
మెగాస్టార్ చిరంజీవి తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలు, కొన్ని పరాజయాలను చవిచూశారు. ఆయన గతంలో ఆయన ఓ సందర్భంలో ‘స్నేహం కోసం’ చిత్రం ఫలితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ, కథ తనకు చాలా నచ్చిందని, స్నేహం, లాయల్టీ వంటి బలమైన సెంటిమెంట్‌తో కూడిన కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తాను గట్టిగా నమ్మానని చిరంజీవి వివరించారు. అయితే, సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ, తెలుగు ప్రేక్షకులు తనను ఆ పాత్రలో పూర్తిగా అంగీకరించలేకపోయారని చిరంజీవి తెలిపారు. ముఖ్యంగా, తన పాత్ర విజయ్ కుమార్ చెప్పులు మోయడం వంటి సన్నివేశాలు తెలుగు ప్రేక్షకుల మనస్తత్వానికి, తన ఇమేజ్‌కు సరిపోలేదని, అదే ‘ఇమేజ్ సమస్య’గా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.
తమిళ మూలాలున్న ఆ కథలోని కొన్ని అంశాలు తెలుగు ప్రేక్షకుల సెంటిమెంట్లతో సరిగ్గా కనెక్ట్ కాలేకపోయాయన్నారు. వ్యక్తిగతంగా ఆ చిత్రంలోని తన నటన, ముఖ్యంగా జైలు నుంచి విడుదలైన తర్వాత వచ్చే ఒక ఎమోషనల్ సీన్ తనకు ఎంతో నచ్చిందని, ఒక నటుడిగా తాను ఆ పాత్రతో పూర్తిగా లీనమయ్యానని చిరంజీవి అన్నారు. కానీ, ప్రేక్షకులను ఆ స్థాయిలో కదిలించడంలో చిత్రం విఫలమైందని చిరంజీవి అన్నారు.
సినిమా ఫలితాలను తాను ఎలా స్వీకరిస్తారనే ప్రశ్నకు బదులిస్తూ, మొదట్లో సినిమా విజయాలు వచ్చినప్పుడు పొంగిపోవడం, పరాజయాలు వచ్చినప్పుడు కుంగిపోవడం వంటి భావోద్వేగాలను అనుభవించినట్లు చిరంజీవి తెలిపారు. అయితే, తన కెరీర్ ప్రారంభంలో 7-10 సంవత్సరాల పాటు ఈ టర్బులెన్స్‌ను చూసిన తర్వాత, సినిమా విజయం లేదా పరాజయం కేవలం ఒకరి కృషి కాదని ఆయన గ్రహించా అన్నారు. సినిమా అనేది అందరి సమిష్టి కృషితో తయారవుతుందని, కాబట్టి హిట్ అయినా, ఫ్లాప్ అయినా అది అందరిదై ఉంటుందని ఆయన అన్నారు. ఈ సూత్రాన్ని అర్థం చేసుకున్న తర్వాత, తాను వ్యక్తిగతంగా విజయాలకు అతిగా సంతోషించడం లేదా పరాజయాలకు అతిగా బాధపడటం మానేశానని చిరంజీవి వివరించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.