మూవీ రివ్యూ: మారుతినగర్ సుబ్రమణ్యం
నటీనటులు: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, ప్రవీణ్ తదితరులు
సంగీతం: కళ్యాణ్ నాయక్
ఫొటోగ్రఫీ: బాల్ రెడ్డి
ఎడిటర్: నాగేశ్వరరావు
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: లక్ష్మణ్ కార్య
సమర్పణ: తబిత సుకుమార్
నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య
అన్నిసార్లు హీరో చుట్టూ కథ ఏం రాసుకుంటాంలే అని.. కొన్నిసార్లు కథనే హీరో చేయాలని ప్రయత్నిస్తుంటారు కొందరు దర్శకులు. అలాంటి దర్శకుడే లక్ష్మణ్ కార్య.. అలా ట్రై చేసిన సినిమా మారుతినగర్ సుబ్రహ్మణ్యం. రావు రమేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ఎలా ఉందో ఒకసారి పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
సుబ్రహ్మణ్యం (రావు రమేష్) మారుతి నగర్ లో ఉంటాడు. జీవితాంతం గవర్నమెంట్ జాబ్ కోసం అన్ని పోటీ పరీక్షలు రాస్తాడు ఒకసారి జాబ్ వచ్చినా కూడా కొన్ని కారణాల వల్ల అది ఆయన వరకు రాదు. దాంతో పాతిక సంవత్సరాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగం కోసం మాత్రమే వెయిట్ చేస్తూ ఇంట్లో ఖాళీగా ఉండిపోతాడు. ఆయన భార్య కళారాణి (ఇంద్రజ) కుటుంబ బాధ్యత పోషిస్తూ ఉంటుంది. వీళ్ళ కొడుకు (అర్జున్) కూడా తండ్రి మాదిరే ఇంట్లో ఉండిపోతాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన తండ్రి అని.. అల్లు అర్జున్ తన అన్నయ్యే అని.. చిన్నప్పుడే పిల్లలను మాచాలని అందరికీ చెప్తూ ఉంటాడు. అదే సమయంలో ఒకరితో బ్రేక్ అప్ అయిన కాంచన (రమ్య పసుపులేటి)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అలా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో ఒకరోజు సుబ్రమణ్యం అకౌంట్లో ఉన్నటువంటి 10 లక్షలు పడతాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు.. కానీ తెలియకపోవడంతో సొంత అవసరాల కోసం వాడుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నవి అనేది మారుతినగర్ సుబ్రహ్మణ్యం కథ..
కథనం:
అన్ని సినిమాల్లోనూ కథలు హీరో చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి అలాంటి కథల వైపు ఎక్కువగా అడుగులు వేస్తున్నారు దర్శకులు. ఇలాంటి సమయంలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్టును హీరోగా తీసుకొని కథ రాయడం అనేది చిన్న విషయం కాదు. అది చేశాడు లక్ష్మణ్ కార్యా. మారుతి నగర్ సుబ్రమణ్యం పూర్తిగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథ. ప్రభుత్వ ఉద్యోగం కోసం పాతికేళ్లుగా ఎదురుచూస్తున్న సగటు మధ్య తరగతి వ్యక్తి కథ. ఏదో కాలక్షేపం కోసం చూస్తే ఓకే గానీ.. కథలో సీరియస్ గా ఇన్వాల్వ్ అయితే మాత్రం దొరికిపోతాడు ఈ సుబ్రమణ్యం.
సినిమాలో ఓ సీన్ ఉంటుంది.. సుబ్రమణ్యంను ఆయన భార్య దారుణంగా తిడుతుంది. అంత హెవీ సీన్ పడిన వెంటనే సంబంధం లేకుండా కామెడీ సీన్ వస్తుంది. సినిమాలో ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం పై మనకు ఇంప్రెషన్ పోతుంది. ఎందుకో తెలియదు కానీ.. ఎమోషన్ క్యారీ చేయాల్సిన చోట కూడా కామెడీతో కవర్ చేయాలని చూసాడు దర్శకుడు. సినిమాలో ఫన్ లేదని కాదు ఉంది కానీ అన్ని చోట్ల అదే ఉంటే బాగుండదు. ఒకటి రెండు మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి కానీ వెంటనే వచ్చే కామెడీ ఆ ఇంపాక్ట్ పోగొడుతుంది. సినిమా అంతా ఏమో గాని చివరి 20 నిమిషాలు మాత్రం.. అద్భుతమైన రైటింగ్ తో ఆకట్టుకున్నాడు దర్శకుడు లక్ష్మణ్ కార్య. క్లైమాక్స్ 15 నిమిషాలు స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అప్పటి వరకు ఉన్న అన్ని ప్రశ్నలకు క్లైమాక్స్ లో సమాధానం ఇచ్చాడు దర్శకుడు.
నటీనటులు:
మారుతినగర్ సుబ్రహ్మణ్యం పాత్రలో రావు రమేష్ అద్భుతంగా నటించాడు. ఆయనకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. ఇదివరకు చాలా సినిమాల్లో ఈ తరహా పాత్రలు చేశాడు. ఆయన కొడుకుగా అంకిత్ కొయ్య అదిరిపోయాడు. సీనియర్ నటి ఇంద్రజ సినిమాకు ప్లస్. మరో హీరోయిన్ రమ్య పాత్రతో కేవలం యూత్ ను టార్గెట్ చేశాడు దర్శకుడు. అజయ్, ప్రవీణ్ మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీం:
మారుతినగర్ సుబ్రమణ్యం సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్ సంగీతం. కళ్యాణ్ నాయక్ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ కూడా పర్లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు లక్ష్మణ్ కార్య కామెడీ వరకు బాగానే కవర్ చేశాడు కానీ ఎమోషనల్ సీన్స్ ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ చేయాల్సి ఉండేది.
పంచ్ లైన్:
ఓవరాల్ గా మారుతినగర్ సుబ్రమణ్యం.. కాసేపు కాలక్షేపం కోసం..!