చదవండి

సంగీత దర్శకుడు: మహతి స్వర సాగర్

రచన: కృష్ణ చైతన్య

దర్శకత్వం : రాఖీ ఉప్పలపాటి

నిర్మాత: నాంది సతీష్ వర్మ

గతేడాది దసరాకు ‘స్వాతిముత్యం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు బెల్లంకొండ గణేష్. మొదటి సినిమా థియేటర్స్‌లో ఫ్లాప్ అయినా.. ఓటిటిలో మాత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మంచి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు గణేష్. అన్నయ్య బెల్లంకొండ శ్రీనివాస్ తరహాలో మాస్ కాకుండా క్లాస్ వైపు అడుగులు వేస్తున్నాడు ఈ కుర్రాడు. తాజాగా నేను స్టూడెంట్ సార్ అంటూ ఆడియన్స్ ముందుకొచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది..?

కథ:

సుబ్బారావు (బెల్లంకొండ గణేష్ బాబు) కాలేజ్ స్టూడెంట్. అతడికి ఐ ఫోన్ అంటే పిచ్చి. అందులోనూ ఐఫోన్ 12 అంటే ప్రాణం. అందుకే 9 నెలలు కష్టపడి రూ.90 వేల రూపాయలు సంపాదించి ఆ ఫోన్ కొంటాడు. దాన్ని సొంత తమ్ముడిలా చూసుకుంటాడు. ముద్దుపేరు కూడా పెట్టుకుంటాడు. అయితే ఆ ఫోన్ కొన్న రోజునే కాలేజీలో అనుకోని గొడవ జరిగి అంతా పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సి వస్తుంది. పోలీసులు సుబ్బు ఫోన్ తీసుకుంటారు. తన ఫోన్ తిరిగివ్వండని స్టేషన్‌కు వెళ్లినపుడు ఫోన్ కనిపించదు. దీంతో కమిషనర్ అర్జున్ వాసుదేవన్‌ (సముద్రఖని) కు కంప్లయింట్ ఇవ్వడానికి వెళ్తాడు. అయితే అతను కూడా సుబ్బును పట్టించుకోడు. దాంతో కమీషనర్ కూతురు శ్రుతి వాసుదేవన్‌ (అవంతిక దాసాని) తో స్నేహం చేసి తన ఫోన్ దక్కించుకోవాలనుకుంటాడు. అప్పుడే మనోడి మీద మర్డర్ కేసు పడుతుంది. మరి ఈ కేసు నుంచి సుబ్బు ఎలా బయటపడ్డాడు..? పోయిన ఫోన్ దొరికిందా లేదా అనేది అసలు కథ..

కథనం:

కొన్ని సినిమాల్లో కథ చాలా చిన్నగా ఉంటుంది. ఒక్క లైన్‌తోనే కథలను అల్లేస్తుంటారు దర్శకులు. ‘నేను స్టూడెంట్ సర్’ కూడా అలాంటి సినిమానే. ఇందులో దర్శకుడు తీసుకున్న కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్క ఫోన్ చుట్టూ తిరిగే కథ కాదు ఇది. అందులోనే కావాల్సినన్ని ట్విస్టులు పెట్టాడు దర్శకుడు. అయితే అవన్నీ సరిగ్గా వర్కవుట్ అయ్యుంటే మాత్రం కచ్చితంగా ఈ స్టూడెంట్ నెంబర్ వన్ అయ్యుండేవాడు. కానీ కొన్ని లోపాలతో యావరేజ్ స్టూడెంట్‌గానే మిగిలిపోయాడు. కొత్త కాన్సెప్ట్‌ను ట్రైలర్‌లో కానీ.. ఎక్కడా ప్రమోషన్స్‌లో కానీ రివీల్ చేయలేదు మేకర్స్. కాకపోతే మంచి కాన్సెప్టే అయినా ఫస్టాఫ్ అంతా చాలా నెమ్మదిగా సాగుతుంది. చూపించడానికి ఏం లేదన్నట్లు సాగదీసారు. హీరో కాలేజ్ సీన్స్.. హీరోయిన్‌తో ట్రాక్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంటర్వెల్ నుంచే అసలు కథ మొదలవుతుంది. హీరోకు ఫోన్ అంటే ఎంత పిచ్చి అనేది చాలా సీన్స్‌లో చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ‘బ్లాక్ ఐఫోన్… 12 సిరీస్… 64 జీబీ… రూ.89,999’ అనే డైలాగ్ ఒకటి.. అలాగే ఫోన్‌కు బుజ్జిబాబు అని పేరు పెట్టుకోవడం అన్నీ తర్వాత కథకు లింక్ పెట్టాడు దర్శకుడు రాఖీ. ఓ మిడిల్ క్లాస్ కుర్రాడికి ఐ ఫోన్ అనేది ఎంత పెద్ద విషయం అనేది ఇందులో అర్థమవుతుంది. పైగా దానికోసం కమీషనర్ లాంటి వాడికి కూడా ఎదురెళ్లడం.. ప్రాణాలకు కూడా తెగించడం లాంటి సీన్స్ ఉంటాయి. అయితే ఎంత చూసినా ఫోన్ కంటే ప్రాణం తక్కువ కాదు కదా.. అందుకే ఈ సీన్స్ అన్నీ అంత కన్విన్సింగ్‌గా అనిపించవు. పైగా లవ్ స్టోరీ కూడా కామెడీగానే ఉంటుంది. ప్రేమించిన వాడు అడిగాడని కమీషనర్ గన్ తీసుకొచ్చి ఇస్తుంది హీరోయిన్. ఆమె కారెక్టర్ ఎంత వీక్‌గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క సీన్ చాలు. ఇలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి సినిమాలో. సెకండాఫ్ కూడా పెద్దగా ఆసక్తికరంగా అనిపించదు. కాన్సెప్ట్ బాగుంటే సరిపోదు.. కథనం కూడా బాగుంటేనే సినిమా ఆడుతుంది. ఈ విషయంలో నేను స్టూడెంట్ సార్ వెనకబడ్డాడు.

నటీనటులు:

బెల్లంకొండ గణేష్ మరోసారి స్క్రీన్ మీద అమాయకంగా కనిపించాడు. స్వాతిముత్యం తరహాలోనే ఇందులోనూ అమాయాకుడిగా కనిపించాడు. ఫస్టాఫ్‌లో అయితే మరీనూ.. సెకండాఫ్‌లో కాస్త ఇంటెలిజెంట్‌గా కనిపిస్తాడు. శృతి వాసుదేవన్ పాత్రలో అవంతికా దాసాని జస్ట్ ఓకే. ఆమె కారెక్టర్ అంతగా ఆకట్టుకోలేదు. తన డైలాగ్స్‌కు లిప్ సింక్ లేకపోవడం పెద్ద మైనస్. కమిషనర్‌గా సముద్రఖని బాగున్నాడు. హీరో తర్వాత వెయిటేజ్ ఉన్న పాత్ర ఇదే. సునీల్ కాసేపు నవ్విస్తాడు. జబర్దస్త్ రాంప్రసాద్‌కు కొంచెం కొత్త తరహా పాత్ర లభించింది కానీ అందులో నటనకు ఏమాత్రం స్కోప్ లేదు.

టెక్నికల్ టీం:

మహతి స్వరసాగర్ సంగీతం పర్లేదు. పాటలు అంతగా ఆకట్టుకోవు. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఎడిటింగ్ ఫస్టాఫ్ చాలా వీక్. అసలు కథ అంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. దర్శకుడు రాఖీ ఉప్పలపాటి పెద్దగా ఆకట్టుకోలేదు. మంచి కాన్సెప్ట్ తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లే లోపాలతో నేను స్టూడెంట్ సార్ యావరేజ్‌గానే మిగిలిపోయాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా నేను స్టూడెంట్ సార్.. నేను జస్ట్ యావరేజ్ సార్..