ఆయన నాకు అన్నం కలిపి పెట్టాడు.. అది చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి.. మెగాస్టార్ ఎమోషనల్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో బాస్ అంటే టక్కున చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో సినిమాలు మరెన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు చిరంజీవి. అనతికాలంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ కెరీర్‌లో తొలుత కాస్త.. ఇబ్బందులు ఎదుర్కొన్నా.. అనంతరం.. ‘ఖైదీ’ సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోలేదు.

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో మెగా అభిమానులంతా ఆనందంలో తేలిపోతున్నారు. ఇలాంటి విజయాలు మెగాస్టార్ కు కొత్తేమీ కాదు.. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. చిరంజీవి ఎంతో మంది గొప్ప గొప్ప దర్శకులతో పని చేశారు. ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ గారితో తన అనుబంధాన్ని, స్వయంకృషి చిత్రం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
విశ్వనాథ్ గారు తెరకెక్కించిన సినిమాలు ఆయన మనసులో నుండి ఉద్భవించిందేనని, సమాజం పట్ల ఆయనకు గల నిబద్ధత, కళల పట్ల మక్కువ, సత్సంప్రదాయాలపై అభిమానం, వాటిని కాపాడాలనే తపన ఆయన సినిమాల్లో స్పష్టంగా ప్రతిబింబిస్తాయని చిరంజీవి అన్నారు. ముఖ్యంగా, మానవతా విలువలకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో తన సినిమాల్లో చూపిస్తారని మెగాస్టార్ అన్నారు. విశ్వనాథ్ గారితో చిరంజీవి చేసిన రెండవ చిత్రం స్వయంకృషి తన జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని, అనేక మందిని స్ఫూర్తినిచ్చిందని అన్నారు.
స్వయంకృషి చిత్రంలోని సాంబయ్య పాత్ర, ఒక చెప్పులు కుట్టే వ్యక్తి .. ఒక పెద్ద షూ కంపెనీకి యజమానిగా ఎదిగినా తన మూలాలను మర్చిపోకుండా ఉండడం, అణకువను ప్రదర్శించడం విశేషం. ఈ పాత్రలో నటించడం అంత సులభం కాదని చిరంజీవి అన్నారు. చెప్పులు కుట్టేవాడు ఎలా కూర్చోవాలి, కత్తి ఎలా పట్టుకోవాలి, దాన్ని ఎలా కుట్టాలి వంటి ప్రతి చిన్న వివరాల కోసం ఒక నిజమైన చెప్పుల కుట్టే వ్యక్తిని సెట్లోకి పిలిపించి, ఆయన పక్కన ఉండి సాధన చేశానని తెలిపారు చిరంజీవి. కత్తిని రాయిపై పదును పెట్టడం, చెప్పులను కాళ్ల మధ్య ఉంచి కుట్టడం, దారానికి మైనం పూయడం వంటి ప్రతి కదలికను ఎఫర్ట్‌లెస్‌గా కనిపించేలా శిక్షణ పొందానని తెలిపారు. ఇది నటుడిగా తన నిబద్ధతకు నిదర్శనం అని చిరంజీవి అన్నారు. అలాగే స్వయం కృషి సినిమా సమయంలో సాంగ్స్ కోసం నేను స్లిమ్ గా కనిపించడం కోసం మధ్యాహ్నం ఏమీ తినేవాడిని కాదు. బ్రేక్ లో నిద్రపోయాను. నేను ఏమీ తినలేదు అని తెలిసిన విశ్వనాద్ గారు.. స్వయంగా అన్నం కలిపి అసిస్టెంట్ కు ఇచ్చి పంపించారు.. అది చూసి నా కళ్లలో నీళ్లు వచ్చాయి. అందుకే ఆయనను నేను నా తండ్రితో సమానం అంటుంటాను. నాకు మారే దర్శకుడిపై అంత అభిమానం లేదు అని చిరంజీవి అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




